పండ్ల చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్న సామెత చందంగా రాజకీయాలలో కూడా పనిచేసే వాళ్లకు మాత్రమే విమర్శలు ఎదురవుతూ ఉంటాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లాంటి ఒళ్లంతా కుట్రలు నిండిన నాయకులు ప్రతిపక్షంలో ఉంటే గనుక ఆ రాళ్ల దెబ్బలు మరింత ఎక్కువగా కూడా తగులుతుంటాయి. ‘బటన్ నొక్కడం’ అనే డ్రామాలు తప్ప నిర్దిష్టంగా పేద ప్రజల జీవితాలు బాగుపడడానికి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలన కాలంలో వారు చేసింది ఏమీ లేదు. ఇప్పుడు మహిళల ఆర్థిక స్వావలంబన, సాధికారత కోసం ఉచిత బస్సు ప్రయాణం రూపంలో అద్భుతమైన పథకాన్ని అమలు చేస్తుండగా.. వైసీపీ నేతలు అర్థంపర్థం లేని విమర్శలతో ప్రజలలో భయాన్ని పుట్టించే దుర్మార్గానికి పాల్పడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో కూటమి నాయకుల బాధ్యత మరింతగా పెరుగుతోంది. అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు తమ మీద వచ్చే అబద్ధపు ప్రచారాలను తిప్పి కొట్టాల్సిన అవసరం వారికి తెలిసి వస్తున్నది.
తాజాగా సూపర్ సిక్స్ హామీల అమలు తీరుతెన్నుల గురించి అధికారులు, నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదే విషయాన్ని వారందరికీ మరొక మారు తెలియజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉచిత బస్సు పథకం గురించి చేస్తున్న విమర్శలను ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
ఉచిత బస్సు ప్రయాణం పథకం రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పరిపాలన పట్ల విశేషంగా ప్రజాదరణను పెంచుతుందని పలువురు అంచనా వేస్తున్నారు. నిజానికి వైసీపీ నేతలలో ఉన్న భయం కూడా అదే. అందుకే ఈ పథకానికి విధించిన పరిమితులను, నిబంధనలను ప్రతి అంశాన్ని హైలైట్ చేస్తూ బురద చల్లడం కొనసాగిస్తున్నారు. ఏసీ బస్సులు, నాన్ స్టాప్ బస్సులు, డీలక్స్ సూపర్ లగ్జరీ బస్సులు, కేవలం ఆలయాల దర్శనానికి మాత్రం తీసుకువెళ్లే ఘాట్ రోడ్లు బస్సులు వీటిలో ఉచిత ప్రయాణ అవకాశాన్ని ప్రభుత్వం అందించడం లేదు. ఈ నిబంధనను వైసీపీ దళాలు హైలైట్ చేస్తున్నాయి. కేవలం దానివల్లనే రాష్ట్రంలోని మహిళలందరినీ వంచిస్తున్నట్టుగా రంగు పులుముతున్నాయి. మహిళలు సొంత కాళ్ల మీద నిలబడేందుకు ఉపయోగపడడం కోసం స్త్రీశక్తి పథకం తీసుకురాగా, ఏదో విహారయాత్రలకోసం, పుణ్యక్షేత్రాల సందర్శన కోసం తెచ్చినట్టుగా.. నిబంధనల ప్రకారం అనుముతులు లేని వాటి గురించి మహిళలను రెచ్చగొట్టేందుకు వైసీపీ దళాలు ప్రయత్నిస్తున్నాయి. ప్రతిరోజూ రాష్ట్రం నలుమూలల నుంచి కనీసం ఇరవై మంది ఆ పార్టీ నాయకులైనా ఈ విషయంపై మాట్లాడుతూ.. ప్రజల బుర్రల్లోకి విషం ఎక్కించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
నిజానికి చంద్రబాబునాయుడు- మనం చేస్తున్న మంచి గురించి మనమే ప్రచారం చేసుకోవాలని అని చెబుతుంటారు గానీ.. వాస్తవంలో అలాంటి పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఎదుటి వాళ్లు చేస్తున్న దుష్ప్రచారాన్ని అడ్డుకోవడానికి కూడా వీరికి సమయం సరిపోయేలా లేదు. ఈ సమీక్ష సమావేశంలో చంద్రబాబు కూడా అదే చెబుతున్నారు. దుష్ప్రచారాలను తిప్పికొట్టాలంటున్నారు. ప్రజలకు మంచి జరగాలంటే.. ఈ ప్రచారాల్ని తిప్పికొట్టడమే కూటమి నాయకుల ప్రధాన బాధ్యతగా మారేలా ఉన్నదని ప్రజలు అనుకుంటున్నారు.
కూటమి నేతల బాధ్యత పెంచుతున్న జగన్ మూకలు!
Friday, December 5, 2025
