జగనన్న విదేశీయాత్ర వచ్చే నెలలోనే?

Thursday, December 26, 2024

‘ఒక్కసారి ఫిక్సయ్యానంటే నా మాట నేనే వినను’ అని ఒక సినిమాలో హీరో డైలాగు ఉంటుంది. పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా తన తీరు అంతే అని చేతల్లో నిరూపించుకుంటున్నారు. ఆయన ఈ నెల 3వ తేదీన యూకే వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఎటూ ఇప్పుడు ముఖ్యమంత్రిగా పదవి కూడా లేదు గనుక.. ఎంచక్కా లండన్ వెళ్లి కూతురు బర్త్ డే సెలబ్రేషన్ లో పాల్గొనాలని అనుకున్నారు. 3 కాకపోతే 4న ప్రయాణం అని నిర్ణయించుకున్నారు. రకరకాల కారణాల వల్ల అది కాస్తా వాయిదా పడేసరికి.. ఇప్పుడు ‘ఠాట్.. తాడేపల్లిలో మాత్రం ఉండబోయేది లేదు’ అంటూ వెళ్లి బెంగుళూరు ప్యాలెస్ లో కూర్చున్నారు. లండన్ వెళ్లేదాకా ఆయన మళ్లీ తాడేపల్లి రాకపోవచ్చునని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా లండన్ యాత్ర ఇప్పుడప్పుడే సాధ్యం కాకపోవచ్చునని, ఇంకా కొంత సమయం పడుతుందని, నెలరోజులు వాయిదా పడినా ఆశ్చర్యం లేదని కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇంతా కలిపి పాపం జగన్మోహన్ రెడ్డి కూతురు పుట్టినరోజుకోసం లండన్ వెళ్లాలని అనుకుంటే.. ఈలోగా పుణ్యకాలం కాస్తా గడచిపోయింది. ఆమె పుట్టినరోజుకూడా అయిపోయింది. పాస్ పోర్టు సమస్యల వల్ల జగన్ ఆగ్రహించారు. ముఖ్యమంత్రిగా వెలగబెట్టిన కాలం నాటి డిప్లమాట్ పాస్ పోర్టు రద్దయ్యాక.. ఒక్క సంవత్సరం పాస్ పోర్టుకు మాత్రమే విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు అనుమతిచ్చింది. జగన్ తనకు అయిదేళ్ల పాస్ పోర్టు కావాల్సిందేనంటూ హైకోర్టుకు వెళ్లారు. దానిపై సోమవారం విచారణ జరుగుతుంది.

ఒకవేళ హై కోర్టు అనుమతి ఇచ్చినాసరే.. పాస్ పోర్టు జారీ కావడానికి ఒకటిరెండు రోజులు పట్టు. ఎటూ కూతురు బర్త్ డే కూడా అయిపోయింది. సెప్టెంబరు 25వ తేదీ వరకు విదేశాల్లో పర్యటించడానికి మాత్రమే ఆయనకు సీబీఐ కోర్టు అనుమతి ఉంది. అంటే కనీసం రెండు వారాల పర్యటనకు కూడా వ్యవధి ఉండదన్న మాట. ఈ నేపథ్యంలో జగన్ ప్రస్తుతానికి పూర్తిగా పర్యటన రద్దు చేసుకుని, వచ్చే నెలలో మళ్లీ ప్లాన్ చేసుకోవాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. అంటే మళ్లీ ఆయన సీబీఐ కోర్టును అనుమతి కోసం ఆశ్రయించాల్సి వస్తుంది.  సీబీఐ మళ్లీ అభ్యంతరాలు చెబుతుంది. ఇప్పుడంటే కూతురు బర్త్ డే అన్నారు గనుక.. అనుమతి లభించింది. ఇంకోసారి అనుమతికోసం వెళితే కోర్టు ఓకే అంటుందో లేదో అని కూడా కొన్ని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles