మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం నాడు సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. పాపిరెడ్డిపల్లిలో వ్యక్తిగత కక్షల కారణంగా హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడం అనేది జగన్ కార్యక్రమం షెడ్యూలు. జగన్ రాక సందర్భంగా భారీ ఎత్తున జనసమీకరణలు చేపట్టాలని పార్టీ కేడర్ కు ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి. అయితే జనసమీకరణ విషయంలో స్థానిక నాయకులనుంచి స్పందన పెద్దగా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో జగన్ దళాలు డిఫెన్సివ్ ధోరణిలోకి వెళ్లిపోయాయి. జనం పెద్దగా లేకపోతే అవమానం అనే భయంతో.. నాలుగురోజుల ముందునుంచే.. పోలీసులు తమ పార్టీ కార్యకర్తల మీద ఆంక్షలు పెడుతున్నట్టుగా తమ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు.
జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన నాటినుంచి ఎక్కువకాలం బెంగుళూరు యలహంక ప్యాలెస్ లోను, అక్కడినుంచి విరామం కోసం తాడేపల్లి ప్యాలెస్ లోను గడుపుతున్నారు. ఎఫ్పుడో ఒక సారి పరామర్శలకు బయటకు వస్తున్నారు. ఇప్పుడు పాపిరెడ్డి గారి పల్లి పర్యటన కూడా అలాంటిదే. తాడేపల్లి నుంచి బెంగుళూరుకు వెళ్లే క్రమంలో మార్గమధ్యంలో ఈ ఊరిలో కాసేపు గడిపి, ప్రభుత్వం నిందలు వేసేసి వెళ్లిపోయేలా ఆయన ప్లాన్ చేసుకున్నారు. ఇది కేవలం బ్రేక్ జర్నీ పర్యటన. అయినా సరే.. అక్కడకు కూడా పెద్ద సంఖ్యలో జనాన్ని పోగేయాల్సిందిగా.. పార్టీ స్థానిక నాయకులకు ఆదేశాలు వెళ్లాయి. అయితే అందుకు మాత్రం నేతలు సుముఖంగా లేరని సమాచారం. తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి కాస్త ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని.. జనాన్ని సమీకరించడానికి ఖర్చు పెడుతున్నారు గానీ.. జిల్లాలోని మిగిలిన నాయకులు పెద్దగా పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఈ సంకేతాలు గమనించిన పార్టీ దళాలు మాత్రం.. ముందునుంచే పోలీసులను నిందించడం ప్రారంభించాయి.
జగన్ పర్యటనను విఫలం చేయడానికి పోలీసులు కుట్రలు చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. బలప్రదర్శన అన్నట్టుగా చెన్నేకొత్తపల్లి నుంచి పాపిరెడ్డి పల్లి దాకా జనాలను వెంటబెట్టుకుని, వారితో సీఎం నినాదాలు చేయించుకుంటూ వెళ్లాలని జగన్ అనుకున్నారు. కానీ.. అక్కడ హెలిప్యాడ్ కు పోలీసులు అనుమతి ఇవ్వకపోడంతో ఖంగు తిన్నారు. పాపిరెడ్డి పల్లి వద్దనే హెలిప్యాడ్ అనుమతి లభించింది. అయితే ఇది కూడా పోలీసు కుట్రగా ఆ పార్టీ పేర్కొంటుండడం విశేషం.
అసలే పార్టీ నాయకులు మొహం చాటేస్తున్న ప్రస్తుత సమయంలో.. అనుకున్నట్టుగా జనసమీకరణ జరగకపోతే.. తమ కార్యకర్తలు, అభిమానులు రాకుండా జిల్లా అంతటా ఆంక్షలతో పోలీసులు అడ్డుకున్నారని ఆరోపించడానికి వీలుగా ముందుగానే ప్రకటనలు వదలుతున్నారు.
జగన్ డిఫెన్సివ్ మోడ్ : ముందుజాగ్రత్త ఆరోపణలు!
Saturday, April 12, 2025
