సామదాన భేద దండోపాయాలు అని కార్యం నెరవేర్చుకోవడానికి కొన్ని మార్గాలను మనకు పెద్దలు నిర్దేశించారు. ఒక పని విషయంలో స్టార్టింగులోనే తీవ్రమైన నిర్ణయానికి వెళ్లకుండా ఒకదాని తర్వాత ఒకటి ఆ మార్గాలను అనుసరిస్తే బెటర్ గా ఉంటుందనేది పెద్దల సూచన. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలా అంచెల వారీగా మార్గాలను అన్వేషిస్తున్నారు. తల్లి విజయమ్మ కూడా ఒక బహిరంగ లేఖ ద్వారా మీడియా ముందుకు వచ్చి.. తన తప్పును ఎత్తిచూపుతుందనేది జగన్ కు అనూహ్యమైన పరిణామం. అలా జరిగేసరికి ఆయన తట్టుకోలేకపోతున్నారు. పార్టీ వారితో ఒకవైపు తల్లి మీద కూడా నిందలు వేయిస్తున్నారు. అలాగే దానికి సమాంతరంగా.. తన బంధువర్గాన్ని కూడా తల్లి మీదకు ప్రయోగించేందుకు మంతనాలు చేస్తున్నారు.
బెంగుళూరు యలహంక ప్యాలెస్ లో కొన్నాళ్లు గడిపి అక్కడినుంచి తన సొంత నియోజకవర్గం పులివెందులకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి. సరిగ్గా అప్పుడే విజయమ్మ పేల్చిన లెటర్ బాంబు పడింది. ఏపీలో అది పెద్ద విస్ఫోటనం అని చెప్పాలి. ఏ వైఎస్ఆర్ ఆస్తుల గురించి ఆయన కొడుకు, కూతురు ఇద్దరూ అత్యంత దారుణంగా కొట్టుకుంటూ ఉన్నారో.. అదే వైఎస్ఆర్ సతీమణి ఆ ఆస్తులు ఎవరివో ధ్రువీకరించి చెప్పగలిగిన ఏకైక వ్యక్తి. ఆమె స్వయంగా అన్నీ కుటుంబ ఆస్తులేనని, అన్నింటినీ నలుగురు మనవలకు సమానంగా పంచడమే వైఎస్ఆర్ ఆజ్ఞఅని వెల్లడించారు. అమ్మ మాటతో జగన్ పరువు గంగలో కలిసిపోయింది.
తల్లిని బుజ్జగించి, దువ్వి తనకు అనుకూలంగా మార్చుకోవడం తప్ప జగన్ ఎదుట వేరే మార్గాలు లేవు. ట్రిబ్యునల్ లో గిఫ్ట్ డీడ్ రద్దుకు సంబంధించిన విచారణ జరిగినప్పుడు.. విజయమ్మ ఇలాగే వాదిస్తే గనుక.. కేసు కొత్త మలుపులు తీసుకుంటుంది. ఆస్తుల సంగతి దేవుడెరుగు.. రాజకీయంగా ఇమేజి దారుణంగా తయారవుతుంది. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డిలో చెలరేగుతున్న భయాలు! అందుకే ఆయన బంధువుల ద్వారా తల్లిని బుజ్జగించడానికి ప్రయత్నిస్తున్నట్టు పులివెందుల పరిణామాలు తెలియజేస్తున్నాయి.
ముఖ్యమంత్రిగా ఉండగా అయిదేళ్లలో ఎన్నిసార్లు పులివెందులకు వెళ్లినప్పటికీ.. ఒక్కసారి కూడా బంధువల్లో ఒక్కరి ఇళ్లకు కూడా వెళ్లిన ఆనవాళ్లు లేని జగన్మోహన్ రెడ్డి.. ఈ పర్యటనలో అందరి ఇళ్లకు వ్యక్తిగతంగా వెళుతూ, కుశలం వాకబు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. బంధువుల ద్వారా విజయమ్మతో మాట్లాడించడానికి ఆయన ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. పార్టీలో తన మాటను శాసనంగా పాటించే వారు ఎందరున్నప్పటికీ.. వారికి విజయమ్మ వద్దకు రాజీ చర్చలకు వెళ్లేంత సీన్ లేదని ఆయన నమ్ముతున్నట్టు సమాచారం. ఆస్తుల తగాదాలో తల్లి చేసిన డేమేజీని పూడ్చుకోవడానికి వేరే మందు లేదని, ఆమె మళ్లీ రెచ్చిపోకుండా చూసుకోవాలని ఆరాటపడుతున్నట్టు సమాచారం.
తల్లి మీదకు బంధువుల్ని ప్రయోగిస్తున్న జగన్!
Wednesday, December 25, 2024