జగన్ సలహాదారులు మరోసారి ఆయన పరువు తీయడానికి సిద్ధం అవుతున్నారా? బిడ్డ చచ్చినా పురిటివాసన పోలేదన్నట్టుగా.. జగన్మోహన్ రెడ్డి పార్టీ 11 సీట్లతో పతనం అయిపోయినా సరే.. ఆ పతనానికి ప్రధాన కారకులైన సలహాదారులు మాత్రం జగన్ ను వదలిపోవడం లేదు. తన అజ్ఞానం కొద్దీ సలహాదారుల మేధస్సు మీద ఆధారపడుతున్న జగన్మోహన్ రెడ్డి.. మరింతగా పరువుపోగొట్టుకునే ఆలోచనలు చేస్తున్నట్టుగా పార్టీ వర్గాల ద్వారా విశ్వసనీయంగా తెలుస్తోంది. గెలిచింది కేవలం 11 సీట్లు మాత్రమే అయినప్పటికీ.. తనకు ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే సభాపతికి అయ్యన్నపాత్రుడికి లేఖ రాసిన జగన్మోహన్ రెడ్డి.. తాజాగా మరో అడ్డగోలు ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం కోర్టును ఆశ్రయించాలని అనుకుంటున్నట్టు సమాచారం.
చట్టసభల్లో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కాలంటే మొత్తం సీట్లలో ఆ పార్టీకి కనీసం పదిశాతం సీట్లు దక్కి ఉండాలి. అలాగే సభలో రెండో అతిపెద్ద పార్టీగా ఉండాలి. జగన్ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ ఇప్పుడు ఏపీ శాసనసభలో రెండో అతిపెద్ద పార్టీ అనడంలో సందేహం లేదు. కానీ వారికి దక్కింది కేవలం 6.2 శాతం సీట్లు మాత్రమే. ప్రతిపక్ష హోదా అనేది కలలో మాట. జగన్ కేవలం సాధారణ ఎమ్మెల్యే మాత్రమే.
అయినప్పటికీ కూడా.. చంద్రబాబునాయుడు జగన్ కు కాస్త ఆయన అర్హతకు మించిన గౌరవాన్ని ఇవ్వాలనుకున్నారు. ప్రతిపక్ష నాయకుడిలాగా మంత్రుల తర్వాత ఆయనతో ప్రమాణం చేయించారు. ఎమ్మెల్యేల లిస్టులో ఎక్కడో మధ్యలో ఉండాల్సిన ఆయనకు ఆ గౌరవం ఇచ్చారు. అయినా సరే.. జగన్ ప్రగల్భాలు తగ్గలేదు. ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలంటే పది శాతం సీట్లు దక్కాలని నిబంధనల్లో ఎక్కడా లేదని, తనను మంత్రుల తర్వాత ప్రమాణం చేయించి అవమానించారని ఆయన అంటున్నారు. తనకు ప్రతిపక్షహోదా ఇవ్వాలని లేఖ రాశారు. ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు. కానీ దానికి కౌంటరుగా జగన్ చెప్పిన ఎగ్జాంపుల్స్ లో ఉన్నవారంతా కేవలం ఫ్లోర్ లీడర్లే తప్ప ప్రతిపక్ష హోదా లేదని పయ్యావుల కేశవ్ రికార్డుల ఆధారంగా చెప్పారు కూడా.
అయినా సరే దూకుడు తగ్గని జగన్మోహన్ రెడ్డి ఒకటిరెండు రోజులు వేచిచూసి.. అయ్యన్నపాత్రుడి ద్వారా ప్రతిపక్ష హోదా దక్కకపోతే గనుక.. హైకోర్టులో దావా వేయాలని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. పార్టీలో కొందరు సీనియర్లు వద్దంటున్నప్పటికీ.. కేసు వేయడం ద్వారా.. తనకు హోదా ఇవ్వకుండా ప్రభుత్వం అవమానిస్తోందనే సంగతిని ప్రజల ఎదుట మరింతగా రచ్చ రచ్చ చేయాలని అనుకుంటున్నారట. కేసు వేస్తే మరోసారి పరువు దిగజారడం తప్ప దక్కేదేం ఉండదని పార్టీ వర్గాలే అంటున్నాయి.
ప్రతిపక్ష హోదా కోసం కోర్టుకు వెళ్లనున్న జగన్!
Wednesday, December 25, 2024