సమకాలీన రాజకీయ, సామాజిక వ్యవహారాలపై విస్పష్టమైన అభిప్రాయాలు వెల్లడిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉండే లోక్‌సత్తా వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ్ తాజాగా ఏపీ ఆర్థిక పరిస్థితి గురించి తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టుగా వెల్లడించారు. గత ప్రభుత్వం అయిదేళ్లలో రాష్ట్రాన్ని ఎన్నడూ కనీవినీ ఎరుగనంత ఆర్థక విధ్వంసానికి గురిచేసిందని జయప్రకాశ్ నారాయణ్ పేర్కొన్నారు. ఈ దుస్థితిని చక్కదిద్దడానికి సంపదసృష్టి జరగాల్సిన అవసరం ఉన్నదని.. చంద్రబాబునాయుడు ఆ పనిచేయగల సమర్థులు అని జేపీ విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే సంక్షేమ పథకాల పట్ల తన అభిప్రాయాలను కూడా వెల్లడించారు.
రాష్ట్రం ప్రస్తుతం ఎంతటి ఆర్థిక సంక్షోభంలో ఉన్నదంటే.. రాష్ట్ర సొంత ఆదాయం, కేంద్రం పన్నుల వాటాలతో కలిపి మొత్తం 1.4 లక్షల కోట్లు ఉండగా.. ఇందులో 63 శాతం వడ్డీలు కట్టడానికే సరిపోతున్నదని ఆయన తెలియజెప్పారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయిదేళ్లలో 9.74 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేయగా, దానికి అదనంగా కాంట్రాక్టర్లు, ఉద్యోగులకు చెల్లించాల్సిన బాయిలను మరో 1.35 లక్షల కోట్లరూపాయలను పెండింగ్ పెట్టిందని కూడా జయప్రకాశ్ చెప్పుకొచ్చారు.
ఉమ్మడి రాష్ట్రానికి తలమానికంగా హైదరాబాదును అభివృద్ధి చేసిన ముఖ్యమత్రిగా సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబునాయుడు ఇప్పుడు సంక్షోభంలో ఉన్న ఆంధ్రప్రదేఝశ్ రాష్ట్రాన్ని కూడా గాడిలోపెట్టగలరనే విశ్వాసం జేపీ వ్యక్తం చేశారు. ఏపీకి పెట్టుబడులు తీసుకురావడం ్వారా అభివృ్ధి చేస్తారనే నమ్మకం ఉన్నదని చెప్పారు.
రాష్ట్రంలో కూడా ఎన్డీయే ప్రభుత్వమే నడుస్తున్నందున.. కేంద్రంతో చర్చించి.. ప్రత్యేక కేసుగా పరిగణించాలని విన్నవించి.. అవసరమైతే వడ్డీల భారాన్ని తగ్గించడానికి కూడా ప్రయత్నించాలని జేపీ సూచిస్తున్నారు. కుదిరితే రుణాల చెల్లింపును కనీసం అయిదేళ్లపాటు వాయిదా వేయించేలా చూడపడం వల్ల ఆర్థిక వ్యవస్థ కుదుటపడడానికి మార్గం ఏర్పడుతుందని అంటున్నారు. ఈ వియంలో పార్టీలకు అతీతంగా అందరూ కలిసి కూర్చుని రాష్ట్రానికి మేలు చేసే నిర్ణయాలను తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని సూచిస్తున్నారు.
రాష్ట్రానికి రాబోయే అయిదేళ్లలో విస్తారంగా పెట్టుబడులు తీసుకురావడం ద్వారా అభివృద్ధి పథంలో నడిపించడానికి చంద్రబాబునాయుడు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదని అడుగడుగునా కనిపిస్తూనే ఉంది. దేశీయంగానూ, విదేశీ సంస్థలను కూడా ఇక్కడి ప్రాజెక్టులపై పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. ఈ ప్రయత్నాలన్నీ ఫలిస్తే జేపీ చెబుతున్నట్టుగా విధ్వంసానికి గురైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలోపెట్టడం సాధ్యమవుతుందని ప్రజలు అనుకుంటున్నారు.