జగన్ ఒక్క పోస్టు.. లోకేష్ బోలెడు ప్రశ్నలు!

Tuesday, December 24, 2024

రాష్ట్రంలో ఎక్కడైనా ఒకచోట ఒక బాలిక మీదనో, యువతి మీదనో అత్యాచారం జరిగితే చాలు, హత్య జరిగితే చాలు- జగన్మోహన్ రెడ్డి కాసుకుని ఉంటారు. ఈ ప్రభుత్వానికి చేతకావడం లేదని నిందించడానికి ఆయన రెడీ.  దిశ పేరుతో తాను నడిపించిన ప్రహసనం మహా గొప్పదని, ఆ యాప్ ఉంటే గనుక అసలు రాష్ట్రంలో ఎక్కడ చిన్న అత్యాచారం కూడా జరిగే అవకాశం లేదనే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి నంగనాచి కబుర్లు చెపుతుంటారు. మొసలి కన్నీరు కారుస్తుంటారు. అది అలవాటుగా మార్చుకున్న జగన్మోహన్ రెడ్డి బద్వేలులో ఒక యువతి హత్యకు గురి కాగానే- ఇది ప్రభుత్వ వైఫల్యం అంటూ నానా యాగీ చేస్తున్నారు. మహిళలకు రక్షణ లేని ఇదేమి రాజ్యం అని ప్రశ్నిస్తూ ఒక పోస్టు పెట్టడం ద్వారా జగన్మోహన్ రెడ్డి తన పరువు తానే తీసుకుంటున్నారు. ఆఒక్క పోస్టుకు జవాబుగా అనేక ప్రశ్నలతో నారా లోకేష్ విరుచుకుపడడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతుంది.

జగన్ రెడ్డి పరిపాలనలో మహిళల పట్ల ఎన్నెన్ని అరాచకాలు జరిగాయో నారా లోకేష్ లెక్క చెబుతున్నారు. మీ ఐదేళ్ల పరిపాలనలో 2027 మంది మహిళలు హత్యకు గురయ్యారు.. ఏకంగా 30 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారు.. ఇలాంటి పరిస్థితుల మీద కనీసం ఒక్కసారైనా సమీక్ష నిర్వహించిన చరిత్ర మీకు ఉందా అని లోకేష్ సూటిగా ప్రశ్నిస్తున్నారు. సొంత బాబాయిని చంపినప్పటికీ పట్టించుకోని రాక్షసుడు రాష్ట్రంలో శాంతిభద్రతల గురించి మాట్లాడడం చిత్రంగా ఉన్నదని వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రంలో ఐదేళ్లపాటు గంజాయి సాగును స్వయంగా తన పార్టీ నాయకులతో ప్రోత్సహించి యువతరాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి -దళితుడిని హత్య చేసే డోర్ డెలివరీ చేసిన అనంతబాబును ఇంటికి పిలిచి భోజనం పెట్టిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి మాట్లాడడం చిత్రమైన పరిణామం అని లోకేష్ వ్యాఖ్యానిస్తున్నారు. శ్రీకాకుళంలో 8 ఏళ్ల బాలికపై ఐదుగురు అత్యాచారం చేసిన ఘటన దగ్గర నుంచి- జగన్ నివాసానికి అత్యంత సమీపంలో సీతానగరంలో మహిళపై జరిగిన దారుణంతో సహా ప్రతి దురాగతాన్ని లోకేష్ ఎత్తిచూపిస్తున్నారు.

తమాషా ఏమిటంటే ఎక్కడ మహిళలపై అఘాయిత్యాలు జరిగిన సరే ట్వీట్ చేయడం.. ప్రభుత్వం చేతకానిదని నిందించడం జగన్మోహన్ రెడ్డికి ఒక ఫ్యాషన్ అయిపోయింది. మొన్నటికి మొన్న పుంగనూరులో బాలిక కిడ్నాప్ మరియు హత్యకు గురైతే స్వయంగా వెళ్లి పరామర్శించి కాస్త అతి చేయాలని అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈలోగా పోలీసులు నిందితులను అరెస్ట్ చేసేసరికి పరామర్శకు వెళ్లే ఆలోచన కూడా మానుకున్నారు. జగన్మోహన్ రెడ్డి వస్తున్నట్టు ప్రకటించాడు కనుక మంత్రులు స్పందించి పుంగనూరు వచ్చారని ,సమస్యను పరిష్కరించారని తన మనుషులతో డప్పు కొట్టించుకున్నారు. ఇప్పుడు తన సొంత జిల్లాలో బద్వేలు లో అరాచకంగా ఒక వ్యక్తి ప్రియురాలిని హత్య చేస్తే ప్రభుత్వాన్ని నిందించడానికి సాహసిస్తున్నారు. బద్వేలులో గాని, పుంగనూరు ఘటనలో గాని ఒకటి రెండు రోజుల వ్యవధిలోనే పోలీసులు నిందితులను అరెస్టు చేయడం జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడడం లేదు. పోలీసులు ఇంత చురుగ్గా వ్యవహరించడాన్ని ఆయన జీర్ణం చేసుకోలేకపోతున్నారు. ప్రభుత్వం మీద బురద చల్లడానికి నానా పాట్లు పడుతున్నారు. అధికారానికి దూరమయ్యాననే దుగ్ధలో- జగన్మోహన్ రెడ్డి అర్థంపర్థం లేకుండా నోటికి వచ్చినట్లల్లా మాట్లాడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం గురించి, రాష్ట్రంలో శాంతిభద్రతల గురించి తలాతోకాలేని ఒక పోస్టు పెట్టడం ద్వారా తన ప్రభుత్వ కాలంలో అరాచకత్వం గురించి ఎదురైన.. సమాధానం చెప్పలేని అనేక ప్రశ్నలతో జగన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లుగా కనిపిస్తోంది!

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles