రెండు తెలుగు రాష్ట్రాలను కూడా వరదలు తీవ్రంగా అతలాకుతలం చేసిన నేపథ్యంలో ప్రభుత్వాలు తాము చేయదగిన పని చేస్తూనే ఉన్నాయి. నాయకులు, వివిధ రంగాల ప్రముఖులు, సంపన్నులు అందరూ సహాయక చర్యల కోసం ఉదారంగా స్పందిస్తూ ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమే వరద బాధితులను ఆదుకోవడానికి కోటిరూపాయల విరాళం ప్రకటించారు. అయితే తమాషా ఏంటంటే.. ఆయన కేవలం ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే సాయం ప్రకటించారు. తెలంగాణకు కించిత్ సాయం కూడా ప్రకటించలేదు. తనకు ఓటర్లుగా ఉపయోగపడగల ఏపీ ప్రజల మీద మాత్రమే జగన్ ప్రేమ కురిపిస్తారని, తెలంగాణ ప్రజలకు వచ్చిన కష్టం ఆయనకు కనిపించదని, వాళ్లు ‘తన ఓటర్లు’ కాదు గనుక పట్టించుకోరు అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వరదల నేపథ్యంలో విరాళాలు ప్రకటిస్తున్న పెద్దవాళ్లు అందరూ కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు సమానంగా తమ సాయం ప్రకటిస్తున్నారు. సినీప్రముఖుల్లో చిరంజీవి, బాలకృష్ణ, మహేష్ బాబు, ఎన్టీఆర్ తదితరులందరూ రెండు రాష్ట్రాలకే చెరి యాభై లక్షలుగా కోటిరూపాలు వంతున ఇచ్చారు. ఈనాడు దినపత్రిక రామోజీ ఫౌండేషన్ తరఫున 5 కోట్ల రూపాయల భారీ విరాళం ప్రకటించింది. ప్రజలనుంచి ఫండ్ రైజింగ్ ప్రారంభించింది. నిర్ణీత గడువు వరకు ఈనాడు దినపత్రిక ద్వారా విరాళాలు సేకరించిన తరువాత.. ఆ సొమ్ముతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వారు నిర్మాణాత్మక పనులు చేపడతారు. ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన మంత్రిత్వ శాఖ పరిధిలోని నష్టపోయిన 400 పంచాయతీలకు తలా లక్ష రూపాయల వంతున నేరుగా ఆయా పంచాయతీల అకౌంట్లలో వేసేలా 4కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు. దానితో పాటు రెండు రాష్ట్రాలకు కోటి వంతున ఇచ్చారు. మొత్తం ఆరుకోట్ల రూపాయలు ఇచ్చారు. అందరూ ఇలా రెండు రాష్ట్రాల పట్ల సమానంగా స్పందిస్తూ ఉండగా.. జగన్మోహన్ రెడ్డి మాత్రం కేవలం ఏపీ ప్రజలకు మాత్రం కోటిరూపాయల విరాళం ప్రకటించడం సర్వత్రా విమర్శల పాలవుతోంది.
జగన్మోహన్ రెడ్డికి ఓటర్లు మాత్రమే మనుషులుగా కనిపిస్తారని, ఓటర్లు కానివారికి ఆయన దృష్టిలో ఏ విలువా ఉండదని, వారికి ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన పట్టించుకోరు అని విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ ప్రజలకు కనీస సాయం కూడా చేయకపోవడంలోనే ఆయన సంకుచితత్వం బయటపడుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.