వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి రోజురోజుకు అపరిమితమైన అసహనంలో కూరుకుపోతున్నారు. ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయంలో ఆయనను ఆందోళన వెంటాడుతోంది. ఓటమి అనివార్యమైతే భవిష్యత్తు ఎంత భయవిహ్వలంగా ఉంటుందో ఆయన ఊహించుకుంటున్నారు. అందుకే అసహనానికి గురవుతున్నారు. ఆ ఫ్రస్టేషన్ లో తలా తోకా లేకుండా మాట్లాడుతున్నారు. ప్రజల్లో నవ్వుల పాలు అవుతున్నారు.
కేవలం రెండు రోజుల కిందట జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తూ ఒక అద్భుతమైన మాట అన్నారు. తాము ఎంతో పక్కా ప్రణాళికతో సంక్షేమ పథకాలను కార్యరూపంలోకి తీసుకువచ్చామని డప్పు కొట్టుకున్నారు. తాము కాదు కదా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా సరే ఈ పథకాలను నిలిపివేయడం సాధ్యం కాదు అని జగన్ చెప్పారు. నిజమే కావొచ్చు.
నిండా రెండు రోజులు కూడా గడవలేదు. ఇప్పుడు ఆయన ఎన్నికల ప్రచార సభల్లో ఉన్నారు. ఇంతలోనే మాట మార్చేస్తున్నారు. చంద్రబాబు నాయుడుని గెలిపిస్తే ఇప్పుడు పేదలకు అందుతున్న సంక్షేమ పథకాలు అన్నీ నిలిచిపోతాయని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి- తనకు ఏ నిమిషానికి ఎలా తోస్తే అలా మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తోంది. మంచో చెడో జగన్ ప్రభుత్వం ఆధ్వర్యంలో పాత సంక్షేమ పథకాలు కొన్ని కొత్త రూపు సంతరించుకున్నాయి. మరియు కొత్త పథకాలు కొన్ని ప్రారంభం అయ్యాయి. చంద్రబాబు నాయుడు తన ప్రతి ప్రచార సభలోనూ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా ఆగదని ప్రకటిస్తున్నారు. ప్రజలకు ఆమేరకు నమ్మకం కలిగిస్తున్నారు. అలాగే పింఛన్లు వంటివి ఇప్పుడు అందుతున్న మొత్తానికంటే 1000 రూపాయలు పెంచి ఈ సంవత్సరం ఏప్రిల్ నెల నుంచి అరియర్స్ సహా ఇస్తామని కూడా అంటున్నారు. ప్రతి పథకాన్ని కూడా మరింత మెరుగ్గా మరింత ఎక్కువ మంది లబ్ధిదారులకు అందిస్తాము అంటున్నారు. అయితే చంద్రబాబు మాటలు ప్రజల్లోకి వెళితే తమ పార్టీకి ఠికానా ఉండదని భయపడుతున్న జగన్మోహన్ రెడ్డి అవాకులు చవాకులు, అబద్ధాలు ప్రచారం చేయడానికి పూనుకుంటున్నట్టుగా మనకు కనిపిస్తోంది.
నేను తెచ్చిన పథకాలు ఎవరు వచ్చినా ఆపలేరు అని ఒకవైపు అంటూనే.. మరొకవైపు చంద్రబాబు గెలిస్తే అన్ని పథకాలు ఆగిపోతాయి అని అనడం ఆయనలోని రెండు నాలుకల ధోరణికి నిదర్శనం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి మాటల ద్వారా జగన్మోహన్ రెడ్డి తన పరువు తానే తీసుకుంటున్నారని మేనిఫెస్టోలో కొత్త సంక్షేమ పథకాలను ప్రకటించలేకపోయిన జగన్, చంద్రబాబు వస్తే పాత పథకాలను తీసివేస్తారని అసత్య ఆరోపణలతో ఎన్నికలు గట్టెక్కాలని చూస్తున్నట్లుగా ప్రజలు భావిస్తున్నారు.
తలా తోకా లేని జగన్ మాటలు!
Thursday, April 3, 2025
