జగన్ అధికారంలో ఉన్నప్పుడు కాకుల లెక్కలు చెప్పేవాళ్ళు. ఇప్పుడు అధికారం లోంచి దిగిపోయిన తరువాత అబద్ధపు లెక్కలు చెబుతున్నారు. ఎటుపోయి ఎటు వచ్చినా ఆయన నిజం మాత్రం మాట్లాడడం లేదు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఎంత మేరకు అప్పుల్లో ముంచేశాతో లెక్క తీసి.. శ్వేతపత్రం రూపంలో వెల్లడించారు చంద్రబాబు నాయుడు. తొమ్మిదిన్నర లక్షల కోట్ల రూపాయలకు పైగా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో జగన్మోహన్ రెడ్డి ముంచినట్లుగా లెక్కలు చెప్పారు. గణాంకాలు అన్నిటినీ స్పష్టంగా వివరించారు. అయితే చంద్రబాబు నాయుడు రుణాల శ్వేత పత్రాన్ని ఖండించిన జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పదవీకాలంలో తమ ప్రభుత్వం చేసినది కేవలం 7.48 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అని సెలవిచ్చారు. ఏది నిజం? ఏది ఏమైనా అబద్దం?
చంద్రబాబు నాయుడు- జగన్మోహన్ రెడ్డికి మరొక కొత్త సవాల్ విసిరారు. తాను చూపించిన గణాంకాలు తప్పు అని చెబుతున్న జగన్ కు చేతనైతే అసెంబ్లీకి వచ్చి ఆధారాలు సహా వివరించాలని అంటున్నారు.
ఇక్కడ తమాషా ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వం చేసినది 7.48 లక్షల కోట్ల అప్పులు మాత్రమే అంటున్నారు. మరి అదే జగన్ తమ ప్రభుత్వం ఐదేళ్ల పదవీకాలంలో 2.71 లక్షల కోట్ల రూపాయలు బటన్ నొక్కి ప్రజలకు ఇచ్చినట్లుగా పదేపదే చెప్పుకుంటూ ఉంటారు. మిగిలిన ఐదు లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయాయి అనేది ప్రజలు సంధిస్తున్న ప్రశ్న.
జగన్ మాటలన్నీ అక్షర సత్యాలు మాత్రమే అని అనుకున్నప్పటికీ, బ్యాలెన్స్ మాత్రం తేలడం లేదు. ఆయన చెబుతున్న ప్రకారం అప్పుల రూపంలో వచ్చినది 7.48 లక్షల కోట్లు, ప్రజలకు పంచిపెట్టినది
2.71 లక్షల కోట్లు. మిగిలిన సొమ్ము ఎక్కడికి వెళ్లినట్లు? జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి పని ఏ ఒక్కటి కూడా చేపట్టలేదు. 600 కోట్లు తగలేసి రుషికొండ ధ్వంసం చేసి ఒక భవంతి మాత్రమే కట్టారు. రాష్ట్రంలో రోడ్లన్నీ కూడా గోతులు మయంగా ఉన్నాయి మరి ఎలాంటి అభివృద్ధి జరగకుండానే ఐదు లక్షల కోట్లు ఎలా మాయమైపోయాయి. అనేది కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే చెప్పగలిగిన జవాబు! మరి తాను చెబుతున్న లెక్కల్లోనే బ్యాలెన్స్ షీట్ మిస్ అవుతూ ఉంటే ఆ క్లారిటీ ఇవ్వవలసిన బాధ్యత ఆయనదే కదా అని ప్రజలు అనుకుంటున్నారు.