జగన్ విధ్వంస బుద్ధికి.. బాబు జపాన్ మందు!

Wednesday, December 18, 2024

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం నాడు రాజధాని అమరావతి ప్రాంతంలో విస్తృతంగా పర్యటించారు. అయిదేళ్ల కిందట తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాజధాని నిర్మాణ పనులు ఏ దశలో ఉన్నాయో ఇప్పటిదాకా అదే దశలో మిగిలిపోవడం మాత్రమే కాదు కదా.. కొంత ధ్వంసం కూడా అయి ఉండడాన్ని ఆయన స్థానికులు, పార్టీ నాయకులు, అధికారులు, మీడియా మిత్రులు వెంటరాగా పరిశీలించారు. ముక్కలు చెక్కలుగా జగన్ శిథిలం చేసేసిన ప్రజావేదికతో ప్రారంభించి.. ఉద్ధండరాయని పాలెంలో శంకుస్థాపన చేసిన ప్రాంతంలో మట్టికి మొక్కి, పూజలు నిర్వహించి.. సగంలో ఉన్న అన్ని నిర్మాణాలను ఆయన తిరిగి పరిశీలించారు. ఆ తర్వాత ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు.

ఒక దుర్మార్గుడు రాష్రానికి ముఖ్యమంత్రి అయితే ఏ రకమైన విధ్వంసం జరుగుతుందో జగన్మోహన్ రెడ్డి నిరూపించాడని చంద్రబాబు అన్నారు. జగన్ అసలు ప్రజాజీవితానికే పనికి రాని వ్యక్తి అని చెప్పుకొచ్చారు. పదేళ్ల తర్వాత కూడా మీ రాజధాని ఏది అంటే.. ఏపీ ప్రజలు ఏమీ చెప్పుకోలేని దుస్థితిలోకి జగన్ నెట్టేశారని ఆరోపించారు. రాష్ట్రప్రజల భవిష్యత్తుతో మూడుముక్కలాట ఆడారని అన్నారు. ఏ నాయకుడు అయినా సరే ముఖ్యమంత్రి అయితే.. ప్రజలు తనని గుర్తుంచుకునే మంచి పనితో పాలన ప్రారంభించాలని అనుకుంటారని, కానీ జగన్మోహన్ రెడ్డి ప్రజావేదిక విధ్వంసంతో ప్రారంభించారని అన్నారు.

అయితే ఈ సందర్భంగా చంద్రబాబు ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ లో ఒక విలువైన సూచన వచ్చింది. ముక్కలుగా మారిన ప్రజావేదిక, ఆగిన అనేక నిర్మాణాలు తదితర విషయాల్లో మీరు ఏం చేయబోతున్నారంటూ విలేకరులు అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు చక్కగా సమాధానం చెప్పారు. నేను ఏం చేయాలో మీరు చెప్పండి.. రాష్ట్ర ప్రజలుగా మీకు కూడా బాధ్యత ఉంది. అందరి సూచనలు తీసుకున్న తర్వాతే.. ఏం చేయాలనే కార్యచరణ ప్రణాళిక నిర్ణయిస్తాం అని చంద్రబాబు అన్నారు. ఒక విలేకరి మాట్లాడుతూ.. ప్రజావేదిక శకలాలను జగన్ విధ్వంసపాలనకు చిహ్నంగా అలాగే ఉంచేయాలని సూచించారు. చంద్రబాబు నాయుడు అందుకు స్పందిస్తూ.. జపాన్ ఉదాహరణ చెప్పారు. హిరోషిమా, నాగసాకిలపై అణుబాంబులు వేసి సర్వనాశనం చేశారని, జపాన్ దేశప్రజలు ఆ ప్రాంతాలను అలాగే వదిలేసి .. ఆ విధ్వంసాన్ని చూసి స్ఫూర్తి పొందడానికి మిన్నకుండిపోయారని.. జగన్ విధ్వంసాన్ని రాష్ట్రప్రజలంతా తరచూ తలచుకునేలా వాటిని అలాగే వదిలేయడం మంచి ఆలోచనే అని వ్యాఖ్యానించారు.

నిజానికి చంద్రబాబు ఇంటికి పోతూ వస్తూ ప్రతిరోజూ కూలిన ప్రజావేదిక శకలాల్ని చూసి దుఃఖించాలనే శాడిజంతో జగన్, దానిని ధ్వంసం చేసిన తర్వాత తొలగించకుండా వదిలేశారు. అయితే ఆ శకలాలే ఇప్పుడు జగన్ దుర్మార్గానికి, పైశాచిక పోకడలకు రుజువులాగా అమరావతి ప్రాంతంలో శాశ్వతంగా మిగలబోతున్నాయి. వాటిని ఒక మాన్యుమెంట్ లాగా మారిస్తే జగన్ శాడిజానికి అది చిహ్నంగా, చంద్రబాబు వేసిన జపాన్ మందులాగా మిగిలిపోతుంది. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles