ఉచిత ఇసుక, లిక్కర్ ధరల తగ్గింపు, నూతన లిక్కర్ పాలసీ అంటే ఏమిటో జగన్మోహన్ రెడ్డికి అర్థం కాలేదు. లేదా, తాను తన జమానాలో అడ్డంగా దోపిడీకి వాడుకున్న వ్యాపారాలను చంద్రబాబునాయుడు ప్రజలకు అనుకూలంగా, పారదర్శకంగా మార్చేయడం అనేది ఆయనకు కంటగింపుగా ఉంది. ఈ మోడల్స్ ప్రజల్లో క్లిక్ అయితే.. ఈ ఇసుక పాలసీ, ఈ లిక్కర్ పాలసీ అనేవే ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నాయని వారు గుర్తిస్తే తన పార్టీకి ఎప్పటికీ పుట్టగతులు ఉండవని ఆయన భయపడుతున్నట్టుగా కనిపిస్తోంది. అందుకే.. చాలా వ్యూహాత్మకంగా.. ఇప్పటినుంచే ఆ రెండు వ్యాపారాల్లో అనల్పమైన దోపిడీ జరుగుతున్నట్టుగా ఆయన రంగు పులుముతున్నారు.
ఇసుక విషయంలో జగన్మోహన్ రెడ్డి ఆవేదన ఏంటంటే.. నా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వానికి కొంత డబ్బు వచ్చేది… ఇప్పుడు ప్రభుత్వానికి డబ్బు రావడం లేదు, కానీ ధర రెండింతలు మూడింతలు అయింది అంటున్నారు. కానీ జగన్ పాలనలోని ధర కంటె రెండింతలు ధరకు ఏ ఊర్లో ఏ రీచ్ దగ్గర అమ్ముతున్నారో జగన్ ఒక్క ఉదాహరణ అయినా చెప్పగల స్థితిలో ఉన్నారా? అనేది సందేహమే. అప్పట్లో విక్రయాలన్నీ అరాచకంగా సాగేవి. పది ట్రక్కుల ఇసుక అమ్మినట్టుగా రికార్డుల్లో ఉంటే.. అదనంగా మరో 20-30 ట్రక్కుల ఇసుక అమ్ముడైపోయి ఉండేది. అమ్మకం అనే ఆ ముసుగులో వచ్చినదంతా వైఎష్సార్ కాంగ్రెస్ నాయకుల జేబుల్లోకి చేరేది. పది ట్రక్కుల సొమ్ము మాత్రమే ప్రభుత్వ ఖజానాకు చేరేది. ఇప్పుడు అలాంటివేం లేవు. కేవలం తవ్వకానికి అయిన ఖర్చులు, పంచాయతీకి చెల్లించాల్సిన రుసుములు మాత్రమే ఇసుక కొనే వినియోగదారుడు భరించాల్సి ఉంటుంది. ఈ విధానం జగన్ కు అర్థం కావడం లేదు.
అలాగే లిక్కర్ విషయంలో కూడా అదే సంగతి. ఏ చీప్ లిక్కర్ క్వార్టర్ బాటిల్లను జగన్ రెడ్డి దాదాపు 200 రూపాయలకు అమ్మారో.. ప్రస్తుత ప్రభుత్వంలో అదే చీప్ లిక్కర్ ధరలను రూ.99కి తీసుకువచ్చారు. కేవలం విదేశీబ్రాండ్ల లిక్కరు ధరలను మాత్రం ఎమ్మార్పీ ని మించి.. ఆ తరువాతి పదిరూపాయల ధర వరకు సవరించేలా నిర్ణయించారు. లిక్కరు ధరలు పెంచేశారు బాబోయ్ అంటూ ఇప్పుడు జగన్ రచ్చ చేస్తున్నదంతా.. ఆ విదేశీ లిక్కరు సీసాలపై పెంచిన పదిరూపాయల గురించి మాత్రమే. జగన్ కొత్త లిక్కరు విధానం అర్థంకాని అజ్ఞానంలో మాట్లాడుతున్నారో.. లేదా, ఈ విధానాలు ప్రజాదరణ పొందితే తన పార్టీకి పుట్టగతులు ఉండవనే భయంతో మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి.
మొత్తానికి ఆయన తన చంద్రబాబు సర్కారు తీసుకువచ్చిన కొత్త విధానాల్లో తనకు అర్థం కాని అజ్ఞానాన్నంతా ప్రజల మీద రుద్దాలని తపన పడిపోతున్నట్టుగా కనిపిస్తోంది.
తన అజ్ఞానం జనం మీద రుద్దాలనుకుంటున్న జగన్!
Monday, November 18, 2024