ఎవరైనా నేరం చేసినట్టు ప్రాథమికంగా తెలిసిన తరువాత నిజానిజాలు నిర్ధరించుకోవడానికి పోలీసులు నోటీసులు ఇచ్చి పిలవడం విచారించడం జరుగుతుంది. పోలీసులు నోటీసులు ఇచ్చినంత మాత్రాన.. అవి అందుకున్న వాళ్లు నేరస్తులే అని తొలిదశలో చెప్పడానికి వీల్లేదు. వాళ్లను పోలీసులు టార్గెట్ చేసినట్టుగా భావించడానికి కూడా వీల్లేదు. అందుకే ఎవరైనా సరే.. పోలీసులు విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇచ్చినప్పుడు నిరభ్యంతరంగా వెళ్లవచ్చు. ఆ తర్వాతి పరిణామాలు అక్రమరీతిలో తమకు వ్యతిరేకంగా మారుతున్నాయని అనిపిస్తే ముందస్తు బెయిలు కోసం కోర్టులను ఆశ్రయించవచ్చు. అంతే తప్ప.. ఒక కేసు విషయం విచారణకు రావాలని పిలిస్తే.. దానికీ నాకు సంబంధం ఏమిటి? నా పదవీ నా హోదా ఏమిటో తెలుసా? నన్నెందుకు విచారణకు పిలుస్తారు? అంటూ నిలదీసే ప్రశ్నలతో ఎదురుదాడికి దిగడం కొంచెం విపరీత పోకడ అనిపించుకుంటుంది. సాధారణంగా ఇలాంటి ఉదంతాలు మనకు అంతగా కనిపించవుగానీ.. ఇటీవలి పరిణామాల్లో రెండు సంఘటనలు అచ్చంగా అలాగేజరిగాయి.
లిక్కర్ కుంభకోణంలో భాగం ఉందని అనుకున్న కొందరు అధికారుల్ని విచారించిన తర్వాతే.. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరును ఏ1గా చేర్చారు సిట్ పోలీసులు. విచారణకు రావాలని ఆయనకు నోటీసులు ఇచ్చినప్పుడు.. ఆయన మాత్రం తీవ్రంగా స్పందించారు. గత ప్రభుత్వంలో నేను ఐటీ సలహాదారును మాత్రమే. లిక్కర్ కుంభకోణానికి నాకు సంబంధం ఏముంటుంది? నేనెందుకు రావాలి? నన్నెందుకు పిలుస్తారు? అంటూ ఎదురుదాడికి దిగారు. అదే వాదనతో కోర్టుకు కూడా వెళ్లి భంగపడ్డారు. ఆ వాదన వినిపించుకోకుండా విచారణకు హాజరు కావాల్సిందే అని హైకోర్టు చెప్పింది.
సేమ్ టూ సేమ్.. ఇదే తరహా అతివాద వాదననే ప్రస్తుతం కాదంబరి జత్వానీ పై అక్రమ కేసులను బనాయించిన వ్యవహారంలో రిమాండులో ఉన్న పీఎస్సార్ ఆంజనేయులు కూడా! ఏపీ సీఐడీ పోలీసులు ఆ విషయంలో కూడా చాలా పద్ధతిగానే వ్యవహరించారు. ముందుగా ఆ వ్యవహారంతో ప్రత్యక్షంగా సంబంధం ఉన్న సస్పెండెడ్ ఐపీఎస్ లు కాంతిరాణా తాతా, విశాల్ గున్నీలను విచారించారు. వారినుంచి వాంగ్మూలాలను సేకరించారు. వాటి ఆధారంగానే.. పీఎస్సార్ ఆంజనేయులును విచారణకు రావాల్సిందిగా వాట్సప్ లో నోటీసులు పంపారు. అయితే ఆయన అప్పట్లో ఇంటెలిజెన్స్ చీఫ్ అయిన నన్ను ఆ కేసులో ఎందుకు విచారణకు పిలుస్తారు? అంటూ ఎదురు ప్రశ్నలు సంధించి ఎగ్గొట్టారు.
ఈ ఇద్దరినీ కూడా కొన్ని గంటల వ్యవధిలో పోలీసులు అరెస్టు చేసి ప్రస్తుతం రిమాండులో ఉంచిన సంగతి అందరికీ తెలుసు. కాకపోతే.. ఈ ఇద్దరూ ఒకే రకంగా సమాధానాలతో పోలీసులనే ఖంగుతినిపించాలనుకోవడం వెనుక ఏమైనా యాదృచ్ఛికత ఉన్నదా అనే సందేహం ఎవరికైనా కలుగుతుంది. కానీ విషయం ఏంటంటే.. రాజ్ కసిరెడ్డి ఇచ్చిన సమాధానాలను కూడా పీఎస్సార్ ఆంజనేయులే తయారుచేశారని తెలుస్తోంది. రాజ్ కసిరెడ్డి కోర్టులో వేసిన కేసు వాదనల్ని కూడా ఆయనే తయారు చేశారు. నిజానికి కసిరెడ్డి పరారీలో ఉన్న ప్రతి అడుగులోనూ.. పోలీసులకు చిక్కకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది పీఎస్సార్ ఆంజనేయులే గైడ్ చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. కానీ.. ఆ మడతపేచీ తెలివితేటలు వారిని ఎక్కువకాలం కాపాడలేకపోయాయి. చివరికి ఇద్దరూ సింగిల్ సెల్ లలో వరుస ఖైదీ నెంబర్లతో రిమాండులో గడుపుతున్నారు.
కసిరెడ్డి, ఆంజనేయులు.. ఒకే తరహా బెదిరింపులు!
Friday, December 5, 2025
