ఘనమైన హామీలు ఇస్తుండటం, ఆ తర్వాత వాటి గురించి పట్టించుకోక పోవడం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు పరిపాటి. తాజాగా కొండగట్టుకు రూ.100 కోట్లు ఇస్తామని జగిత్యాలలో ప్రకటించడం కూడా అటువంటిదేనా అనే విమర్శలు చెలరేగుతున్నాయి.
2015లో వేములవాడ రాజన్నను దర్శించుకున్న కేసీఆర్, ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల కోసం నాలుగేండ్ల పాటు బడ్జెట్లో రూ.100 కోట్ల చొప్పున కేటాయిస్తామని ఘనంగా ప్రకటించారు. ఇది జరిగి ఇప్పటికి ఎనిమిదిన్నరేండ్లు గడిచిపోయాయి. 9 బడ్జెట్లు పెట్టినా వేములవాడకు పైసా కేటాయించలేదు. దీంతో వేములవాడ మాస్టర్ ప్లాన్ మధ్యలోనే ఆగిపోయి, ఎప్పట్లాగే భక్తులు కష్టాలు పడ్తున్నారు.
గడిచిన ఎనిమిదేండ్లలో తక్షణమే విడుదల చేస్తామన్న రూ.50 కోట్లు రాగా, ఆ మొత్తంతో మూలవాగు మీద వంతెన తప్ప ఇతరత్రా ఏ అభివృద్ధి చేయలేదు. పైగా ఏటా రూ.100 కోట్ల చొప్పున రాజన్నకు వస్తున్న ఆదాయాన్ని దేవాదాయ శాఖ ద్వారా సర్కారే ఉల్టా తన ఖాతాలో వేసుకుంటున్నది.
మరోవంక ఐదేండ్లుగా సర్కారు నిర్లక్ష్యంతో కొండగట్టు మాస్టర్ ప్లాన్‌కు అతీగతి లేకుండా పోయింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఈ రెండు పుణ్యక్షేత్రాలు భక్తులకు రెండు కండ్ల లాంటివి. మొదట ఎములాడ రాజన్నను దర్శించుకున్నాకే కొండగట్టుకు రావడం ఆనవాయితీ. కానీ వేములవాడలో మాట తప్పిన సీఎం, కొండగట్టుకు కొత్త హామీ ఇవ్వడంతో దీనినైనా నెరవేరుస్తారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద హనుమాన్ దేవాలయంగా గుర్తింపు పొందిన కొండగట్టు అభివృద్ధికి టీఆర్ఎస్ సర్కారు 8 ఏండ్లలో ఇచ్చింది అక్షరాలా సున్నా. సర్కారు ఆదేశాలతో కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి ఐదేండ్ల కిందే మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. సర్కారు ఆదేశాలతో 2018లోనే అప్పటి కలెక్టర్ 333.3 ఎకరాల రెవెన్యూ భూములను దేవాలయంకు కేటాయించారు.
కానీ, మాస్టర్ ప్లాన్ నేటికీ కాగితాలను దాటలేదు. మాస్టర్ ప్లాన్‌లో ఆలయ విస్తరణతో పాటు, రోప్‌వే, ఘాట్రోడ్ల నిర్మాణం, మెట్ల దారి ఆధునీకరణ లాంటివి ఉన్నాయి. వాస్తవానికి మాస్టర్ ప్లాన్‌కు ముందే కొండగట్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు 2014లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం గుట్టపైకి రోప్ వే నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
కానీ, నిధులు లేక పనులు ప్రారంభం కాలేదు. మెట్ల దారి ఆధునీకరణ కోసం రూ.2.5 కోట్ల అంచనాతో టెండర్లు పూర్తయినా పనులు ప్రారంభం కాలేదు. అద్దె గదులు లేక భక్తులు చెట్ల కిందే ఉంటున్నారు. కొండగట్టుకు వచ్చే హనుమాన్ దీక్షాపరులు మాల విరమణ చేయడానికి ఇప్పటి దాకా మండపం నిర్మించలేదు. దీంతో కల్యాణ కట్టలోనే మాల విరమణ చేస్తుండడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
2017లో రూ.2.5 కోట్లతో కొత్త కోనేరు నిర్మించారు. కానీ, కేవలం హనుమాన్ జయంతి సమయంలో మాత్రమే నీటితో నింపుతున్నారు. 2018, సెప్టెబర్ 12న కొండగట్టు ఘాట్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో65 మందికి పైగా మృతి చెందగా, 35 మంది గాయపడ్డారు.
ఇక్కడ ప్రమాదాలు మూలమలుపులు వల్లే జరుగుతున్నాయని తేల్చారు. కానీ, ఘాట్ రోడ్డును అభివృద్ధి చేయకుండానే ఎప్పట్లాగే వాహనాలు అనుమతిస్తుండడంతో భక్తులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అంజన్నను దర్శించుకుంటున్నారు.