జగన్మోహన్ రెడ్డి కరపత్రిక నిత్యం అబద్ధాలను వండి వారుస్తూ ఉంటుంది. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ.. తనను ఎవరూ చూడడం లేదని అనుకుంటున్నట్టుగా.. జగన్ కరపత్రిక కూడా ఒక రకమైన ఆత్మవంచనలో బతుకుతూ ఉంటుంది. తాము ప్రచురించే వార్తలను ప్రజలందరూ నమ్ముతారని, ఆ రకంగా జగన్ పట్ల భక్తిని పెంచుకుంటారని అనుకుంటూ ఉంటుంది. కానీ వారికి తెలియని వాస్తవం ఏంటంటే.. ఆ పత్రికను చదివేవాళ్లు కేవలం జగన్ భక్తులు మాత్రమే. వారివద్ద జగన్ ను పొగడడం వల్ల కొత్తగా సాధించేదేమీ ఉండదు. ఈ చర్చను పక్కన పెడితే.. సోమవారం నాడు అసెంబ్లీ వద్ద జగన్ నడిపించిన హైడ్రామా గురించి కరపత్రిక రాసిన రాతలే కంపరంగా ఉన్నాయి. ఆ రాతలే జగన్ పరువు తీసేలా ఉన్నాయి.
జగన్ అసెంబ్లీ వద్దకు నల్లకండువాలతో వెళ్లారు. ఇవాళ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నరు ప్రసంగం షెడ్యూలు మాత్రమే ఉంటుంది. గవర్నరు పట్ల చట్టసభ సభ్యులుగా గౌరవప్రదంగా వ్యవహరించాల్సిన బాధ్యత జగన్ అండ్ కో కు కూడా ఉంటుంది. కానీ జగన్ దళం నల్ల కండువాలు, బ్యాడ్జిలు వేసుకుని వెళ్లారు. చేతిలో పెద్ద పెద్ద ప్లకార్డులు పట్టుకుని వెళ్లారు. అయితే అసెంబ్లీ గేటు వద్ద పోలీసులు అడ్డుకుని ప్లకార్డులతో వెళ్లడానికి వీల్లేదని అన్నారు. నిజానికి వాళ్ల కండువాల పట్ల పోలీసులు అభ్యంతర పెట్టింది లేదు. ప్లకార్డుల్ని అనుమతించం అని చెప్పినప్పటికీ.. జగన్ దళం వినలేదు. వారితో వాదులాటకు దిగి గొడవ పెట్టుకున్నారు. పోలీసులు ప్లకార్డులు లాగేసుకున్నందుకు మళ్లీ గొడవ పెట్టుకున్నారు. రాద్ధాంతం చేశారు.
నిజానికి జగన్ గొడవ తన కారును మెయిన్ గేటు గుండా లోపలకు పంపాలని స్టార్ట్ చేశారు. సాధారణ ఎమ్మెల్యేలు అందరూ 4వ గేటు నుంచి వెళ్లాలని పోలీసులు చెబితే ఆయన ఒప్పుకోలేదు. 4వగేటు బయట అందరూ కారు దిగి వెళుతోంటే.. జగన్ మాత్రం కారుతో లోపలకు వెళ్లాలని, మెయిన్ గేటు గుండానే వెళ్లాలని గొడవ చేశారు. 4వ గేటు గుండా ఆయన కారుతో వెళ్లడానికి చివరికి పర్మిషన్ ఇచ్చినా మెయిన్ గేటు కోసం రభస చేసి, చివరకు విధిలేక 4వ గేటు గుండా వెళ్లారు. కరపత్రిక రాతలు మాత్రం మెయిన్ గుటు గుండా అనే ప్రస్తావన లేకుండా జగన్ ను ఆపేసినట్టుగా ఉన్నాయి. ఆ రాతల్లోనే.. ఆయన చేయదలచుకున్నది తప్పు అని.. దాన్ని దాచడానికి కరపత్రిక ప్రయత్నిస్తున్నదని అర్థమవుతోంది.
కరపత్రిక రాతల్లోనే జగన్ దుర్బుద్ధులు తెలిసిపోతున్నాయ్!
Friday, December 5, 2025
