‘ఇటు చెంప దెబ్బ.. అటు గోడ దెబ్బ’ అన్నట్టుగా తయారవుతోంది పాపం.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. ఒకవైపు పార్టీ నాయకులు విచ్చలవిడిగా రాజీనామాలు చేసేస్తున్నారు. ఈ పార్టీ మనుగడ ఎక్కువ కాలం కొనసాగదని.. అందులోని నాయకులందరికీ భయం పుడుతోంది. అందుకే ఎవరికి వారు తమ భవిష్యత్తు చూసుకుంటూ రాజీనామాలు చేస్తున్నారు. ఎక్కడా గతిలేని వారు మాత్రమే ఆ పార్టీలో కొనసాగుతున్నారు. ఆరునెలల కిందటికి, ఇప్పటికి పార్టీ ఎంతో బలహీన పడింది. అదే సమయంలో చట్టసభల్లో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రాతినిధ్యం బాగా సన్నగిల్లుతోంది. శాసనసభలో ప్రజలు ఆ పార్టీని కేవలం 11 స్థానాలకు పరిమితం చేసిన సంగతి తెలిసిందే. కానీ శాసనమండలిలో సంఖ్యాపరంగా వైసీపీకి బలం ఉంది. ఆ బలం కూడా కలకాలం నిలబడేలా లేదు.. అక్కడ కూడా పార్టీ బలం తగ్గబోతోంది. ప్రస్తుతం మూడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు షెడ్యూలు ప్రకటించిన నేపథ్యంలో.. వైసీపీ బలం మండలిలో మరింత సన్నగిల్లే ప్రమాదం ఉంది.
తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూలు ప్రకటించింది. ఫిబ్రవరి 3వ తేదీన నోటిఫికేషన్ విడుదల అవుతుంది. 10వతేదీలోగా నామినేషన్లు వేయాలి. 27న పోలింగ్ జరుగుతుంది. మార్చి 3న ఓట్లు లెక్కిస్తారు. ఏపీకి సంబంధించినంత వరకు మూడు స్థానాలకు ఎన్నిక జరుగుతుంది. ఉత్తరాంధ్ర మూడు జిల్లాలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం లకు కలిపి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరుగుతుంది. అలాగే తూర్పు- పశ్చిమగోదావరి జిల్లాలు, కృష్ణా-గుంటూరు జిల్లాలకు సంబంధించి రెండు పట్టభద్ర నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతాయి.
గతంలో ఇదే జిల్లాల పరిధిలో పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కనీసం అభ్యర్థులను పెట్టడానికి కూడా సాహసించలేదు. పాలకపక్షం ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతుంది.. అందుకని మేం పోటీచేయడం లేదు.. అని బుకాయించి.. పోటీనుంచి నిస్సిగ్గుగా తప్పుకున్నారు. నిజం చెప్పాలంటే.. ఈ దఫా కూడా పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ పోటీచేసే అవకాశం లేదు. గత ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఇప్పటికి ఆ ప్రాంతంలో పార్టీ ఇంకా బలహీన పడిందనే అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో ఆ రెండు సీట్లు ఎన్డీయే కూటమికి దక్కుతాయి. అదే సమయంలో.. మండలిలో వైసీపీ ప్రాతినిధ్యం కూడా కొంత తగ్గుతుంది.
58 స్థానాలున్న మండలిలో ప్రస్తుతం వైసీపీకి 36 సీట్లున్నాయి. రెండు స్థానాలు తగ్గడం అనేది పరిమితమే. కానీ.. ఇప్పటికే ఆ పార్టీ ఎమ్మెల్సీలు పలువురు రాజీనామాలుచేసి ఉన్నారు. వారి రాజీనామాలను ఆమోదించకుండా ఛైర్మన్ సాగదీస్తున్నారు. టెక్నికల్ గా వారి పార్టీకి బలం ఉన్నట్టుగా చూపించుకునే వ్యూహంతో ఉన్నారు. అయితే.. నెమ్మదిగా కూటమి బలం మండలిలో బాగా పెరుగుతుందని పలువురు అంచనా వేస్తున్నారు.
అక్కడకూడా తగ్గనున్న జగన్ బలం!
Wednesday, February 19, 2025
