2019 నాటి ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు- ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు ప్రచార పర్వంలో ఒక కీలకమైన వ్యత్యాసం ఉంది. అప్పట్లో జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఒక బలాన్ని ఆయన ఎన్నికలు ముగిసిన తర్వాత పోగొట్టుకున్నారు. అదే సమయంలో చంద్రబాబు నాయుడు అదే బలాన్ని అపరిమితమైన స్థాయిలో తనకు ఉన్నదని నిరూపిస్తూ ఇప్పుడు తన ప్రచార సభలలో చాటిచెబుతున్నారు. ఇంతకు అదేమిటో తెలుసా అచ్చమైన స్వచ్ఛమైన కుటుంబ బలం.
జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలలో ముమ్మరంగా ప్రచారం సాగించినప్పుడు.. ఆయనకు మద్దతుగా ఆయన సొంత కుటుంబం కూడా బరిలో హోరాహోరీగా ప్రచారం నిర్వహించింది. ఆయన భార్య భారతి బయట అడుగుపెట్టకపోయినప్పటికీ తతిమ్మా కుటుంబం జగన్ విజయం కోసం అహరహమూ పరిశ్రమించింది. ఆయన తల్లి వై ఎస్ విజయమ్మ కొన్నిచోట్ల సింగిల్ గా ప్రచారసభలు నిర్వహించగా, ఆయన చెల్లెలు షర్మిల రాష్ట్రమంతా సుడిగాలి పర్యటనలు చేశారు. అయితే గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కుటుంబం అనే బలమైన ఎలిమెంట్ ను జగన్మోహన్ రెడ్డి దూరం చేసుకున్నారు. అందుకు ఆయనలోని అహంకార వైఖరి ప్రధాన కారణం అని పలువురు వ్యాఖ్యానిస్తూ ఉంటారు. ఇదంతా పక్కన పెట్టినప్పటికీ .. ఇప్పుడు ఎన్నికల ప్రచార పర్వంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గతి ఎన్నికల్లో ఉన్న కీలకమైన బలం లేదు అనే సంగతిని గుర్తించాలి. ఇప్పుడు ఆయన కుటుంబంతో వేరుపడ్డారు. భార్య ఉన్నప్పటికీ ఆమె కేవలం పులివెందుల ఎమ్మెల్యే రాజకీయాలను చూసుకోవడానికి మాత్రమే సమయం వెచ్చిస్తున్నారు. జగన్ అందరినీ దూరం చేసుకుని ఒంటరిగా ప్రచారాలు చేస్తున్నారు.
అదే చంద్రబాబు నాయుడు పరిస్థితి పూర్తిగా భిన్నం. 2019 ఎన్నికలలో ఆయన కుటుంబ సభ్యులు ఎవరూ అంతగా ప్రచారానికి రాలేదు. తండ్రి కొడుకులు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ మాత్రమే రాష్ట్రవ్యాప్త ప్రచారాన్ని భుజాని కెత్తుకున్నారు. కానీ ఇప్పుడు వాతావరణం అలా లేదు. మొన్నటిదాకా నిజం గెలవాలి పేరుతో చంద్రబాబు నాయుడు అరెస్టును తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను పరామర్శిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించిన నారా భువనేశ్వరి ప్రస్తుతం మరో రాష్ట్ర వ్యాప్త షెడ్యూలుతో ఎన్నికల ప్రచార సభలలో కూడా పాల్గొంటున్నారు.
అదే సమయంలో హిందూపురం అభ్యర్థి కూడా రాష్ట్రవ్యాప్త ప్రచారాలతో జగన్ పై విరుచుకుపడుతున్నారు. అలాగే ఇప్పుడు బాలకృష్ణ కూతురు, లోకేష్ భార్య నారా బ్రాహ్మణి కూడా ఎన్నికల ప్రచారంలోకి రాష్ట్రవ్యాప్తంగా తిరగనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకు మధ్య ప్రధానంగా ఉన్న వ్యత్యాసం స్పష్టంగా బయటపడిపోతుంది.
చంద్రబాబుకు సొంత కుటుంబం ఉన్నది. అది ఆయన విజయం కోసం పాటుపడుతున్నది. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి తన సొంత కుటుంబాన్ని తల్లిని కూడా దూరం చేసుకున్నారు. ఒంటరి అయ్యారు. దీనిని గమనించి అయినా జగన్మోహన్ రెడ్డిలో ఆలోచన రావాలని, కుటుంబాన్ని ఎప్పటికీ దూరం చేసుకోకూడదు అనే పాఠాన్ని ఆయన నేర్చుకోవాలని ప్రజలు అంటున్నారు.
జగన్ పోగొట్టుకున్న బలం.. చంద్రబాబు చూపిస్తున్నారు!
Friday, December 20, 2024