చేసిన పాపం పామై చుట్టుకుంటుంది అని సామెత! కానీ ఒకరు చేసిన పాపం.. మరొకరికి పామై చుట్టుకుంటే దానిని ఏం అనాలి? అది వారి ఖర్మ తప్ప మరొకటి కాదు! ఇప్పుడు కడపజిల్లాకు చెందిన చిన్నస్థాయి వైసీపీ కార్యకర్తలు, నాయకుల విషయంలో అలాంటి అభిప్రాయమే వ్యక్తం అవుతోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన కాలంలో.. ఆయన పులివెందులలో తన పునాదులు మరింత బలంగా తయారుచేసుకోవడానికి రకరకాల అభివృద్ధి పనులను ప్రకటించారు. అలాగే ఆ పనులు చేసే బాధ్యతలను కూడా పార్టీకే చెందిన కార్యకర్తలు, ఛోటా నాయకులకు కాంట్రాక్టులుగా అప్పగించారు. వారు అప్పోసొప్పో చేసి పనులు పూర్తిచేశారు. అక్కడినుంచి వాళ్ల కష్టాలు మొదలయ్యాయి.
జగన్ పరిపాలన సాగినంతకాలమూ కూడా వారు బిల్లుల కోసం తిరిగారు. పనులు కాలేదు. మీకెందుకు.. తొందరేముంది.. అన్ని ప్రతిరూపాయీ ఇచ్చేస్తారు.. లాంటి మాటలతో వారిని వెనక్కు పంపారు. తీరా ఎన్నికల వచ్చిన సమయంలో.. వైసీపీతో గట్టిబంధం ఉన్న బడా కాంట్రాక్టర్లకు సరిగ్గా నోటిఫికేషన్ రావడానికి ముందే వందల కోట్ల రూపాయల బిల్లులు విడుదల చేసేశారు. అంతే తప్ప పులివెందుల పరిధిలోని చిన్న చిన్న కాంట్రాక్టర్లకు రావాల్సిన బిల్లులు మాత్రం రాలేదు. పైగా ఎన్నికల సమయంలో వారితో మళ్లీ ఖర్చు పెట్టించారు. మళ్లీ జగనన్న ప్రభుత్వమే రాబోతోంది.. మీ బిల్లులు అన్నీ వచ్చేస్తాయి అంటే నమ్మి వారు ఎన్నికల్లో తమ సొంత డబ్బు ఖర్చు పెట్టుకున్నారు.
జగన్ ఘోరంగా పరాజయం పాలైన తర్వాత వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన వెంటనే జగన్ పులివెందులకు వచ్చినప్పుడు.. వారంతా బిల్లుల గురించి అడిగితే.. జగన్ తీవ్ర అసహనానికి గురై.. వారం రోజుల పర్యటన ఒక్కరోజులోనే ముగించుకుని బెంగుళూరు ప్యాలెస్ కు వెళ్లిపోయారు. తాజాగా తండ్రి వర్ధంతికోసం మళ్లీ పులివెందుల వచ్చిన జగన్ కు.. ఈ బెడత తప్పలేదు. కొన్ని రోజులు ఆగండి. అన్నీ వస్తాయి.. అని చెబుతున్నారు గానీ.. ఎలా వస్తాయో వారికేఅర్థం కావడం లేదు. న్యాయస్థానానికి వెల్లి బిల్లులు అందేలా చూస్తాం అని జగన్ వారికి మెరమెచ్చు మాటలు చెప్పారు.
2014-19 కాలంలో పనులు చేసిన అందరు కాంట్రాక్టర్ల బిల్లుల వ్యవహారం ఇంకా కోర్టుల్లోనే ఉంది. జగన్ ప్రభుత్వం వారికి చెల్లించలేదు. అలాంటిది తమకు మాత్రం రాబోయే అయిదేళ్లలో బిల్లులు ఎలా వస్తాయని ఆ చిన్న కాంట్రాక్టర్లు వాపోతున్నారు. జగన్ తనకు క్లోజ్ అయిన బడా కాంట్రాక్టర్లకు బాగానే చెల్లించారని, తమబోటి చిన్న కార్యకర్తలను గాలికి వదిలేశారని వాపోతున్నారు.
జగన్ చేసిన పాపం.. వారికి పామై చుట్టుకుంటుంది!
Thursday, November 21, 2024