‘‘నా ఎస్సీ.. నా ఎస్టీ.. నా బీసీ.. నా అవ్వతాతలు.. నా అక్క చెల్లెమ్మలు..’’ ఇలా ‘నా.. నా.. నా..’ అంటూ మైకు దొరికితే చాలు జనం ముందు రెచ్చిపోయి మాట్లాడి తన జేబులో డబ్బు ప్రజలకు పంచి పెడుతున్న స్థాయిలో- సంక్షేమ పథకాల గురించి మాయా ప్రచారం చేసుకున్న జగన్మోహన్ రెడ్డిని ప్రజలు చాలా వివేకంతో దారుణంగా ఓడించారు.
అయినా సరే ఆయనలో ఇసుమంతైనా మార్పు వచ్చినట్లుగా కనిపించడం లేదు. ప్రజలను మోసం చేసిన విధంగానే, వారిని మాయ చేసిన విధంగానే.. పార్టీ తరఫున ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థులను కూడా మాయ చేసి మోసం చేయడానికి జగన్ తన శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. 175 స్థానాలు ఉన్న అసెంబ్లీలో కేవలం 11 సీట్లకు దిగజారిపోయిన ప్రస్తుత నేపథ్యంలో ఇక ఆ పార్టీకి భవిష్యత్తు ఉండదు గాక ఉండదు- అనే నమ్మకంతో ఇతర పార్టీల్లోకి తరలి వెళ్లడానికి రంగం సిద్ధం చేసుకుంటున్న అభ్యర్థులను మాయ చేయడానికి జగన్ నానా పాట్లు పడుతున్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ తరఫున ఇటీవల ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులందరితో జగన్ తన క్యాంపు కార్యాలయంలో ఒక విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. చెప్పదలుచుకునేది మొత్తం చెప్పేసి అక్కడితో ఆ సభను ముగించారు. తమాషా ఏమిటంటే 175 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసిన పార్టీ అభ్యర్థులలో చాలామంది ఈ కార్యక్రమానికి రాలేదు.
వైసీపీతో కలిసి రాజకీయ ప్రస్థానం సాగించినది ఇక చాలునని, పోయిన డబ్బులు ఎటూపోయాయి- కుదిరితే వేరే పార్టీలో చేరడం లేకపోతే నిశ్శబ్దంగా ఉండడం అనే నిర్ణయానికి అభ్యర్థుల్లో చాలామంది వచ్చినట్లుగా తెలుస్తోంది. అలాంటి వారందరూ పలాయన మంత్రం పఠించడానికి సిద్ధంగానే ఉన్నారు.
అయితే జగన్మోహన్ రెడ్డి వారిలో నమ్మకం కలిగించడానికి రకరకాల మాయమాటలు చెబుతున్నారు. శిశుపాలుడి పాపాలు పండినట్టుగా చంద్రబాబునాయుడు పాపాలు పండడం అనేది అప్పుడే ప్రారంభం అయిందని, వచ్చే 2029 ఎన్నికల నాటికి ఇంతకంటె అతి పెద్ద మెజారిటీలతో ప్రజలు తమ పార్టీకి పట్టం కట్టబోతున్నారని జగన్ జోస్యం చెబుతున్నారు.
ఆయన పార్టీ వారికి ధైర్యం నూరిపోసే ప్రయత్నంలో ఉన్నారు. అయితే జగన్ మాయ మాటలు తెలుగు రాష్ట్రంలోని సామాన్య ప్రజల మీదనే పనిచేయలేదు. అలాంటిది పార్టీ నాయకులలో ధైర్యం నింపడం సాధ్యమేనా అని ప్రజలు నవ్వుకుంటున్నారు.