మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్లీ పాదయాత్ర చేయాలని అనుకుంటున్నారా? ఆయన మాటల తీరు చూస్తే అలాగే అనిపిస్తోంది. తన పార్టీకి చెందిన ఎమ్మెల్సీలతో నిర్వహించిన సమావేశంలో.. జగన్ ఈమేరకు సంకేతాలు ఇచ్చారు. శాసనసభలో తమకు పెద్దగా బలం లేదు కాబట్టి.. తమ పోరాటాలకు విలువ ఉండదని, శాసనమండలిలోని సభ్యులే ప్రభుత్వంపై పోరాడాలని ఆయన వారికి సూచించారు. ప్రజల పక్షాన ఎమ్మెల్సీలు సమర్థంగా పోరాడాలని అన్నారు.
వారికి ఆయన దిశానిర్దేశం చేస్తూ.. ‘‘రాబోయే రోజుల్లో ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాలు ముమ్మరం చేద్దాం. ప్రజల్లోనే ఉందాం. ప్రజలతో కలిసి పోరాడే కారన్యక్రమాలు చేపడదాం. గతంలో నేను ఏకంగా 14 నెలలు పాదయాత్ర చేశా. ఆ వయసు సత్తువ నాకు ఈ రోజుకీ ఉన్నాయి..’’ అని జగన్ పేర్కొనడాన్ని ప్రత్యేకంగా గమనించాలి. ఇప్పుడు అసలు జగన్ తన వయసు గురించి ప్రస్తావించాల్సిన అవసరం ఏముంది? ఆయన ముసలివాడై పోయాడని ఎవ్వరూ అనడం లేదు కదా.. అని ప్రజలు విస్తుపోతున్నారు.
జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం గెలుపు పట్ల ఎంతటి అసహనంతో రగిలిపోతున్నారా? అనడానికి ఇదొక ఉదాహరణ కూడా. ఎందుకంటే.. బుధవారం నాడు పదవీ స్వీకార ప్రమాణం చేసిన చంద్రబాబునాయుడు.. సెక్రటేరియేట్ లో గురువారం సాయంత్రం ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవడానికి ముందునుంచే.. ప్రభుత్వం కూలిపోవడం గురించి, మళ్లీ తాము అధికారంలోకి రావడం గురించి ప్రణాళికలు రచిస్తున్నారంటే.. ఆయన ఎంతగా ఆత్రపడిపోతున్నారో అర్థమవుతుంది.
పాదయాత్ర చేస్తానని అంటున్న జగన్మోహన్ రెడ్డి.. ఏ మొహం పెట్టుకుని ప్రజల ఎదుటకు వెళ్తారు అనేది కూడా పలువురి సందేహం. ఎందుకంటే.. ఆయనకు అధికారం కట్టబెడితే.. అయిదేళ్ల పాటు ప్రజలను శత్రువుల్లాగా చూశారు. తాను ఊర్లకు వెళుతోంటే.. రోడ్డుకు రెండు పక్కలా పరదాలు కట్టించారు. చెట్లను నరికేయించారు. దుకాణాల మూత వేయించారు. అయిదేళ్ల పాటు ఇంత దుర్మార్గంగా ప్రజలను ట్రీట్ చేసిన ఒక మనిషి.. మళ్లీ తగుదునమ్మా అంటూ పాదయాత్ర చేస్తే ప్రజలు హర్షిస్తారా? ఛీ కొట్టకుండా ఉంటారా? పాదయాత్ర అనేది కేవలం ఆయన ఆడుతున్న ఒక నాటకం మాత్రమే అని గ్రహించలేనంత అమాయకులా? అనేది ఆయనే ఆలోచించుకోవాలి.
మళ్లీ పాదయాత్ర చేయాలని జగన్ ప్లాన్?
Friday, December 5, 2025
