గత ప్రభుత్వ హయాంలో కొత్త లిక్కర్ విధానం తీసుకొచ్చి నాలుగు సంవత్సరాల పాటు సాగించిన బీభత్సమైన దోపిడీ పర్వం గురించి ఇప్పుడు ప్రత్యేక దర్యాప్తు బృందం సాగిస్తున్న విచారణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భూకంపం పుట్టిస్తోంది. జగన్ అయిదేళ్ల పాలన కాలంలో జరిగిన అన్ని రకాల అక్రమాలు, దందాలు వేరు. లిక్కర్ మరియు ఇసుక కుంభకోణాల సంగతి వేరు. ఆ రెండు కుంభకోణాల్లో అంతిమ లబ్ధిదారుగా స్వయంగా జగన్మోహన్ రెడ్డే ఉంటూ అక్రమాలను ప్రోత్సహించారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ నేపథ్యంలో లిక్కర్ స్కామ్ దర్యాప్తు ముందుకు సాగకుండా.. ఆ పార్టీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకున్నది. ఎవరు పోలీసులకు దొరికితే, ఎవరు పోలీసు విచారణకు హాజరైతే.. లిక్కం స్కామ్ తాలూకు డొంకంతా కదులుతుందో.. అలాంటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ని అజ్ఞాతంలో ఉంచి.. అతను చిక్కకుండా ఉండేందుకు నానా కష్టాలు పడుతున్నారు. ఇలాంటి సమయంలో మొన్నమొన్నటిదాకా పార్టీలో అత్యంత కీలకమైన వ్యక్తుల్లో ఒకరుగా ఉన్న విజయసాయిరెడ్డికి సిట్ విచారణకు రావాలని నోటీసులు పంపడం.. గమనార్హం. ఆయన సిట్ విచారణ లో నోరువిప్పితే.. కసిరెడ్డి రాజ్ పట్టుబడడం కంటె ప్రమాదకరం అని జగన్ దళాలు భయపడుతున్నాయి.
జగన్ మోహన్ రెడ్డి తన పరిపాలన కాలంలో.. ఒక్కొక్క దందాలో వసూళ్ల నెట్ వర్క్ నడిపించే బాధ్యతలను ఒక్కొక్కరి భుజాల మీద పెట్టి.. అంతిమ ప్రయోజనాలను మాత్రం తాను పొందుతూ.. రెచ్చిపోయారనే ఆరోపణలున్నాయి. కప్పం వసూలు చేసే కీలక వ్యక్తులు.. ఆ పెద్దమొత్తాల్లో చిన్న వాటాలను తాము వెనకేసుకుంటూ వ్యవహారాలు నడిపిస్తూ వచ్చారు. కానీ.. జగన్ యొక్క అన్ని దందాలను పర్యవేక్షిస్తూ.. పూర్తి అవగాహనతో వాటిని గమనిస్తూ వచ్చిన వారిలో విజయసాయిరెడ్డి కూడా ఉన్నారు.
కాకినాడ్ సెజ్ పోర్టు వాటాల విక్రయంలో బెదిరింపుల కేసుకు సంబంధించి ఇటీవల సీఐడీ విచారణకు హాజరైన ఆయన మద్యం కుంభకోణం గురించి కొన్ని వివరాలు బయటపెట్టారు. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి.. ఈ స్కామ్ కు కర్త కర్మ క్రియ గా నిలిచారని, అవసరం వచ్చినప్పుడు అన్ని వివరాలూ చెబుతానని అన్నారు. ప్రతి కేసు విక్రయం మీద భారీ వాటాలు చెల్లించిన మద్యం తయారీ సంస్థలకు మాత్రమే ఆర్డర్లు పెట్టారనేది దందాలో అసలు కీలకం. విజయసాయిరెడ్డి బినామీ పేర్లతో లిక్కర్ కంపెనీలను తన పరం చేసుకుని ఆర్జించారని కూడా ఆరోపణలున్నాయి. అది కూడా నిజమైతే.. కేసుల వారీగా ఎంతెంత వాటాలు ఎవరికి ఎలా ముట్టజెబుతూ వచ్చారో ఆయనకు ఇంకా స్పష్టత ఉండే అవకాశం ఉంది. పైగా ఆయన ఇప్పుడు జగన్ తో విభేదించి.. దూరంగా మెదలుతున్నారు. జగన్ చుట్టూ కొందరు కోటరీ వ్యక్తులు చేరారని, వారు జగన్ ను మాయ చేస్తున్నారని అంటున్నారు. అలాంటిది.. విజయసాయిరెడ్డి లిక్కర్ స్కామ్ గురించి నోరు తెరచి తనకు తెలిసిన వాస్తవాలన్నీ చెబితే.. జగన్ అవినీతి సామ్రాజ్యపు పునాదులు కదులుతాయని, పోలీసులు ఇక ఆ విషయాలను సాక్ష్యాధారాలు సేకరిస్తే సరిపోతుందని పలువురు భావిస్తున్నారు.
జగన్ భయం :విజయసాయి నోరు తెరిస్తే అంతే సంగతులు
Sunday, April 27, 2025
