ఒక నాయకుడి పేరుతో ఒక సంస్థకో మరో దానికో.. ఒకసారి నామకరణం చేసిన తర్వాత మళ్లీ దానిని వెనక్కు మళ్లించి మార్చవలసి వస్తే.. ఆ నాయకుడికి అది తప్పకుండా అవమానమే అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలందించిన వైఎస్ రాజశేఖర రెడ్డికి ఇప్పుడు అలాంటి అవమానం తప్పేలా కనిపించడం లేదు. అలాంటి అవమానం కూడా ఆయన కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రదర్శించిన అత్యుత్సాహం, తండ్రి మీద అతిప్రేమ కారణంగా జరుగుతున్నదే కావడం గమనార్హం. వైఎస్సార్ పేరు పెట్టిన కడప జిల్లాకు పేరు మళ్లీ మారే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీకి చెందిన రాష్ట్ర మంత్రి సత్యకుమార్ ఇలాంటి ప్రతిపాదన తెరపైకి తెచ్చారు.
వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా రెండోసారి గెలిచిన తర్వాత.. హఠాత్తుగా హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే కడపజిల్లాకు ఆయన పేరు జోడించి.. వైఎస్సార్ కడప జిల్లాగా నామకరణం చేసింది. అంతా బాగానే ఉంది. ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి 2019 లో ముఖ్యమంత్రి అయ్యారు. పార్లమెంటు నియోజకవర్గాల స్థాయికి అన్నట్టుగా చిన్న జిల్లాలను ఏర్పాటుచేశారు. రాష్ట్రంలో మొత్తం 26 జిల్లాలు ఏర్పాటు అయ్యాయి. చాలా జిల్లాలకు వ్యక్తుల పేర్లను కూడా జోడించారు. ఆ క్రమంలో వైఎస్సార్ కడప జిల్లాకు కూడా పేరు మార్చడం జరిగింది. ‘కడప’ అనే పదాన్ని తొలగించి కేవలం వైఎస్సార్ జిల్లా అని పేరు పెట్టారు జగన్. ఆ రకంగా తండ్రి పట్ల తాను అతిభక్తిని చూపించినట్టు ఆయన అనుకున్నారు. ఇప్పుడు అదే సమస్యగా మారుతోంది.
కడప అనే పదంలో కడపజిల్లా చారిత్రక నేపథ్యాన్ని, ఔన్నత్యాన్ని తెలిపే తీరు ఉన్నదని.. ఆ పదాన్ని జిల్లా పేరులో తొలగించడం కరెక్టు కాదని భారతీయ జనతా పార్టీకి చెందిన రాష్ట్రమంత్రి సత్యకుమార్ అంటున్నారు. ఈ మేరకు గత ప్రభుత్వం జిల్లాపేరున కేవలం వైఎస్సార్ జిల్లాగా ప్రకటించి గెజిట్ ఇవ్వడాన్ని ాయన తప్పుపట్టారు. జిల్లా చారిత్రక గౌరవాన్ని జగన్ మంటగలిపారని అంటున్నారు. ఆధ్యాత్మికంగా ఉండే ప్రాశస్త్యాన్ని దెబ్బతీశారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం పేరు మళ్లీ మార్చి తిరిగి ‘వైఎస్సార్ కడపజిల్లా’గా నామకరణం చేయాలని సత్యకుమార్ కోరుతున్నారు. అలా జరిగితే.. జగన్ అత్యుత్సాహానికి అది గొడ్డలిపెట్టు అవుతుంది.
అతిప్రేమతో తప్పుడు నిర్ణయాలు తీసుకుని తండ్రిని అవమానాల పాల్జేయడం జగన్ కు ఇది కొత్త కాదు. నిక్షేపంగా ఉన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఆ పేరు తొలగించి తన తండ్రి పేరు పెట్టుకున్నారు జగన్. తెలుగుదేశం సర్కారు రాగానే.. వైఎస్సార్ పేరును పీకేసి తిరిగి ఎన్టీఆర్ పేరు పెట్టింది. జగన్ కారణంగా, అలాంటి అవమానమే వైఎస్సార్ కు ఇప్పుడు మరోసారి జరగనుంది.