ఇప్పుడు ఎన్నికలు వచ్చినా సరే.. మేం గెలిచి తీరుతాం అంటూ జగన్మోహన్ రెడ్డి కొన్ని రోజులుగా ఎన్నెన్ని ప్రగల్భాలు పలుకుతున్నారో ప్రజలు గమనిస్తున్నారు. కానీ ఇప్పుడు ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో ఆయనగానీ, ఆ పార్టీ నాయకులు గానీ చప్పుడు చేయడంలేదు. ఇప్పుడు రాష్ట్రంలో రెండు పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ అభ్యర్థులను కూడా ప్రకటించింది. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అసలు ఎన్నికలు వచ్చాయనే వాతావరణమే కనిపించడం లేదు. తాడేపల్లి వర్గాల నుంచి విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. అసలు ఈ పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఎటు తిరిగీ ఓటమి తప్పదనే భయంతో ఉన్న జగన్మోహన్ రెడ్డి.. ఎన్నికల్లో ఎటూ అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతుందని ముందే నిందవేసేసి ఎన్నికల్లో బరిలోకి దిగకుండా ఉండాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
కృష్ణా-గుంటూరు, ఉభయగోదావరి జిల్లాలకు సంబంధించి రెండు పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ స్థానాలకు వరుసగా ఆలపాటి రాజేంద్రప్రసాద్, పేరాబత్తుల రాజశేఖర్ లను అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ప్రకటించింది. వీరిద్దరూ గత ఎన్నికల సమయంలో తెనాలి, కాకినాడ రూరల్ స్థానాల నుంచి అభ్యర్థిత్వాలను ఆశించిన వారు. జనసేనకు ఆ సీట్లు కేటాయించడంతో వీరు అవకాశం కోల్పోయారు. ఆలపాటి రాజా గతంలో మంత్రిగా చేసిన నాయకుడే అయినా.. నాదెండ్ల మనోహర్ కోసం త్యాగం చేశారు. మొత్తానికి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో దిగుతున్నారు.
రాష్ట్రప్రభుత్వం పట్ల అప్పుడే వ్యతిరేకత మొదలైపోయిందని అంటున్న జగన్మోహన్ రెడ్డి.. తన వాదన మీద నిజంగా నమ్మకం ఉంటే.. ఈ ఎన్నికలలో పోటీచేసి సత్తా చాటుకోవాలి. నిజానికి చంద్రబాబునాయుడు ప్రభుత్వం పారిశ్రామికీకరణ, యువతకు ఉపాధి అవకాశాల కల్పన దిశగా తీసుకుంటున్న చర్యలు చూసిన ఏ ఒక్క పట్టభద్రుడు కూడా మరొక పార్టీకి ఓటు వేయడం అనేది అసాధ్యం. జగన్ అనేక సంక్షేమ పథకాల పేరుతో ఎంత డబ్బు పంచిపెట్టినా.. లబ్ధిదారులే ఆయనకు ఓటు వేయలేదు. అలాంటిది ఈ పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో చదువుకున్నవాళ్లు, అంతో ఇంతో ఆలోచన ఉన్నవాళ్లు మాత్రమే ఓటర్లుగా ఉంటారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వం రాజధాని అమరావతిని అద్భుత నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు గానీ, రైల్వేజోన్ సాధించడం, పోలవరం పూర్తిచేసే దిశగా పడుతున్న అడుగులు ఇవన్నీ వారికి ఎంతో స్ఫూర్తిగా కనిపిస్తాయి. చంద్రబాబునాయుడు నాయకత్వం ఈ దేశానికి అవసరం అనే భావన కలిగిస్తాయి.
ఈ సమయంలో పోటీచేస్తే తాము ఎటూ ఓడిపోతాం అనే భయంతో.. కుంటిసాకులు చెప్పి పోటీనుంచి తప్పించుకోవాలని జగన్ భావిస్తున్నారని తెలుస్తోంది. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు తెలుగుదేశం కూడా దూరంగా ఉండడాన్ని ఆయన ఉదాహరిస్తున్నారట. కానీ అవి పార్టీ ప్రతినిధుల ఓట్లతో జరిగే ఎన్నికలు. ఇవి ప్రజలతో జరిగే ఎన్నికలు. ఆయన పోటీచేయరాదనే నిర్ణయాన్నే అమలు చేస్తే గనుక.. పార్టీకి ఆత్మహత్యా సదృశం అవుతుందని పలువురు పార్టీ నాయకులే ఆగ్రహంగా ఉన్నారు.
ఎన్నికకు దూరంగా ఉండాలని జగన్ నిర్ణయం!
Saturday, November 23, 2024