ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి, అమరావతి రాజధాని గురించి అత్యంత అవమానకరంగా మాట్లాడిన మాజీ జర్నలిస్టు వీవీఆర్ కృష్ణంరాజు ఎట్టకేలకు అరెస్టు అయ్యారు. సాక్షి టీవీ చానెల్ నిర్వహించిన, కొమ్మినేని శ్రీనివాసరావు లైవ్ షోలో 6వ తేదీన పాల్గొని అమరావతిని వేశ్యల రాజధానిగా అభివర్ణించడం ద్వారా.. తన నోటిదురుసుతనం ప్రదర్శించిన కృష్ణంరాజు వారం రోజులుగా పరారీలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అమరావతిలో అగ్గి రాజేసి.. కుటుంబంతో సహా పరారై.. రోజుకో చోటుకు మకాం మారుస్తూ ఊర్లు తిరుగుతున్న కృష్ణం రాజు విజయనగరం జిల్లాలో తలదచుకుంటూ.. అక్కడినుంచి కూడా పరారవ్వడానికి వాహనంలో వెళుతున్న సమయంలో పోలీసులు అరెస్టు చేశారు. కొమ్మినేని ఆల్రెడీ రిమాండులోనే ఉన్నారు గనుక.. ఇక్కడితో ఈ అసభ్య వ్యాఖ్యల కేసుకు సంబంధించి.. ఏ1, ఏ2 ఇద్దరూ అరెస్టు అయినట్టు అయింది.
ఇంతేనా? ఇంతటితో సరిపోతుందా? అనేది ప్రజల మదిలో మెదలుతున్న సందేహం. ఎందుకంటే.. అమరావతిని అపకీర్తి పాల్జేయడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గానీ, జగన్మోహన్ రెడ్డి గానీ.. సుదీర్ఘకాల ప్రణాళిక సాగిస్తున్న విషప్రచారంలో కృష్ణంరాజు కేవలం ఒక టూల్ మాత్రమేనని, ఈ వ్యవహారాన్ని ప్రాథమికంగా దర్యాప్తు చేసిన తర్వాత పోలీసులు అభిప్రాయపడుతున్నారు. మూడురోజుల కిందట హైదరాబాదులోని నివాసంలో కొమ్మినేని ని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయనను కోర్టుకు సమర్పించిన సమయంలో పోలీసులు రిమాండ్ రిపోర్టులో కూడా ఇదే విషయాన్ని పేర్కొన్నారు. కృష్ణంరాజు వ్యాఖ్యలు ఒక వ్యూహం ప్రకారమే వచ్చాయని, వాటి వెనుక ముందు ముందు కూడా సుదీర్ఘకాలంపాటు అమరావతిని అపకీర్తి పాల్జేసే కుట్ర ఉన్నదని, సాక్షి ఛానెల్ దీనిని నడిపిస్తున్నదని పోలీసులు అనుమానిస్తున్నారు.
మరి అలాంటప్పుడు.. కృష్ణంరాజు కేవలం ఈ కుట్రలో ఒక పాత్రధారి మాత్రమే కదా? ఆయనతో తనకు ఉన్న పూర్వపరిచయాన్ని స్నేహాన్ని వాడుకుని, జర్నలిస్టు ముసుగులో ఆయనను చర్చకు పిలవడం ద్వారా.. ఆయన ద్వారా నిందలు వేయించవచ్చునని కేఎస్ఆర్ ప్రణాళిక ప్రకారం వ్యవహరించి ఉండవచ్చు. అలా బురద చల్లారు. కానీ దీనిని తెరవెనుక నుంచి నడిపించిన సూత్రధారుల్ని కూడా అరెస్టు చేసినప్పుడే కదా.. వారికి కూడా శిక్షలు పడినప్పుడే కదా ఇలాంటి కుట్రలు ఆగేది అని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. అమరావతి మీద విషం కక్కడం వెనుక దాగిఉన్న అసలు వ్యక్తుల బాగోతాన్ని పోలీసులు ఎప్పటికి బయటకు తీస్తారో అని ఎదురుచూస్తున్నారు.
కృష్ణంరాజు అరెస్టు : సూత్రధారుల భరతం పట్టేదెప్పుడు?
Friday, December 5, 2025
