ఇవాళ తెలుగు రాజకీయాల్లో అత్యంత హాట్ టాపిక్ గా నడుస్తున్న అంశాలు.. ఎమ్మెల్యే పదవికి జగన్ రాజీనామా ఆలోచన, కడప ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక అనేవే! శాసనసభలో క్షణమైనా గడపడానికి జగన్ మోహన్ రెడ్డికి మొహం చెల్లడం లేదు. ఆయన కుమిలిపోతున్నారు అనేది అందరికీ తెలిసిన సంగతి. ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన రోజునే ఆయన సభలో కనీసం కూర్చోకుండా ఇంటికి పారిపోయారు. అరెస్టు బారినుంచి కాస్త చిన్న వెసులుబాటు చిక్కించుకోవడానికి ప్రతిపక్ష హోదా యిచ్చి తీరాలంటూ.. జనం నవ్వుతారనే వెరపు కూడా లేకుండా లేఖలు రాశారు. తద్వారా.. తన రాజకీయ అవగాహన లేమిని కూడా బయటపెట్టుకున్నారు.
తీరా ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలకు నాయకుడిగా సభకు వెళ్లడం ఇష్టం లేక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం బలంగా వినిపిస్తోంది. తండ్రి వైఎస్సార్ జయంతి రోజున ఆయన సమాధి వద్దనే రాజీనామా నిర్ణయం ప్రకటిస్తారనే ప్రచారం కూడా సాగింది. అయితే ఈరోజున అది జరగలేదు. త్వరలోనే ఆ ప్రకటన ఉంటుందని అంటున్నారు. ఎమ్మెల్యేగా రాజీనామా చేసి, తమ్ముడు అవినాష్ రెడ్డితో కూడా రాజీనామా చేయించి.. తాను కడప ఎంపీగా పోటీచేయాలని జగన్ అనుకుంటున్నారట. ఈ అయిదేళ్లు ఢిల్లీ రాజకీయాల్లో ఉంటే గనుక.. కనీసం తన మీద ఉన్న కేసుల్లో అరెస్టు బారినుంచి కాస్త వెనక్కు ఉండవచ్చునని ఆయన భావిస్తున్నారట.
ఈ పుకార్లన్నీ నిజం అని అనిపించే విధంగా.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ త్వరలోనే కడప ఎంపీకి ఉప ఎన్నిక వస్తుందని, తాను వచ్చి ప్రచారం చేసి షర్మిలను గెలిపిస్తానని అనడం విశేషం. అయితే పార్టీ వర్గాలద్వారా విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. అన్న జగన్ కోసం, కడప ఎంపీగా రాజీనామా చేయడానికి వైఎస్ అవినాష్ రెడ్డి ససేమిరా ఒప్పుకోవడం లేదుట. అవినాష్ రాజీనామాకు నో చెప్పినందువల్లనే.. వైఎస్ జయంతి నాడు ఇడుపులపాయలో ప్రకటించాల్సిన రాజీనామా నిర్ణయం కూడా వాయిదాపడిందని అంటున్నారు. అవినాష్ కూడా కేసులు, అరెస్టుల భయంతోనే రాజీనామాకు నో అంటున్నారట. మరి జగన్ ఎలాంటి ముందడుగు వేస్తారో చూడాలి.
‘నీకోసం త్యాగం చేయను’ అంటున్న జగన్ తమ్ముడు!
Sunday, December 22, 2024