గుంటూరుకు ‘అవతల- ఇవతల’ అంటూ వైసీపీ నాయకుల బుద్ధులను కేటగరైజ్ చేసిన కారుమూరి తీరుకు ఆ పార్టీ నేతలు సిగ్గుపడాలి. కారుమూరి మాటలు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వారికి ఎంత మేరకు హెచ్చరికలు అవుతాయో లేదో తెలియదుగానీ వైసీపీలో కాస్త బుర్ర ఉండి ఆలోచించగలిగిన నాయకులు మాత్రం తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కారుమూరి చేసిన వ్యాఖ్యలు, ఆ మాటల్లో వైసీపీ నాయకులను రెండు రకాలుగా వర్గీకరించి మాట్లాడడం వారికి చాలా అవమాన కరంగా ఉంది. కారుమూరి మాటలకు అధినేత జగన్ మురిసిపోతూ ఉండగా.. తమ నిరసనల్ని తెలియజేయడానికి ఆగ్రహంతో ఉన్నవారు జంకుతున్నారు.
ఇంతకూ కారుమూరి ఏం అన్నారు.. ‘‘ఈ మధ్య నేను తిరుపతి వెళ్లి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిశాను. ఆయనను కూడా ప్రభుత్వం చాలా ఇబ్బంది పెడుతోంది. కానీ మన ప్రభుత్వం మళ్లీ వస్తుంది. వాళ్లకు తెలియడం లేదు. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే.. గుంటూరుకు ఇవతల (అనగా గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర ప్రాంతాలు) ఇళ్లలో ఉన్న తెలుగుదేశం నాయకుల్ని బయటకు ఈడ్చుకొచ్చి కొడతాము. గుంటూరుకు అవతల (అనగా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం గుంటూరు) ఉన్న జిల్లాల్లో తెలుగుదేశం వాళ్లని ఎక్కడికక్కడ నరికి పారేస్తారు’’ అని కారుమూరి వ్యాఖ్యానించారు.
‘అవతల- ఇవతల’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యానం ఇప్పుడు వైసీపీ పార్టీలోనే పెద్ద రచ్చగా మారే అవకాశం కనిపిస్తోంది. కారుమూరి గుంటూరుకు అవతలి ప్రాంతం వైసీపీ నాయకుల్ని ఒకవైపు రాక్షసులుగా, నరహంతకులుగా చిత్రీకరిస్తున్నారని..అదే సమయంలో, గుంటూరుకు ఇవతల అంటూ తమ ప్రాంతం వారిని మాత్రం చాలా సౌమ్యులుగా చిత్రీకరిస్తున్నారని అవతలి ప్రాంత నాయకులు ఆవేశపడిపోతున్నారు. అవతలి వాళ్లు చంపేసేవాళ్లు, ఇవతలి వాళ్లంతా కేవలం కొట్టివదిలేసేంత మంచివాళ్లని కారుమూరి అభిప్రాయమా అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
అదే సమయంలో గుంటూరుకు ‘ఇవతలి’ వాళ్లు కూడా ఆగ్రహిస్తున్నారు. ‘అవతలి వాళ్ల’ను రోషం ఉన్న వాళ్లుగా.. ‘ఇవతలి వాళ్లను’ చేతగాని వాళ్లుగా భావిస్తున్నారా? అని వాళ్లు కూడా రెచ్చిపోతున్నారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ‘గుంటూరుకు అవతలి’ అనగా.. నరరూప రాక్షసుల కింద చిత్రీకరించిన కేటగిరీలోకే ఆయన కూడా చెందుతారు. మరి ఇలాంటి మాటలు మాట్లాడినందుకు కారుమూరిని ఆయన మందలించిన దాఖలాలు మాత్రం లేవు. తన ప్రాంతం వాళ్లని దుర్మార్గులుగా, రాక్షసులుగా కారుమూరి చిత్రీకరించినందుకు సిగ్గుపడిన దాఖలాలు కూడా లేవు. ఇలాంటి మాటలకు కూడా జగన్ ఆనందించడం మొదలైతే గనుక.. అది పార్టీ వినాశనానికి దారి తీస్తుందని పార్టీ సీనియర్లే అనుకుంటున్నారు.
కారుమూరి మాటలకు జగన్ సిగ్గుతో చితికిపోవాలి!
Sunday, April 27, 2025
