మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్లీ ఓసారి ఎక్స్ వేదికపై తన అస్తిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఆయన ఇసుక విలాపాలే కామెడీగా ప్రజలకు కనిపిస్తున్నాయి. ఇసుకను మొత్తం ఉచితంగా విక్రయిస్తుండగా.. చంద్రబాబునాయుడు ప్రభుత్వం అడ్డగోలుగా దోచుకుంటున్నదని జగన్ చేస్తున్న ఆరోపణలు ప్రజలకు హాస్యాస్పదంగా కనిపిస్తున్నాయి. ప్యాలెస్ కదలకుండా, యలహంక- తాడేపల్లి మద్య టూరింగ్ సర్వీసు నడుపుతూ.. ఎక్స్ లో మాత్రమే నిందలు వేయాలంటే.. వాస్తవాలు ఎలా తెలుస్తాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఇంతకూ జగన్ విలాపం ఏంటంటే.. తమ ప్రభుత్వ హయాంలో టన్నుకు రూ.375 వంతున నేరుగా ప్రభుత్వ ఖజానాకు వచ్చాయట. ఇప్పుడు ప్రభుత్వంలో ఖజానాకు ఆదాయం రావడం లేదని జగన్ సానుభూతి చూపిస్తున్నారు.
అసలు కొత్త ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా ఇసుక ఇస్తుండగా ప్రభుత్వ ఖజానాకు ఆదాయం వస్తుందని జగన్ ఎలా ఊహిస్తున్నారో అర్థం కావడం లేదు. నిజానికి జగన్ సర్కారు హయాంలో విక్రయాల ద్వారా.. అప్పట్లో ప్రభుత్వ ఖజానాకు సొమ్ము వచ్చి ఉండవచ్చు. కానీ.. వాస్తవంలో ఒక టన్ను ఇసుక విక్రయాలను రికార్డుల్లో చూపితే.. అక్రమంగా కేవలం క్యాష్ లావాదేవీల ద్వారా పదిటన్నుల ఇసుకను విక్రయించేస్తూ విచ్చలవిడి దోపిడీకి పాల్పడ్డారనేది ప్రజలందరికీ తెలుసు.
ఇప్పుడు చంద్రబాబునాయుడు ప్రభుత్వం నేరుగా పంచాయతీలకు మాత్రమే జమ అయ్యే సీనరేజీ చార్జీలను మాత్రం వసూలు చేస్తోంది. రవాణా ఖర్చులు అప్పుడైనా ఇప్పుడైనా కొన్నవారు పెట్టుకోవాల్సిందే. ఈ నేపథ్యంలో.. ఒక ఏడాది తర్వాత.. కొత్త ఇసుక విధానం ద్వారా రాష్ట్రంలో ఎన్ని పంచాయతీలకు ఎన్ని వందల కోట్ల రూపాయలు జమ అయ్యాయో ఎన్డీయే కూటమి సర్కారు లెక్క చెబుతుంది. తమ అయిదేళ్ల పాలనలో ఇసుక విక్రయాల ద్వారా.. ఆయా ప్రాంతాల్లో ఉండే పంచాయతీలకు ఏమాత్రం రుసుము ముట్టిందో జవాబు చెప్పగల ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉన్నదా? అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
ఇసుక పేరుతో ఎడాపెడా దోచుకున్న జగన్.. ఇప్పుడు చంద్రబాబు విధానం వల్ల తన బాగోతం బయటపడి పరువు పోగొట్టుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన కుక్కినపేలు కుదుట్లో ఉన్నట్టుగా సైలెంట్ గా ఉండడం మంచిది. అలా చేయకుండా.. ప్రభుత్వ నిర్ణయాల్ని ఇంకా బద్నాం చేయాలని ఉవ్విళ్లూరితే ఆయనే భ్రష్టుపట్టిపోతారు.