‘ఆపరేషన్ కాదంబరి’ వెనుక సజ్జల కాదు జగనన్నే!

Wednesday, September 18, 2024

ముంబాయికి చెందిన సినీనటి కాదంబరి జత్వానీ ని ఏపీ పోలీసులు కుటుంబం సహా నిర్బంధించడం, కేసులు పెట్టి జైల్లో వేయడం, వేధించడం తదితర వ్యవహారాలకు సంబంధించి ఇప్పుడు కొత్త అనుమానాలు పుట్టుకు వస్తున్నాయి. కాదంబరి ప్రస్తుతం ఏపీ పోలీసుల్ని ఆశ్రయించి తనకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్న సంగతి తెలిసిందే. విచారణ కూడా ఆల్రెడీ మొదలైంది. ఈ వ్యవహారంలో పాత్రధారులైన కొందరు పోలీసు ఉన్నతాధికారులకు నోటీసులు కూడా జారీ కానున్నాయి. అయితే పాత్రధారులు పోలీసు పెద్దలే అయినప్పటికీ.. వారిని తెర వెనుక నుంచి నడిపించినది సకల శాఖ మంత్రిగా గత ప్రభుత్వ హాయంలో పేరు తెచ్చుకున్న సజ్జల రామక్రిష్ణారెడ్డి కాగా.. ఆయనను మించి.. అసలు కీలక సూత్రధారి పాత్ర సాక్షాత్తూ అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోషించారా? అనే అనుమానాలు ఇప్పుడు పుడుతున్నాయి. ఆయన సొంత చెల్లెలు వైఎస్ షర్మిల చేస్తున్న  ఆరోపణలు, అందుకు మద్దతుగా ఆమె ఆధారాలుగా చెబుతున్న కొన్ని సంగతులు ఇలాంటి అనుమానాలను నమ్మేలా చేస్తున్నాయి. 

కాందబరి జత్వానీ తో క్రిష్ణా జిల్లాకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు కుక్కల విద్యాసాగర్ వివాహేతర సంబంధం వ్యవహారం  ఈ మొత్తం ఎపిసోడ్ లో కేవలం ఒక చిన్న ఎలిమెంట్ లో మాత్రమేనని ప్రజలు అనుకుంటున్నారు. కాదంబరిని ఆ స్థాయిలో వేధించడం, ఐపీఎస్ లను కూడా పురమాయించి ముంబాయికి ప్రత్యేక పోలీసు బృందాన్ని పంపి కనీసం ట్రాన్సిట్ వారంటు కూడా లేకుండా ఆమె కుటుంబాన్ని నిర్బంధించి తీసుకురావడం ఇవన్నీ జగన్ స్వయంగా జోక్యం చేసుకోకుంటే జరిగేవి కాదనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇంత గ్రాండ్ గా వేధింపుల పర్వాన్ని నడిపించినది సజ్జన్ జిందాల్ కళ్లలో ఆనందం కోసమేనేమో అనే అనుమానం ప్రజలకు కలుగుతోంది.

కాదంబరి జత్వానీ గతంలో సజ్జన్ జిందాల్ మీద కూడా అత్యాచారం కేసు పెట్టింది. ఆ కేసు నుంచి జిందాల్ ను తప్పించేందుకు జగన్ స్వయంగా పూనుకున్నట్టుగా షర్మిల ఆరోపిస్తున్నారు. తాడేపల్లి ప్యాలెస్ లో జగన్, సజ్జన్ జిందాల్ పదేపదే కలుసుకోవడం చూసి స్టీల్ ఫ్యాక్టరీ పనులు వేగవంతం చేస్తున్నారని అనుకున్నాం గానీ.. కాదంబరిని వేధించడానికి అనుకోలేదని షర్మిల ఆరోపిస్తున్నారు. ఆడదాన్ని ఒక్కదాన్ని చేసి తొక్కాలని.. జే అండ్ జే ఇద్దరూ కలసి బుర్రలు పెట్టి చేసిన మాస్టర్ ప్లాన్ ఇదని షర్మిల ఆరోపిస్తున్నారు. జిందాల్ కోసం జగన్ ఇంతగా దిగజారారని షర్మిల నిందిస్తున్నారు. ఆమె చెబుతున్న విషయాలు గమనిస్తే.. ‘ఆపరేషన్ కాదంబరి’ వెనుక కేవలం సజ్జల మాత్రమే కాదు.. అసలు సూత్రధారి జగన్మోహన్ రెడ్డి అని అర్థమవుతుందని ప్రజలు అనుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles