టూర్లు చేయడంలో జగన్మోహన్ ఱెడ్డి లక్ష్యం ప్రతిసారీ ఒక్కటే.. వీలైనంత రచ్చ చేయడం. శాంతిభద్రతలు దెబ్బతినేలా విధ్వంసం సృష్టించడం. ఎంత సంయమనంతో వ్యవహరించినా పోలీసులను రెచ్చగొట్టడం.. తన కిరాయి మనుషులతో జేజేలు కొట్టించుకోవడం వంటివి తప్ప వేరొకటి లేదు. రెంటపాళ్ల వెళ్లినా, బంగారుపాళెం వెళ్లినా ఆయన ప్రతిచోటా ఇదే ధోరణి చూపించారు. అయితే తాజాగా ఆయన నెల్లూరులో పర్యటించబోతున్న నేపథ్యంలో ఆయన పన్నాగాలు అక్కడ ఫలించేలా కనిపించడం లేదు. గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో కుదిరినట్టుగా.. జగన్ పరామర్శ యాత్రకు జనసమీకరణ నెల్లూరులో అంత సులువుగా లేదని స్థానిక వర్గాల ద్వారా తెలుస్తోంది.
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాటికి నెల్లూరు జిల్లాలో ఉన్న రాజకీయ చైతన్యం వేరు. ఆయన బలాబలాలు వేరు. 2024 ఎన్నికలు వచ్చేసరికి.. నెల్లూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఒక్కటంటే ఒక్క సీటును కూడా గెలవలేకపోయింది. అలాంటి జిల్లాలో ఎన్నికల తర్వాత.. అధికార ఎన్డీయే కూటమి పార్టీలు మరింతగా బలపడ్డాయి. నిజం చెప్పాలంటే వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి అధికార కూటమిలో ఉండడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సాధారణ కార్యకర్తల బలం కూడా ఘోరంగా పడిపోయింది. అలాంటి నేపథ్యంలో జగన్ నెల్లూరు యాత్ర పెట్టుకున్నారు. నిజానికి ఆయన జులై 3నే నెల్లూరు వెళ్లి ఉండాలి. అప్పట్లో తాడేపల్లి ప్యాలెస్ నుంచి కీలక నాయకుల్ని నెల్లూరుకు పంపి.. స్థానిక నేతలతో కలిసి జనసమీకరణ గురించి పురమాయింపులు చేశారు, టార్గెట్లు అప్పగించారు కూడా. పోలీసుల అనుమతులు కూడా లభించాయి. కానీ.. చివరి నిమిషంలో జగన్ నెల్లూరు పర్యటన రద్దు చేసుకుని బెంగుళూరు వెళ్లిపోయారు. అయితే.. అప్పట్లో జనసమీకరణకు అనుకున్నంత స్పందన లేనందునే జగన్ రద్దు చేసుకున్నట్టు గుసగుసలు వినిపించాయి.
తీరా నెల తర్వాత గురువారం ఆయన నెల్లూరు వెళుతున్నారు. ఇప్పుడు కూడా పరిస్థితిలో ఏమీ మార్పు లేదని తెలుస్తోంది. జనసమీకరణకు కొందరు జిల్లా నాయకులు మొహం చాటేస్తుండగా.. మరికొందరు తమ వల్ల కాదని చేతులెత్తేస్తున్నారు. ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి పరామర్శకు వెళుతున్నారు గనుక.. ఆయన తన బలం చాటుకోవడానికి అంతో ఇంతో జనసమీకరణకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.
కాగా పోలీసులు కూడా ఈదఫా చాలా గట్టిగా హెచ్చరికలు జారీచేశారు. నిబంధనలు ఉల్లంఘించి ఎవ్వరు ప్రవర్తించినా, జనసమీకరణ జరిగినా కేసులు నమోదు చేస్తాం అని హెచ్చరించారు. ప్లకార్డులు ధరించడానికి కూడా వీల్లేదని చెప్పారు. చివరికి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఫ్లెక్సిలు ముద్రించే దుకాణాల యజమానులకు కూడా గట్టిగా చెప్పినట్టు తెలుస్తోంది. జగన్ పర్యటన సందర్భంగా రెచ్చగొట్టే ఎలాంటి కంటెంట్ ఉన్న ఫ్లెక్సిలను గానీ ముద్రించడానికి వీల్లేదని, అలాంటివి కనిపిస్తే.. వాటిని ముద్రించిన వారిపై కూడా కేసులు పెడతామని హెచ్చరించినట్టు తెలుస్తోంది. ఇలాంటి నేపథ్యంలో జనసమీకరణ కూడా అనుకున్నంతగా జరిగే అవకాశంః లేదని అంటున్నారు. ఒకవైపు అనిల్ కుమార్ యాదవ్, కాకాణి కీలక అనుచరులు మాత్రం ఎంతైనా ఖర్చు పెడతాం.. జనసమీకరణ ఘనంగా ఉండాల్సిందే.. పోలీసులను షాక్ కు గురిచేయాల్సిందే అని పట్టుదలగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
నెల్లూరుకు జగన్ : ఆశించినంత రచ్చ కష్టమే!
Friday, December 5, 2025
