మా ఇంటికి వస్తే ఏం తెస్తావ్.. మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు.. అనే తరహా వ్యక్తులు కొందరు ఉంటారని పెద్దలు చెబుతూ ఉంటారు. మాటల గారడీతో తిమ్మిని బమ్మిని చేయగల మహామహులు వాళ్ళు! అలాంటి తెలివితేటలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి అంబటి రాంబాబును మించిన వారు లేరేమో అనిపిస్తుంది. ఎందుకంటే.. పైన చెప్పుకున్న సామెత తరహాలో.. ఏ ఘనకార్యం జరిగినా అది జగన్మోహన్ రెడ్డి గొప్పతనమే అని.. ఏ వైఫల్యం ఎదురైనా అది చంద్రబాబు నాయుడు చేసిన పాపమని అభివర్ణించడానికి అంబటి రాంబాబు తాపత్రయపడుతున్నారు. పోలవరం ప్రాజెక్టు సంగతి ఇప్పటికీ తనకు అర్థం కాలేదని సుమారు రెండేళ్ల పాటు నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన తర్వాత బహిరంగంగా చెప్పుకున్న ఈ అసమర్ధ, అజ్ఞాన నాయకుడు పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం నుంచి నిధులు వస్తే.. అదంతా కూడా జగన్మోహన్ రెడ్డి పుణ్యమే అని డప్పు కొడుతుండడం విశేషం.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్రం 12వేల కోట్ల రూపాయలకు పైగా విడుదల చేసింది. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు ఏర్పడిన తర్వాత.. చంద్రబాబు నాయుడు ఢిల్లీ పెద్దలతో సుదీర్ఘమంతనాలు సాగించడంతో.. ఈ నిధుల విడుదల సాధ్యమైంది. అయితే జగన్మోహన్ రెడ్డి అయిదేళ్లలో ఢిల్లీ పెద్దలు చుట్టూ తిరిగిన ఫలితమే ఇప్పుడు నిధులు రావడం అని అంబటి రాంబాబు అంటున్నారు. జగన్ ప్రయత్నం ఫలితం అయితే జగన్ పాలనలోనే నిధులు వచ్చి ఉండాలి కదా.. అనే సింపుల్ లాజిక్కును ఆయన మరచిపోతున్నారు.
అదే సమయంలో.. పోలవరంలో కూలిన డయాఫ్రం వాల్ విషయంలో మాత్రం తప్పిదం చంద్రబాబుది అని నింద వేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు తనకు అర్థమే కాలేదు అని చెప్పిన ఈ మంత్రి.. జగన్ పాలనలో నిర్మాణం మొత్తం దాదాపుగా పూర్తయిపోయిందని ఇప్పుడు సెలవిస్తున్నారు.
మొత్తం పూర్తి కావడం కాదు కదా కనీసం మరో ఏడాదికి పూర్తయ్యే పరిస్థితి ఉన్నా సరే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంశాన్ని ఎన్నికల ప్రచారంలో చాలా కీలకంగా వాడుకుని ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో తాను ప్రజలకు పంచిపెట్టిన డబ్బులు సంగతి తప్ప పోలవరం మాట ఎత్తలేదు. అమరావతి మీద కక్ష కట్టినట్టుగా ఏరకంగా అయితే మరుభూమిగా మార్చివేశారో.. పోలవరం మీద కూడా అదే తరహాలో కక్ష కట్టినట్టుగా జగన్ ప్రవర్తించారు. తీరా నిధులు విడుదల కావడం.. చంద్రబాబు కాంట్రాక్టర్లను మార్చాలని నిర్ణయం తీసుకోవడం.. పోలవరం పనుల్లో వేగం పెరిగి త్వరలోనే పూర్తయ్యే అవకాశం కనిపిస్తుండడంతో.. అంబటి రాంబాబు మీడియా ముందుకు వచ్చే క్రెడిట్ తాము తీసుకోవాలని ఆరాటపడుతున్నట్లుగా కనిపిస్తోంది.