‘కడప లోక్‌సభ స్థానానికి బరిలో ఎవరెవరు పోటీ చేయబోతున్నారు అనేది తేలిపోయింది. అక్కా తమ్ముళ్ల మధ్య ఇక్కడ పోటీ జరగబోతోంది. తెలుగుదేశం పార్టీ కూడా తమ అభ్యర్థిని ప్రకటించినప్పటికీ పోటీ ప్రధానంగా- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సారథి వైఎస్ షర్మిల రెడ్డి మధ్య మాత్రమే ఉంటుందని అందరూ అంచనా వేస్తున్నారు. అదే సమయంలో వైఎస్ కుటుంబానికి చెందిన అక్క తమ్ముడుల మధ్య పోటీ కేవలం వారిద్దరి మధ్య మాత్రమే కాదని, ఇంకా లోతుగా గమనిస్తే వైయస్ రాజశేఖర్ రెడ్డికి- ఆయన కొడుకు వైయస్ జగన్మోహన్ రెడ్డికి జరుగుతున్న సమరం అని మనకు అర్థమవుతుంది!
కడప పార్లమెంటు నియోజకవర్గం నుంచి వైయస్ రాజశేఖర్ రెడ్డి సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహించారు. ఆయన రాష్ట్ర శాసనసభ ఎన్నికలను ఎంచుకున్న సమయంలో ఆయన తమ్ముడు వైయస్ వివేకానంద రెడ్డి ఇక్కడ ఎంపీగా నిలబడ్డారు. వివేకా పదవి పూర్తికాకముందే మధ్యలోనే పక్కకు తప్పించి తండ్రి మీద ఒత్తిడి చేసి మరి జగన్మోహన్ రెడ్డి మధ్యంతర ఎన్నికలలో తాను ఎంపీ అయ్యారు. తండ్రి మరణం పర్యవసానంగా తాను రాష్ట్ర రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత, ఒక దఫా కడప ఎంపీ స్థానం నుంచి తల్లి విజయలక్ష్మిని పోటీ చేయించారు జగన్. తీరా గెలుపు గ్యారెంటీ అనే సంకేతాలు తెలిసి వచ్చిన తర్వాత అక్కడ ఎంపీ టికెటును మరో చిన్నాన్న భాస్కర్ రెడ్డి కొడుకు అవినాష్ రెడ్డికి కేటాయించారు జగన్. అక్కడితో తన సొంత కుటుంబంలో కలతలు వచ్చాయి.
కడప ఎంపీ స్థానానికి ఎన్నిక దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డికి- ఆయన కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో ఉన్న ఆదరణల మధ్య పోటీ అని పలువురు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే వైయస్ రాజశేఖర్ రెడ్డిని తీవ్రంగా అభిమానించే ప్రజలు ఆయన కూతురు స్వయంగా పోటీ చేస్తున్న నేపథ్యంలో షర్మిలకే తమ ఓట్లు అన్నింటిని దఖలుపరిచే అవకాశం ఉంది. వైఎస్ కుమారుడు జగన్ తన తరఫున వేరే వ్యక్తిని పోటీకి దింపిన కారణంగా ఆయన మీద ఓటర్లలో అంత మమకారం ఉండకపోవచ్చు. అయినా అవినాష్ ను గెలిపించడానికి జగన్ తన సర్వశక్తులు ఒడ్డుతున్నారు. వైఎస్సార్ పట్ల అభిమానం షర్మిల ఓటు బ్యాంకు అని, జగన్ మీద ఉన్న అభిమానం అవినాష్ రెడ్డి ఓటు బ్యాంకు అని ప్రజలు భావిస్తున్నారు. కడప ఎంపీ పరిధిలో వైఎస్ తండ్రీ కొడుకులకు విడివిడిగా ఉండే ఆదరణను తూకం వేయడానికి ఈ ఎన్నిక ఉపయోగపడుతుందని అంటున్నారు.
కడప : వైఎస్ రాజశేఖర రెడ్డికీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పోటీ !
Saturday, November 23, 2024