ఒక్కసారి ప్రజలు పరిపాలించే అవకాశం ఇస్తే అహంకారంతో దుర్మార్గమైన పరిపాలన సాగించబట్టే.. జగన్మోహన్ రెడ్డి కేవలం 11 మంది ఎమ్మెల్యే పార్టీకి నాయకుడిగా ఇవాళ రెండు ప్యాలెస్ లకు పరిమితమై రోజులు గడుపుతున్నారు. ఆయన పార్టీని నిర్వహిస్తున్న తీరుచూసి.. పార్టీలోనే అనేకమంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు ఇప్పటికే పార్టీని వీడి వెళ్లిపోయారు. సిటింగ్ ఎంపీలు, సిటింగ్ ఎమ్మెల్సీలు కూడా తమ పదవులకు రాజీనామా చేసేసి మరీ.. పార్టీని వీడి బయటకు వెళుతున్నారు. జగన్ నిర్వహణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరిగి బతికి బట్టకడుతుందనే నమ్మకం వారిలో ఎవ్వరికీ కలగడం లేదు. ఇలాంటి సమయంలో సరైన పోరాట పటిమ ఉన్న నాయకుడు వ్యవహరించే తీరు, తీసుకునే నిర్ణయాలు ఎలా ఉండాలి? ఆశలు సన్నగిల్లుతున్న పార్టీ కేడర్ లో స్ఫూర్తిని నింపేలా ఉండాలి. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పునర్నిర్మాణం పేరుతో తీసుకుంటున్న నిర్ణయాలు.. కేవలం ఆయన భజన పరులకు మాత్రమే పెద్దపీట వేస్తూ.. కార్యకర్తల్లోనే నవ్వులపాలు అయ్యేలా ఉన్నాయి.
జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యొక్క పొలిటికల్ అడ్వయిజరీ కమిటీని పునర్ వ్యవస్థీకరిస్తూ శనివారం నాడు జాబితాను ప్రకటించారు. జగన్ అధికారంలో ఉన్న రోజుల్లో ఆయన ప్యాలెస్ కు పరిమితమై కూర్చోగా.. డీఫ్యాక్టో ముఖ్యమంత్రిగా, సకల శాఖల మంత్రిగా వ్యవహరించిన సజ్జల రామక్రిష్ణారెడ్డి ఈ కమిటీకి సారథి. పార్టీనుంచి వెళ్లిపోయిన అనేక మంది సీనియర్ నాయకులు కూడా.. పార్టీ భ్రష్టు పట్టిపోవడానికి ప్రధాన కారణం సజ్జలనే అని తీవ్రమైన విమర్శలు చేసి వెళ్లగా.. జగన్ మాత్రం.. ఇంకా తన జుట్టు ఆయన చేతిలోనే ఉన్నది.. ఆయన లేకుండా తాను లేను అనే సంకేతాలు పార్టీ కేడర్ కు పంపేలా.. ఆయన సారథ్యంలోనే అడ్వయిజరీ కమిటీని ఏర్పాటు చేయడం విశేషం.
ఈ కమిటీలో పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు. అలాగే 33 మంది కమిటీ సభ్యులను కూడా ప్రకటించారు.
తమాషా ఏంటంటే.. ఈ సలహా మండలిలో.. నికార్సయిన సలహా జగన్ కు చెప్పగల వారు ఒక్కరైనా లేరు.. అనే అభిప్రాయం పార్టీ నాయకుల్లోనే వ్యక్తం అవుతోంది. సలహామండలి అంటే ఎలా ఉండాలంటే.. ఒకవేళ తనకు సరైన అవగాహన లేకపోవడం వల్ల గానీ, తనకు తప్పుడు సమాచారం అందడం వల్ల గానీ.. పార్టీ అధినేత ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటే.. దానిని గుర్తించి, ధైర్యంగా ఆయనకు చెప్పి, దిద్దగల వారుండాలి. ఆ ఆలోచనలోని లోపాన్ని ఆయనకు తెలియజెప్పాలి. ఆ తెగువ లేకుండా జగన్ ఏం చెబితే దానికి డూడూబవన్నల్లాగా తలలు ఊపుతూ, ఆయనకు భజేనచేసే తరహా వారిని మాత్రమే ఈ కమిటీలోకి తీసుకున్నారనే పలువురు అంటున్నారు.
ఏదో పార్టీకి చాలా మంది నాయకులు అవైలబుల్ గా ఉన్నట్టుగా 33 మందితో జాబితా ప్రకటించారు గానీ.. వీరిలో సగానికి పైగా చాలా కాలంగా సైలెంట్ గా ఉంటున్నవారే. పార్టీ ఎలాంటి క్లిష్టపరిస్థితుల్లో ఉన్న సమయాల్లో కూడా పెదవివిప్పని వారే! మొత్తంగా అయితే జగన్ ఒక భజనమండలిని తయారుచేసి.. దానికి రాజకీయ సలహామండలి అని పేరు పెట్టారని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. కులాల తూకం చూసుకున్నారు తప్ప.. ఈ కమిటీలో నాయకుల సామర్థ్య తూకం చూసుకోలేదని అనుకుంటున్నారు. ముద్రగడ పద్మనాభరెడ్డి, కొడాలి నాని, జోగి రమేష్, విడదల రజని, అనిల్ కుమార్ యాదవ్, ఆర్కే రోజా, అవినాష్ రెడ్డి, సాకే శైలాజానాధ్ వంటి పేర్లు గమనిస్తే ఎవరికైనా ఇదే అభిప్రాయం కలుగుతోంది.
జగన్.. సలహాల కమిటీ మొత్తం భజనపరులే
Friday, April 18, 2025
