వైసీపీ శ్రేణుల్లో దడ పుట్టిస్తున్న జగన్ వినుకొండ యాత్ర!

Saturday, September 7, 2024

వైఎస్ఆర్ జగన్ మోహన్ రెడ్డి హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి వినుకొండకు వెళ్లారు, వచ్చారు. తను ఏ లక్ష్యం కోసం అయితే వెళ్లారో ఆ ప్రకారంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద బోలెడు నిందలు వేశారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కావాల్సిందేనని కూడా అన్నారు. ఇదంతా బాగానే ఉంది కానీ, ఆయన వినుకొండ యాత్ర తరువాత రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన ప్రాంతాల్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే స్థాయి అభ్యర్థులు, కార్యకర్తలు, శ్రేణుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి పర్యటనలు అనేకం చేస్తారని పార్టీ వర్గాల ద్వారా తెలిసి వస్తున్న నేపథ్యంలో.. ఆయన ప్రతి యాత్రకు జన సమీకరణ పేరిట కోట్లకు కోట్ల రూపాయలు ఖర్చుపెట్టడానికి తమకు స్తోమత లేదని పార్టీ నాయకులు భయపడుతున్నారు.

జగన్మోహన్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించే నిమిత్తం వినుకొండకు వెళ్లిన యాత్ర ఒక ప్రహసనం లాగా నడిచింది. తాడేపల్లి నుంచి రషీద్ ఇంటి వరకు మొత్తం దూరం 120 కిలోమీటర్లు! కారులో ఎంత నిదానంగా ప్రయాణించినా సరే రెండు గంటల వ్యవధిలో అక్కడికి చేరుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డికి మొత్తం ఏడున్నర గంటల సమయం పట్టింది. ఎందుకంటే గత ఐదేళ్లుగా తాను రోడ్డు మీద ప్రయాణిస్తే- రోడ్డుకు రెండు వైపులా భారికేడ్లు, పరదాలు కట్టడం మాత్రమే తెలిసిన జగన్ ఇప్పుడు జనాన్ని చూడాలనుకున్నారు. అందుకని దారమ్మట వచ్చే ప్రతి గ్రామం వద్ద కాన్వాయ్ ను ఆపించారు. ప్రతి గ్రామం వద్దకు కూడా జనాన్ని భారీగా తరలించాలని ముందుగానే పార్టీ నాయకులకు పురమాయించారు. ‘ఎన్నికలకు పెట్టిన ఖర్చు మంట కలిసిపోయిన దెబ్బ నుంచి ఇప్పటికే తేరుకోలేకుండా ఉన్నాం.. మళ్లీ అంతలోనే జనాన్ని తరలించాలా’ అని ఒక వైపు మధనపడుతూనే వారు జనాన్ని తరలించడం జరిగింది.

జగన్మోహన్ రెడ్డి జనం కనిపించిన ప్రతి చోటా ఆగుతూ, వారికి చేతులు ఊపుతూ, చిరునవ్వు నవ్వుతూ, అభివాదాలు చేస్తూ ముందుకు సాగే సరికి మొత్తం ఏడున్నర గంటల సమయం తీసుకుంది. పైగా జనమంతా వర్షాన్ని లెక్కచేయకుండా తనకోసం రోడ్డుమీద ఎదురుచూస్తూ ఉండడం ఆనందం కలిగించిందని జగన్ ఎక్స్ ఖాతాలో ట్వీట్ కూడా చేశారు. ఇది ఇంకా అతిశయం!!
ఈ పర్యటన జరిగిన తీరు స్థానిక నాయకులు పడిన పాట్లు గమనించిన తతిమ్మా రాష్ట్రంలోని వైసిపి నాయకులకు ఇప్పుడే భయం పుడుతోంది. తమ ప్రాంతాల్లో ఎప్పుడు యాత్రకు వస్తాడో, తమ నెత్తిన ఎంత భారం పడుతుందో, ఎన్ని లక్షల మంది జనాలను తరలించాలని టార్గెట్లు పెడతారో అని భయపడుతున్నారు. ఎన్నికల ఖర్చు నుంచి కోలుకోలేకుండా ఉన్న నాయకులకు, మూలిగే నక్క మీద తాటిపండు చందం లాగా ఇది మరొక భారం అవుతుందని ఆవేదన చెందుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles