జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన మూడు వేల కోట్ల రూపాయల పైచిలుకు లిక్కర్ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డి.. పోలీసులు నాలుగు సార్లు నోటీసులు ఇచ్చినా స్పందించలేదు గానీ.. అనుకోకుండా పోలీసుల ఉచ్చులో చిక్కారు. ఇదే కేసులో సాక్షిగా విజయసాయిరెడ్డి వచ్చి, స్కామ్ లో కీలకపాత్రం మొత్తం కసిరెడ్డిదేనని సిట్ కు చెప్పి వెళ్లిన తర్వాత.. ఆడియో సందేశంలో స్పందించిన ఆయన.. ముందస్తు బెయిలు కోసం సుప్రీం కోర్టులో పిటిషన్ వేశానని ఆ సంగతి తేలిన తర్వాత.. విచారణకు హాజరవుతానని.. విజయసాయిరెడ్డి అవినీతి బాగోతాలన్నీ కూడా బయటపెడతానని ప్రకటించారు. అయితే తాజాగా సోమవారం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వద్ద ఆయనను అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. విజయవాడ తరలించారు. సిట్ విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడతారని.. విజయసాయిరెడ్డి మీద అనేక అవినీతి ఆరోపణలు, కుంభకోణాలకు సంబంధించిన సంగతులు సాక్ష్యాధారాలతో సహా సిద్ధం చేసుకుని వచ్చారని.. ఈలోగా అరెస్టుతో ప్లాన్ భగ్నం అయిందని తెలుస్తోంది.
సిట్ పోలీసులు తొలి రెండు నోటీసులు ఇచ్చినప్పుడే.. రాజ్ కసిరెడ్డి వారికి ఒక మెయిల్ పెట్టారు. తాను ఐటీ సలహాదారు మాత్రమేనని, తనకు లిక్కర్ స్కామ్ లో నోటీసులు ఇచ్చే అధికారం పోలీసులకు లేదని ఆయన పేర్కొన్నారు. అదే విషయంపై హైకోర్టుకు వెళ్లారు గానీ.. సానుకూల ఫలితం రాలేదు. ఈలోగా సాక్షిగా విచారణఖు వచ్చిన విజయసాయి.. కసిరెడ్డి పాత్రను ధ్రువీకరిస్తూ చాలా వివరాలు బయటపెట్టారు. ఆయన వసూళ్ల నెట్ వర్క్ లో కీలక వ్యక్తుల పేర్లతో సహా సమస్తం బయటపెట్టారు. దీనికి కౌంటర్ ఇవ్వాలని కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనుకున్నారు.
ఒకవైపు రాజ్యసభ ఎంపీ పదవికి ఎన్నికల ప్రక్రియ మొదలవుతుండగా.. విజయసాయి ప్రయత్నాలు చేసుకుంటున్నట్టుగా కొన్ని పుకార్లున్నాయి. అయితే.. ఇప్పుడే వచ్చి విజయసాయి అవినీతి వ్యవహారాలన్నింటినీ విపులంగా బయటపెట్టేస్తే.. కూటమి రాజకీయ పార్టీలు ఆయనను చేర్చుకోవడానికి కూడా భయపడతాయని, పరువు పోతుందని అనుకుంటాయని కసిరెడ్డి స్కెచ్ వేశారు. అందుకే 22నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుండగా అదే రోజు విచారణకు రావాలని అనుకున్నారు. కానీ ఆయనకు మీడియా తో మాట్లాడే అవకాశం రాకుండానే.. పోలీసులు అరెస్టు చేసి తీసుకువెళ్లిపోయారు. మంగళవారం రాజ్ ను కోర్టు ఎదుట హాజరు పరిచే అవకాశం ఉందని తెలుస్తోంది.
విజయసాయిని ఇంకా వేల కోట్ల రూపాయల అవినీతి వ్యవహారాల్లో ఇరికించేలా రాజ్ కసిరెడ్డి తయారుచేసుకుని వచ్చిన బ్రహ్మాస్త్రాలన్నీ ప్రస్తుతానికి వృథా అయినట్టే అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
కసిరెడ్డికి చాన్స్ మిస్: బ్రహ్మాస్త్రాలు రెడీ చేసుకుని వస్తే..
Friday, December 5, 2025
