ఎదురైన పరాజయ భారాలు మామూలివి కాదు. కానీ రాజకీయాల్లో ఉన్న తరువాత.. గెలుపోటములు రెండింటికీ సిద్ధపడి ఉండాలి. ఓటములు ఎన్ని ఎదురైనా సరే.. వెంటవెంటనే వాటినుంచి కోలుకునే మనోధైర్యం ఉండాలి. ఎదురుదెబ్బలను తట్టుకుని నిలబడకపోతే.. ప్రజలు నవ్వుతారు. కనీసం మేకపోతు గాంభీర్యం అయినా ప్రదర్శిస్తూ బతకాలి. కానీ జగన్మోహన్ రెడ్డి తన పరాజయ భారాలను తట్టుకోలేకపోతున్నారు. కడప జిల్లాల్లో ఉపఎన్నికల ఫలితాలు రావడానికంటె ముందురోజే ప్రెస్ మీట్ పెట్టి బురదచల్లేసి పారిపోయిన జగన్.. ఫలితాల తర్వాత మరీ ముడుచుకుపోయారు. చాలాకాలం కిందట నిర్ణయం అయిన కార్యక్రమానికి కూడా హాజరు కావడం మానేస్తే నవ్వులపాలవుతాననే భయంతో.. ధర్మవరంలో పెళ్లికి వెళ్లిన జగన్.. అక్కడకూడా ఎక్కువ సమయం గడపలేదు. అన్నింటినీ మించి.. స్వాతంత్ర్యదినోత్సవం తరువాత.. రాష్ట్ర గవర్నరు రాష్ట్రంలోని ప్రముఖులకు ఇచ్చే విందు ఎట్ హోమ్ కు హాజరు కావడానికి కూడా ఈ మాజీ ముఖ్యమంత్రికి మొహం చెల్లడం లేదు అని తేటతెల్లం అవుతోంది.
శుక్రవారం సాయంత్రం విజయవాడలోని రాజ్ భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ఎట్ హోమ్ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ దంపతులుగా హాజరయ్యారు. పద్మ అవార్డు గ్రహీతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు అనేకమంది, మంత్రులు అధికారులు కార్యక్రమానికి హాజరయ్యారు.
కానీ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం గవర్నరు ఆతిథ్యం ఇచ్చిన ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరు కాలేదు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రథమపౌరుడు ఇచ్చే విందు కార్యక్రమం ఇది. దీనికి గౌరవంగా అందరూ హాజరు అవుతారు. కానీ.. జగన్ దంపతులు హాజరు కాలేదంటే.. దాని అర్థం.. ఆయనకు నలుగురి ఎదుటకు రావడానికి మొహం చెల్లడం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఏడాది కూడా ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరు కానేలేదు. అప్పట్లో పీసీసీ చీఫ్ షర్మిలకూడా కార్యక్రమానికి వచ్చారు గానీ.. జగన్ రాలేదు. రాష్ట్రంలో కేంలం 11 మంది ఎమ్మెల్యేలను మాత్రమే గెలిపించుకోగలిగిన పరాభవ భారంతో జగన్ రాలేదని అంతా అనుకున్నారు. ఒక ఏడాది గడిచేసరికి ఆయన టీడీపీ ప్రభుత్వం మీద నిందలు వేసి, వారు కేవలం ఈవీఎంలతో గెలిచారని ప్రచారం చేసుకుని, తనకు ప్రజాదరణ ఉన్నదని చెప్పుకోడానికి కొన్ని యాత్రలు నిర్వహించి.. తను బలంగా ఉన్నానని చాటుకునే దశకు వచ్చారు. ఈ ఏడాది మామూలు పరిస్థితుల్లో ఎట్ హోమ్ కు వచ్చి ఉండేవారే గానీ.. సరిగ్గా ముందురోజు కడప జిల్లా జడ్పీటీసీ ఉపఎన్నికల ఫలితాలు రావడం.. పులివెందుల, ఒంటిమిట్టల్లో దారుణంగా పార్టీ ఓడిపోవడం, డిపాజిట్ కూడా దక్కకపోవడం వెరసి ఆయన అవమాన భారం నుంచి బయటపడలేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఓటమి భారం నుంచి కోలుకోలేకపోతున్న జగన్.. కనీసం రాబోయే మూడేళ్లలోనైనా ఒక్కసారైనా గవర్నరు ఇచ్చే ఎట్ హోమ్ విందుకు హాజరయ్యేపాటి ధైర్యాన్ని కూడగట్టుకుంటారో లేదో నని పలువురు నవ్వుకుంటున్నారు.
జగన్ కు మొహం చెల్లడం లేదు పాపం..!
Monday, December 8, 2025
