అతి సర్వత్ర వర్జయేత్ అంటారు పెద్దలు. ‘ఐ వాంట్ దిస్ అతి’ అంటారు వేణుమాధవ్ లాంటి కమెడియన్లు కొందరు. కానీ.. చెల్లెలితో వచ్చిన తగాదాను పునాదిగా చేసుకుని తనను ప్రసన్నం చేసుకోవడానికి తన అనుచరులు, పార్టీ నాయకులు లెక్కకు మిక్కిలిగా పెడుతున్న ప్రెస్ మీట్లను, ప్రతిరోజూ పదుల సంఖ్యలో నాయకులు మీడియా ముందుకు వచ్చి షర్మిలను తిట్టిపోస్తూ.. తనను కీర్తిస్తూ సాగిస్తున్న ప్రచారంతో జగన్ కు వెగటు పుట్టినట్టుగా కనిపిస్తోంది. లేదా, తన పార్టీ తరఫున ఇంత మంది మాట్లాడుతుండగా.. షర్మిల ఒంటరిగా అందరినీ ఎదుర్కొంటుండడం చూసి ఆయనకు కంగారు పుట్టినట్టుంది. అందుకే హఠాత్తుగా ప్రజా సమస్యల ముసుగు వేసి.. ఇతర అంశాల మీదికి తన పార్టీ నాయకులు డైవర్ట్ కారాదని.. కేవలం ప్రజలు ఎజెండాగా పోరాటాలు సాగాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమవారికి పిలుపు ఇస్తోంది.
కుటుంబ ఆస్తుల తగాదా వంటి అనేక వ్యవహారాలు ప్రస్తుతం న్యాయస్థానంలో ఉన్నందున.. ఇకపై ఎవరి వాదనలు ఏవైనా సరే.. కోర్టులోనే చేసుకోవాలని పార్టీ నిర్ణయించింది. ఈ ప్రెస్ మీట్ లకు, షర్మిలను నిందించే ధోరణికి ఇక ముగింపు పలకాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ నిర్ణయించింది. ప్రజల కష్టనష్టాల్లో వారికి తోడుగా ఉండాలని పార్టీ నాయకులకు పిలుపు ఇచ్చింది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి హఠాత్తుగా ప్రజలు గుర్తుకొచ్చారేమిటి చెప్మా అని పలువురు ఇప్పుడు విస్తుపోతున్నారు. ఎన్నికలలో ఓడిపోయిన నాటినుంచి జగన్మోహన్ రెడ్డికి తన సొంత గోడు తప్ప.. ప్రజల గోడు పట్టనే లేదు. తనకు ప్రతిపక్ష నాయకుడిగా కేబినెట్ హోదా కావాలని, తనకు ముఖ్యమంత్రి స్థాయికి మించిన భద్రత సౌకర్యాలు కల్పించాలని, అన్నీ తన సొంతగోడుల గురించి మాత్రమే ఆయన పోరాడుతూ వచ్చారు. ప్రజల సమస్యలను ఇప్పటిదాకా పట్టించుకోలేదు. మహా అయితే ఎక్కడైనా శవం లేస్తే అక్కడ వాలిపోవడం మాత్రం చేస్తూ వచ్చారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవనే నిందలు వేస్తూ వచ్చారు. ఇలాంటి నేపథ్యంలో.. ఆస్తుల గొడవ తెరపైకి వచ్చింది.
జగన్ భక్తులందరూ షర్మిలను ఇష్టారాజ్యంగా తిడుతున్నారు. కానీ.. వివేకా హత్య కేసు విషయంలో షర్మిల ఆరోపణల తర్వాత జగన్ ఇలాగే తిట్టించారు గానీ.. దాని వలన ఫలితం దక్కలేదని ఆయనకు తెలుసు. అందుకే చెల్లెలి మీద తిట్లను కంట్రోల్ చేసినట్టు సమాచారం. అసలు ఈ వివాదం గురించి పార్టీ నాయకులు ఎవరూ మాట్లాడకుండా ఉండాలని పార్టీ గైడ్ లైన్స్ జారీచేసింది. ఈ వివాదం గురించి ఒక్కమాట ఎక్స్ ట్రాగా మాట్లాడినా అడ్డంగా దొరికిపోతాం అని జగన్ భయపడుడుతన్నారని.. అందుకే ఈ ఆదేశాలు వచ్చాయని అంటున్నారు. తన అనుచరులు తనను ఎంతగా భజన చేస్తున్నారంటే.. మామూలుగా పొగడ్తలను అతిగా ఇష్టపడే జగన్మోహన్ రెడ్డికి.. ఆ పొగడ్తలు చాలా వెగటుగా అనిపించాయని, మరింత పరువు పోతుందనే భయంతో వాటికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
అనుచరుల భజనకు కంగారుపడుతున్న జగనన్న!
Wednesday, December 25, 2024