రేవంత్‌ను చూసైనా జగన్ పాఠం నేర్చుకోవాలి!

Saturday, March 29, 2025

వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనను తాను మోనార్క్ అనుకుంటారు. తను చెప్పిందే వేదం, చేసిందే శాసనం అని కూడా అనుకుంటారు. తాను రాజ్యం చేసిన రోజుల్లో ఆయన తనను మించిన వారు లేరు అన్నట్టుగానే వ్యవహరించారు. కానీ.. ఆయన పొరుగురాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చూసి నేర్చుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. రేవంత్ ఇప్పుడు అక్కడ సీఎం. అయినా సరే.. అంతకు ముందు ప్రభుత్వ  హయాంలో తన మీద నమోదైన కేసుల విచారణ సందర్భంగా ఆయన చాలా సాధారణ వ్యక్తిలాగా.. న్యాయస్థానానికి హాజరయ్యారు. ఇలాంటి పోకడను అసలు జగన్మోహన్ రెడ్డి నుంచి ఊహించడమైనా కుదురుతుందా? తన మీద హత్యాయత్నం జరిగిందని తానే కేసు పెట్టి, ఆ కేసు విచారణ అయింది ముగిస్తాం, ఒకసారి వచ్చి సాక్ష్యం చెప్పండి అని ఎన్ఐఏ కోర్టు పలుమార్లు అడిగినా సరే.. కనీసం కోర్టు వైపు వెళ్లకుండా బిజీ అని చెబుతూ నాటకాలాడి.. ఒక దళిత యువకుడి జీవితంతో ఆడుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు రేవంత్ వ్యవహరించిన తీరు నుంచి నేర్చుకోవాల్సినది చాలా ఉన్నదని పలువురు అంటున్నారు.

రేవంత్ రెడ్ది మీద గత భారాస ప్రభుత్వ హయాంలో వివిధ కేసులో నమోదు అయ్యాయి. అప్పట్లో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. పార్టీ ప్రెసిడెంట్ గా కూడా ఉన్నారు. మొత్తానికి ఆయన మీద 9 కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఆ కేసులు విచారణకు వచ్చాయి. విచారణ సందర్భంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా.. ఒక సాధారణ వ్యక్తి లాగా.. నాంపల్లిలోని సిటీ సివిల్ కోర్టుకు హాజరు అయ్యారు. అసలే ఇరుకుగా ఉండే నాంపల్లి గల్లీల్లోకి సీఎం కాన్వాయ్ కోర్టుకు హాజరు కావడం కోసం వచ్చింది. ఈ రాజకీయ కేసులు ఎలా తేలుతాయి.. ఆయన మీద ఆరోపణలు- శిక్షలు ఏమవుతాయి.. అనేదంతా అప్రస్తుతం. సీఎం హోదాలో ఉండి కూడా స్వయంగా కోర్టుకు హాజరు కావడం అనే మర్యాదను ఇక్కడ ప్రజలు గుర్తించాలి.

సీఎం అయినందుకు తనకు కొమ్ములు మొలిచాయని అనుకోకుండా.. న్యాయవ్యవస్థ పట్ల ఉన్న గౌరవాన్ని, నమ్మకాన్ని రేవంత్ ఈ సందర్భంగా నిరూపించుకున్నారనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది. జగన్మోహన్ రెడ్డి మీద అనేక అవినీతి, అక్రమార్జనల కేసులు చాలా కోర్టుల్లో పెండింగులో ఉన్నాయి. ఆయన 2019కి పూర్వం పాదయాత్ర చేస్తున్న సమయంలో మాత్రం విధిలేక ప్రతిశుక్రవారం కోర్టుకు ఎటెండ్ అవుతూ వచ్చారు. ఆరోజున పాదయాత్రకు విరామం ఇచ్చేవారు. అలాంటిది.. సీఎం అయిన వెంటనే.. సీఎంగా తను చక్కబెట్టవలసిన రాచకార్యాల ఒత్తిడి చాలా ఎక్కువగా ఉన్నది గనుక.. తనకు హాజరునుంచి మినహాయింపు కావాలంటూ అయిదేళ్లపాటూ రోజులు నెట్టేశారు. తన మీద అవినీతి కేసులు మాత్రమే కాదు కదా.. తాను బనాయించిన హత్యాయత్నం కేసు విషయంలో సాక్ష్యం చెప్పడానికి కూడా వెళ్లలేదు. కోడికత్తి నిందితుడు.. కేవలం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పకపోవడం వలన.. కొన్ని ఏళ్లపాటు బెయిలు దొరక్కుండా జైల్లోనే మగ్గిపోవాల్సి వచ్చింది. జగన్ తాను మోనార్క్ అనుకోకుండా ప్ర.జాస్వామ్యంలో వ్యవస్థలను గౌరవించడాన్ని రేవంత్ నుంచి నేర్చుకోవాలని పలువురు అంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles