ఉద్యోగాల హామీ జగన్ మెడలో గుదిబండ!

Saturday, October 5, 2024

‘అయిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ.. రాష్ట్రంలో ఎంతమంది యువతకు జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఉద్యోగావకాశాలు కల్పించారు?’ అనే చర్చ ఇప్పుడు ఆయన ప్రభుత్వానికి గుదిబండగా మారుతోంది. ప్రతిపక్షాల కంటె ఎక్కువగా.. ఈ ప్రశ్నతో ఆయన సొంత చెల్లెలు వైఎస్ షర్మిల ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఒకవైపు చంద్రబాబునాయుడు నినాదాన్ని కాపీ కొడుతూ ‘జాబు రావాలంటే జగన్ కావాలి’ అని ప్రజలతో నినాదాలు చేయించుకుంటూ జగన్మోహన్ రెడ్డి ఆనందిస్తుండగా.. ఏటా జాబ్ క్యాలెండర్ అంటూ గత ఎన్నికలకు ముందు ప్రజలకు వాగ్దానంయిచ్చి, చేసిన మోసాన్ని షర్మిల ప్రస్తావిస్తున్నారు. ఈ అయిదేళ్లలో ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారో లెక్క చెప్పాలని ఆమె అంటున్నారు.

‘‘జగన్మోహన్ రెడ్డి గారూ.. 2.32 లక్షల ప్రభుత్వ శాఖల ఉద్యోగాలు, 23 వేల ఉపాధ్యాయ పోస్టులు ఇస్తామని గద్దె ఎక్కిన మీరు.. అయిదేళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ఆత్మవిమర్శ చేసుకోండి’’ అంటూ విమర్శలు గుప్పించారు.

23వేల టీచరు పోస్టుల గురించి గత ఎన్నికలకు ముందు మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి.. ఈ అయిదేళ్లలో ఒక్క టీచరు పోస్టును కూడా భర్తీ చేయలేదు. ఎన్నికలు ముంచుకు వస్తున్న తరుణంలో కేవలం 6100 పోస్టుల ఖాళీలను మాత్రం చూపిస్తూ డీఎస్సీ ప్రకటించి చిన్న డ్రామా నడిపించారు గానీ, ఆ ప్రయత్నాలకు కూడా ఎన్నికల సంఘం బ్రేకు వేసింది. ఎన్నికల తర్వాత డీఎస్సీ నిర్వహించుకోవాలని ఆదేశించింది. అదే సమయంలో చంద్రబాబునాయుడు.. ఎన్నికల తర్వాత తమ ప్రభుత్వం ఏర్పడితే.. మెగా డీఎస్సీ నిర్వహిస్తానంటూ ముందే హామీ ప్రకటించేశారు.

జగన్ మాత్రం తన ఎన్నికల ప్రచార సభల్లో దాదాపు మూడు లక్షల వరకు ప్రభుత్వోద్యోగాలను తన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే యువతకు ఇచ్చినట్టుగా టముకు వేసుకుంటున్నారు. ఆ రకంగా ఎన్నికల్లో హామీ కంటె ఎక్కువ ఉద్యోగాలే ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు. అయితే వీటిలో రెండున్నర లక్షల వరకు ఉద్యోగాలు గ్రామ వాలంటీర్లవే కాగా, మిగిలినవి గ్రామ సచివాలయ ఉద్యోగాలు. ఆ పాయింటును కూడా షర్మిల విడిచిపెట్టడంలేదు. వాలంటీర్లు అనేవి ఉద్యోగాలే కాదన్నట్టు మాట్లాడుతున్నారు.  గౌరవంగా చెప్పుకోగల ఉద్యోగం ఒక్కటైనా ఇచ్చావా అంటున్నారు. నేటికీ ప్రభుత్వ శాఖల పరిధిలో 2.25 లక్షల ఉద్యోగాలు ఖాళీగానే ఉన్నాయని, వాటి భర్తీ గురించి పట్టించుకోలేదని విమర్శిస్తున్నారు.

మొత్తానికి ఉద్యోగాల భర్తీ అనే హామీని గుదిబండగా మార్చి జగన్ మెడలో వేళ్లాడదీసేలా షర్మిల విమర్శలు సూటిగా, పదునుగా వైసీపీని ఇబ్బంది పెడుతున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles