అమరావతి రాజధానిని ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని గతంలో చంద్రబాబు నాయుడు ఒక యజ్ఞంలా ప్రయత్నం చేస్తే, తాను ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆ కలలన్నింటినీ చిదిమేస్తూ మూడు రాజధానుల డ్రామా ప్రారంభించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి! ఇప్పుడు ప్రధాని చేతుల మీదుగా అమరావతి నగర పునర్నిర్మాణం కోసం శంకుస్థాపన జరుగుతుం..డగా కనీసం ఆ కార్యక్రమానికి హాజరై తన మద్దతును తెలియజేసే సహృదయం కూడా లేని నాయకుడు ఆయన. కార్యక్రమానికి తనకు ఆహ్వానం రావడానికి ముందే బెంగళూరు యలహంక ప్యాలెస్ కు పారిపోయారు!
అమరావతిని సర్వనాశనం చేయాలనే తన కుట్రలను అధిగమించి ఇప్పుడు జరుగుతున్న కృషిని ఆయన సహించలేకపోతున్నారని అర్థమవుతోంది. ఇలాంటి నేపథ్యంలో ఒకవేళ పరిస్థితులు వికటించి భవిష్యత్తులో మళ్లీ ఏదో ఒక నాటికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే పరిస్థితి ఏమిటి? అప్పటికి అమరావతి నగరం సర్వాంగ సుందరంగా, శోభాయ మానంగా నిర్మితమై ఉండివచ్చు, లేదా, నగరంలో అక్కడక్కడ ప్రభుత్వం తరఫున చేపట్టవలసిన నిర్మాణాలు కూడా కొంతమేర పెండింగ్ ఉండవచ్చు. ఆ నగరం మీద ఆయన మళ్లీ విషం కక్కకుండా ఉంటారా అనేది ప్రజల భయం.
పెండింగ్ ప్రాజెక్టు లు ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వాటి గురించి పట్టించుకోకుండా అలవాటైన విధ్వంసరచన కొనసాగిస్తారనేది ఒక వాదన. ఒకవేళ జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి దాపురించే నాటికి అమరావతి రాజధాని నిర్మాణాన్ని మొత్తంగా ఇప్పుడు స్వప్నిస్తున్న స్థాయిలో కూటమి ప్రభుత్వమే పూర్తి చేసి ఉన్నప్పటికీ కూడా, ఆయన గద్దెమీదికి వచ్చిన తర్వాత రాష్ట్రానికి రాజధాని ఇది కాదు విశాఖ అని ఒక ఏకవాక్య ప్రకటన చేసి ప్రజల ఆశలపై నీళ్లు చిలకరించరని గ్యారెంటీ ఏముంది?
ఇలాంటి భయాలకు విరుగుడుగానే ఆంధ్రప్రదేశ్ కు ఏకైక రాజధాని అమరావతి మాత్రమే అని చెబుతూ పార్లమెంటులో ఒక చట్టం చేసే ఆలోచన ఉన్నట్లుగా భారతీయ జనతా పార్టీకి చెందిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ చెబుతున్నారు. భవిష్యత్తులో కొత్త కుట్రలు జరగకుండా జరగకుండా ఉండాలంటే ఇలాంటి చట్టం అవసరం అని ఆయన అభిప్రాయపడుతున్నారు. జగన్ గతంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడు రాజధానుల ల ప్రతిపాదన పెట్టిన జగన్, వ్యవహారం కోర్టులో ఉండగా కుటిలవాదనలు వినిపించారు. ప్రభుత్వ న్యాయవాదులు అసలు అమరావతిని రాజధానిగా నోటిఫై చేయనేలేదని అన్నారు. తీరా హైకోర్టు అమరావతి నిర్మాణాల్ని పూర్తిచేయాల్సిందేనని, అదొక్కటే రాజధాని అని తీర్పు చెప్పిన తర్వాత కూడా జగన్ పట్టించుకోలేదు. అలాంటి దుర్బుద్ధులను గుర్తుంచుకుని.. రాజధానిపై కేంద్రం చట్టం చేయాలని ఆ ప్రాంత రైతులు కోరుతున్నారు. వారి కోరిక మేరకు బిల్లు పెట్టే ఆలోచన ఉన్నట్టు కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ అనడం విశేషం.
జగన్ భవిష్యత్తు కుట్రలకు చట్టం ద్వారా ముకుతాడు!
Sunday, January 11, 2026
