తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ మీద మళ్ళీ అలిగారు. అందులో కొత్త ఏముంది అనుకుంటున్నారా.. ఈసారి తాను సీరియస్ గానే అలిగానని సంకేతాలు ఇవ్వడానికి ‘పార్టీకి రాజీనామా చేస్తున్నాను’ అని కూడా ఆయన ఫోన్ ద్వారా నాయకులకు సమాచారం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రేకు ఫోను చేసి తన రాజీనామా ఆలోచన వెల్లడించడం జరిగింది. అలిగి రాజీనామా చేయదలుచుకున్న నాయకుడు తనంతట తాను చేసి పంపకుండా.. ఠాక్రేకు ఫోను చేసి చెప్పడమే ఒక రాజనీతికి నిదర్శనం. దానికి తగ్గట్టుగానే ఠాక్రే ఆయనను బుజ్జగించటానికి ఇంటికి వెళ్ళిపోయారు.
కోమటిరెడ్డి కూడా తనకు కావలసింది ‘బుజ్జగింపులు, తద్వారా తన మాట చెల్లుబాటు కావడం మాత్రమే తప్ప ఈ సమయంలో పార్టీని వదిలిపోవడం కాదు’ అని ఇన్ డైరెక్టుగా సంకేతాలు ఇవ్వదలుచుకున్నట్టున్నారు. అందుకే భేటీ తర్వాత కొంత మెత్తబడ్డట్టుగా కనిపిస్తున్నారు.
అయితే తాజాగా ఈ అలక అనేది ఆయన చెప్పుకుంటున్నట్లుగా కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీలో గాని రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీలో గాని తనకు స్థానం దక్కకపోవడం వల్ల మాత్రమేనా.. లేదా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అని పలువురు అనుమానిస్తున్నారు. నకిరేకల్ నియోజకవర్గంలో నుంచి భారాస నాయకుడు వేముల వీరేశం కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న నేపథ్యంలో కోమటిరెడ్డి తన శక్తి మేరకు అడ్డుపడడానికి ప్రయత్నిస్తున్నారు. నకిరేకల్ లో తన మాటే చెల్లుబాటు అవుతుందని, తనుచెప్పిన వారికే టికెట్ ఇస్తారని, వేముల వీరేశానికి ఎట్టి పరిస్థితుల్లో టికెట్ రానివ్వనని గతంలో కోమటిరెడ్డి తన అనుచరులతో పదేపదే చెప్పుకున్నా రు.
ఆయన చెప్పిన వారికే టికెట్ ఇచ్చే అంతటి ప్రాధాన్యం ఆయనకు పార్టీలో ఉన్నదో లేదో తర్వాత.. రాష్ట్రస్థాయి సీనియర్ నాయకులు పలువురు ఉండే స్క్రీనింగ్ కమిటీలో ఆయనకు చోటు కూడా దక్కకపోవడం అనేది బాధించినట్లుగా ఉంది. ఈ లెక్కన తన అభ్యంతరాలతో నిమిత్తం లేకుండా.. నకిరేకల్ సీటును వేముల వీరేశం కు కట్టబెట్టేస్తారేమో అనే భయం కూడా కోమటిరెడ్డిలో ఏర్పడినట్లుగా కనిపిస్తోంది. వేములకు బ్రేకులు వేయడం కోసమే పార్టీని బెదిరించడానికి ఆయన అలక డ్రామా ఆడుతున్నారేమో అని పలువురు భావిస్తున్నారు.
గతంలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలుమార్లు పార్టీ మీద అలిగారు. పీసీసీ చీఫ్ పదవి తనకు ఇవ్వలేదని కూడా అలిగారు. మాటిమాటికీ అలిగేకొద్దీ.. ఆయన అలక అనేది ‘నాన్నా పులి’ కథ లాగా అయిపోతున్నదని పార్టీ నాయకులే అంటున్నారు.