మానవ సంబంధాల విషయంలో ప్రత్యేకించి మాతృమూర్తి విషయంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంత లేకిగా ప్రవర్తించే వ్యక్తి ప్రపంచంలో మరొకరు ఉండరేమో అని ప్రజలు అనుకుంటూ ఉంటారు. అలాగే, రాష్ట్రంలోని ప్రతి బిడ్డకూ తాను మేనమామను అని నంగనాచి కబుర్లు చెప్పే జగన్మోహన్ రెడ్డి తన సొంత చెల్లెలి విషయంలో ఎంతటి దుర్మార్గాలకు ఒడిగట్టారో కూడా అందరికీ తెలుసు. లక్ష కోట్ల రూపాయలకు పైగా సీఎం కాకముందే క్విడ్ ప్రోకోల రూపంలో అవినీతి సొమ్ము కాజేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి.. కుటుంబ ఆస్తుల్లో తల్లికి హక్కుగా, వాటా దక్కవలసిన వాటిలోనూ చాలా కొద్దిగా మూడువేల కోట్ల రూపాయల విలువైన షేర్లు గిఫ్టు కింద ఇచ్చి.. ఇప్పుడు వాటిని కూడా వెనక్కు తీసుకోవడానికి ట్రిబ్యునల్ కు ఎక్కి దావానడపడాన్ని రాష్ట్రప్రజలందరూ కూడా అసహ్యించుకున్నారు. అయితే ఆ కేసు విషయంలో ట్రిబ్యునల్ ఎదుట ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి. ట్రిబ్యునల్ తీర్పును రిజర్వు చేసింది.
2019 ఎన్నికలకు ముందు తాను సీఎం కావడం కోసం ఎన్నికల ప్రచార పర్వంలో అటు తల్లి విజయమ్మను, చెల్లెలు షర్మిలను జగన్ ఏ స్థాయిలో వాడుకున్నారో అందరికీ తెలుసు. అయితే చెల్లెలికి రాజకీయంగా కూడా ఒక స్థానం కల్పించే విషయంలో ఆయనకు మనసొప్పలేదు. రకరకాల సొల్లు సిద్ధాంతాలు చెప్పి.. ఒక కుటుంబంలో ఒక తరంలో ఒకరికే పదవి అనే కబుర్లతో ఆమెతో వైరం పెంచుకున్నారు. అది కాస్తా ఆస్తి తగాదాలరూపానికి మారింది. చెల్లెలికి దక్కవలసిన ఆస్తులకు కూడా కత్తెర వేసి.. ఇంకా కార్యకలాపాలు ప్రారంభించని సరస్వతి పవర్ అనేకంపెనీలో ఉన్న షేర్లను ఆమెకోసం అన్నట్టుగా ఒప్పందం రాసుకుని.. తల్లి విజయమ్మ పేరుతో గిఫ్ట్ డీడ్ చేశారు జగన్.
కానీ ఆతర్వాత వైఎస్ షర్మిల తెలంగాణలో సొంత పార్టీ పెట్టుకుని రాజకీయం చేసినంత కాలం ఆయన మిన్నకున్నారు. అక్కడినుంచి ఆమె ఏపీసీసీ చీఫ్ గా సారథ్యం తీసుకుని.. జగన్ మీద, ఆయన దందాల మీద నిప్పులు కురిపించడం ప్రారంభించాక ఆయన ఆమెకు ద్రోహం తలపెట్టారు. ఆర్థిక వనరుల మీద కొడితే లొంగుతుందని భావించి.. ఆమెకోసం తాను తల్లి పేరిట గిఫ్టు డీడ్ ఇచ్చినది కాస్తా తిరిగి తనకు వెనక్కు కావాలని.. ఆ షేర్ల మీద తల్లికి హక్కులు లేవని ట్రిబ్యునల్ కు వెళ్లారు.
అత్యంత చవకబారు తీరులో.. తల్లిమీద ప్రేమ ఉన్నప్పుడు ఆ గిఫ్ట్ డీడ్ షేర్లు ఇచ్చానని, ఇప్పుడు ఆమె మీద ఆ ప్రేమ లేదని, అందువల్ల షేర్లు వెనక్కివ్వాలని కోర్టులో వాదించారు. అయితే విజయమ్మ కూడా వదలిపెట్టలేదు. వైఎస్ జీవించి ఉండగా కుటుంబానికి ఏర్పడిన ఆస్తులన్నీ జగన్ షర్మిలల పిల్లలు నలుగురికీ సమానంగా చెందుతాయని వాదించారు. అలాగే.. తనకు ఒసారి గిఫ్ట్ డీడ్ ఇచ్చిన తర్వాత ఆ షేర్లను వెనక్కు అడిగే హక్కు జగన్ కు లేదని కూడా ఆమె వాదించారు. జగన్ భారతి ఇద్దరికీ అసలు దావా వేసే అధికారమే లేదని సరస్వతి పవర్ పూర్తిగా తనదని ఆమె వాదించారు.
అమ్మా కొడుకుల మధ్య సంబంధాలు చెడాయి. మొన్నటికి మొన్న ఇడుపులపాయంలో వైఎస్ జయంతి నిర్వహించినప్పుడు కూడా ఇద్దరూ ముక్తసరిగానే వ్యవహరించారు. మొత్తానికి ట్రిబ్యునల్ ఎదుట వాదనలు పూర్తయ్యాయి. తీర్పు త్వరలో రానుంది. జగన్ ఈ ఆస్తుల విషయంలో ఎదురుదెబ్బ తప్పదని న్యాయనిపుణులు అంచనా వేస్తున్నారు.
