జగన్మోహన్ రెడ్డి అంటే దేవుడిగా భావించే వారు ఉండరని చెప్పలేము. బయటివారు ఎలా భావించినా.. భావించకపోయినా.. జగన్ మాత్రం తన గురించి తాను అలాగే భావించుకుంటారేమో అనిపిస్తుంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కూడా.. “జగన్ తనను తను దేవుడిలా, రాజులా, ప్రజలకు కావాల్సిన అన్నీ అందించేసే ప్రొవైడర్ లాగా భావించుకుంటారని” విశ్లేషించారు. అలాంటి జగన్ తో భేటీ కావడం చిన్న విషయం కాదు కదా! ఆయనతో భేటీ ఎంత కష్టమో ఆయన ముఖ్యమంత్రిగా ఏలుబడి సాగించిన కాలంలో ఎమ్మెల్యే లను, ఎంపీలను అడిగితే తెలుస్తుంది. కేవలం అపాయింట్మెంట్ దొరకడం లేదని అలిగి కొందరు ఏకంగా పార్టీని వీడిపోయారు. అయితే ఇప్పుడు పార్టీలోని కొందరు నాయకులకు కేవలం అపాయింట్మెంట్ మాత్రమే కాదు. కుటుంబ సమేతంగా ఫోటోలు దిగే భాగ్యం కూడా దక్కింది. ఇది గోల్డెన్ ఛాన్స్ కాక మరేమిటి అని పార్టీలో అనుకుంటున్నారు. ఇంతకూ ఆ ఛాన్స్ కొట్టేసిన భాగ్యశీలురు ఎవరబ్బా అనుకుంటున్నారా?
ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. విశాఖ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరగబోతుండగా అక్కడి ప్రజాప్రతినిధులను కాపాడుకోవడం వైసీపీకి తలకు మించిన భారం అవుతోంది. మెజారిటీ అధికార ఎన్డీయే కూటమిలోకి ఫిరాయిస్తారనే భయం ఉంది. అందుకే క్యాంప్ రాజకీయాలు నడుపుతున్నారు.
బెంగళూరులో క్యాంప్ నిర్వహించడానికి.. వారిని తరలిస్తుండగా.. మధ్యలో తాడేపల్లి లో బ్రేక్ జర్నీ ఇచ్చారు. ఎక్కువ రోజులకు ప్రిపేర్ అయి రావాలని నేతలు అనడంతో.. నేతలు కుటుంబాల సహా వచ్చారు.
తాడేపల్లి లో వీరితో భేటీ అయిన జగన్.. ప్రలోభాలకు లొంగవద్దని, పార్టీని వీడవద్దని ఉపదేశం చేశారు. తమాషా ఏమిటంటే.. వారందరినీ ఒక్కొక్కరుగా పిలిచి, క్షేమ సమాచారాలు విచారించి ఫ్యామిలీతో ఫోటోలు దిగారు. ఆ రకంగా తాను వారికి గోల్డెన్ ఛాన్స్ ఇచ్చిన బిల్డప్ చూపించారు. తమ ఓట్లు అవసరం ఉన్నంత కాలం జగన్ తమమీద ఇంతకంటే గొప్ప ప్రేమానురాగాలు చూపిస్తారని వారు అనుకుంటుండడం విశేషం.