తాను ఏ ఒక్క నిర్మాణాన్ని పూర్తిచేసినా సరే.. అమరావతికి ‘చంద్రబాబు రాజధాని’ అనే పేరే చిరస్థాయిగా వస్తుందనే అసూయతోనే.. జగన్ ఆ ప్రాంతాన్ని స్మశానంగా మార్చేశారు. మరి ఆయన కలల రాజధాని ఏమిటి? ఈ లెక్కన జగన్ రాజధాని అంటే ‘విశాఖపట్నం’ అన్నమాట. అక్కడి ప్రజలు వద్దు మొర్రో అంటోంటే.. వారి విలాపాలు పట్టించుకోకుండా, రాజధాని మాయమాటలు చెప్పి.. చివరికి యావత్ ఉత్తరాంధ్ర ఛీత్కారానికి గురయ్యారు జగన్. అలాంటి జగన్ రాజధానిలో ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అంతో ఇంతో ఉన్న పరువు కూడా గంగపాలు అవుతోంది. విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ తెలుగుదేశం పరం కానుంది.
2019 ఎన్నికలలో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ విశాఖ సిటీలోని నాలుగు నియోజకవర్గాల్లోఒక్కటి కూడా గెలవలేదు. జగన్ రాజధాని డ్రామా ప్లేచేసినా సరే.. ఫలించలేదు. ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేదు. పురపాలిక ఎన్నికల్లో రకరకాల మాయలు చేసి వైసీపీ విశాఖను దక్కించుకుంది. ఇప్పుడు కూటమి ఎమ్మెల్యేలు కౌంటర్ ఎత్తుగడలు వేస్తున్నారు. వైసీపీ కార్పొరేటర్లను కూటమి పార్టీల్లో చేర్చుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఒకవైపు గుడివాడ అమర్నాధ్ సహా వైసీపీ పెద్దలు కార్పొరేటర్లను బుజ్జగించడానికి ప్రయత్నిస్తున్నారు గానీ.. ఫలం కనిపించడం లేదు.
వైసీపీకి ప్రస్తుతం విశాఖలో 58 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఎవరూ పార్టీని వీడి వెళ్లవద్దు అని బతిమిలాడడానికి మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ సమావేశం నిర్వహిస్తే కేవలం 42 మంది మాత్రమే వచ్చారు. అంటే 16 మంది పార్టీని ఆల్మోస్ట్ వీడినట్టే లెక్క. కాకపోతే.. నిన్న వచ్చిన 42 మందిలో కూడా ఇంకా పలువురు తెలుగుదేశం, జనసేన ఎమ్మెల్యేలతో టచ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తం 58 వైసీపీ కార్పొరేటర్లలో కనీసం 25 మందికంటె ఎక్కువమందిని తమ పార్టీల్లో చేర్చుకుని.. విశాఖ కార్పొరేషన్ ను హస్తగతం చేసుకోవాలని కూటమి ప్రయత్నిస్తోంది.
ఆ రకంగా జగన్ కలల రాజధాని నగరం మీద వైసీపీ జెండాను త్వరలో పీకేయడం ఖాయం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
జగన్ ‘రాజధాని’లో ఉన్న పరువు గోవిందా?
Sunday, November 17, 2024