మోదీ ప్రభుత్వంపై `సుప్రీం’లో పోరుకు సై అంటున్న కేసీఆర్

Saturday, January 18, 2025

దేశంలో మరే ప్రతిపక్ష ముఖ్యమంత్రి సాహసించని రీతిలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ఒక వంక ఉధృతంగా రాజకీయ పోరాటం చేస్తూ, మరోవంక న్యాయపోరాటానికి టీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు సిద్దపడుతున్నారు.

రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు అన్ని మోదీ ప్రభుత్వం ఇస్తున్న నిధుల ద్వారానే అంటూ బీజేపీ నాయకులు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టడం కోసం రాజ్యాంగబద్దంగా ఇవ్వాల్సిన నిధులు కూడా కేంద్రం ఇవ్వడం లేదంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించే అంశం పరిశీలిస్తున్నట్లు తెలుస్తున్నది.

ఇప్పటికే ఈ విషయమై న్యాయనిపుణులతో కేసీఆర్ స్వయంగా చర్చలు జరుపుతున్నారు. డిసెంబర్ మొదటి వారంలో జరుగనున్న రాష్ట్ర అసెంబ్లీ సమావేశంలో సహితం ఈ అంశాన్ని చర్చకు పెట్టి, ఓ తీర్మానాన్ని ఆమోదించే అవకాశం ఉంది. 14, 15 ఆర్థిక సంఘాలు చేసిన సిఫారసుల మేరకు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్లను విడుదల చేయడం లేదనే విషయాన్ని అసెంబ్లీ వేదికగా నిలదీయాలని కేసీఆర్ నిర్ణయించారు.

రాష్ట్రానికి వివిధ మార్గాల కింద రావాల్సిన నిధులను డిమాండ్‌ చేస్తూ, ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్దపడుతున్నారు. కేంద్ర సర్కారు విధించిన ఆంక్షల కారణంగా రూ.40 వేల కోట్ల మేర నష్టపోయామని తెలంగాణ మంత్రులు ఇప్పటికే విమర్శలు కురిపిస్తున్నారు.

అసెంబ్లీ సమావేశాల్లో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల పైన చర్చ చేపట్టడం ద్వారా ఈ అంశాన్నిప్రజల్లోకి తీసుకెళ్లాలనేది కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తున్నది. అదే సమయంలో కేంద్రం తీరును నిరసిస్తూ అసెంబ్లీ వేదికగా జరిగే చర్చను తీర్మానం రూపంలో కేంద్రానికి పంపాలని భావిస్తున్నారు.

రాష్ట్రాలకు రాజ్యాంగపరంగా రావాల్సిన వాటా అని, అయినా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను దగా చేస్తోందని తెలంగాణ ప్రభుత్వం కొంతకాలంగా విమర్శలు చేస్తున్నది. ఈ మొత్తం వ్యవహారాల పైన అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్,  ఆర్దిక మంత్రి హరీష్ రావు  ప్రజలకు వివరించేందుకు నిర్ణయించారు. కేంద్ర ఆంక్షల కారణంగా రాష్ట్రం ఏ మేర నష్టపోయిందో వివరించనున్నారు.

అదే సమయంలో,  రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఇవ్వకుండా సతాయిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై సుప్రీం కోర్టులో కేసు దాఖలు చేసే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.  రాష్ట్రాలకు రాజ్యాంగపరంగా రావాల్సిన వాటా అని, అయినా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను దగా చేస్తోందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది.

కేంద్ర పన్నుల్లో వాటా రూపంలో రాష్ట్రానికి 41 శాతం మేర నిధులు రావాల్సి ఉండగా ప్రత్యేక సెస్‌ల విధింపుతో రాష్ట్రాల వాటాను 29 శాతానికే పరిమితం చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వస్తోంది.

పలు సంవత్సరాలుగా తెలంగాణ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, హోమ్ మంత్రి అమిత్ షాల దగ్గర నుండి రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వరకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న లక్షల కోట్ల రూపాయల నిధుల తోనే తెలంగాణ ప్రభుత్వం నడుస్తున్నట్లు చెబుతున్నారు.  కేంద్రం ఇస్తున్న నిధులపై బహిరంగ చర్చకు సిద్ధం అంటూ కిషన్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పలు సందర్భాలలో సవాల్ కూడా చేశారు.

అందుకనే నిధుల విషయంలో బిజెపియేతర రాష్ట్ర ప్రభుత్వాల పట్ల కేంద్రం వివక్షత వైఖరి ఆవలభిస్తున్నట్లు ఆరోపణలు చేస్తూ వస్తున్న టిఆర్ఎస్ నేతలు ఇప్పుడు శాసనసభ వేదిక నుండి, సుప్రీంకోర్టు ద్వారా తమ పోరాటాన్ని కొనసాగించేందుకు సమాయత్తం అవుతున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles