జగన్మోహన్ రెడ్డి తెలిసి చేశారో తెలియక చేశారో తెలియదు.. పురోహితులు కనీసం ఇలాగైనా ఆయనకు నిష్కృతి కలిగించాలని అనుకున్నారో ఏమో తెలియదు.. మొత్తానికి వారు చెప్పమన్నది, జగన్ చెప్పారు. కానీ చేయమన్నది మాత్రం చేయలేదు. తాడేపల్లి లోని వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో వినాయకచవితి ప్రత్యేకపూజల్లో పాల్గొన్న జగన్మోహన్ రెడ్డి.. సింపుల్ గా చెప్పాలంటే ఆ పూజలను ‘మమ’ అనిపించారు. తాను చేసిన అపరాధాలన్నీ దేవుడు క్షమించాలని ఆయన వేడుకున్నారు. కానీ.. అడగడం తప్ప.. అలా క్షమించడం కోసం ఆయన ఏమీ చేయకపోవడం గమనార్హం.
నిజానికి జగన్మోహన్ రెడ్డి వినాయకచవితి పర్వదినం నాడు విజయవాడలో జరిగే చవితి వేడుకల్లో పాల్గొనడానికి నిర్ణయించుకున్నారు. విజయవాడ రాణిగారితోట వద్ద చవితి వేడుకల్లో పాల్గొనేలా కార్యక్రమం నిర్ణయం అయింది. అయితే వార్షాల కారణంగా అక్కడికి వెళ్లడానికి జగన్ సుముఖత చూపించలేదు. తాడేపల్లి పార్టీ ఆఫీసులో జరిగిన పూజల్లో మాత్రం పాల్గొన్నారు.
నుదుట బొట్టుతో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న జగన్మోహన్ రెడ్డి.. కొబ్బరికాయ కొట్టి స్వామికి పూజచేశారు. ఈ సందర్భంగా పురోహితులు ఆయనతో కొన్ని మాటలు మాత్రమే పలికించారు. ‘‘అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోయం ఇతి మహమ్మత్వా విఘ్నేశ్వర సర్వ అపరాధ క్షమ్యతా మమ..’’ అంటూ పురోహితులు ఒక్కో పదమూ చెబుతుండగా.. జగన్ వాటిని తిరిగి ఉచ్ఛరించారు.
పురోహితులు ఉద్దేశపూర్వకంగానే జగన్ తో ఆ సంస్కృతమంత్రాలు పలికించారో ఏమో తెలియదు.. జగన్ అర్థం తెలియకుండా వారు చెప్పమన్నదెల్లా చెప్పారేమో తెలియదు. మొత్తానికి.. ఆయన ‘‘రాత్రీ పగలూ తేడాలేకుండా నేను చేసిన వేలాది తప్పులను క్షమించు స్వామీ.. నేను నా దాసుడనై ఉంటాను’’ అని అన్నారు. ఇలా తాను చేసిన వేల తప్పులను క్షమించాలని జగన్ ద్వారా చెప్పించిన తర్వాత.. పురోహితులు ‘అపరాధ సహస్రాణి క్షమ్యతా’ అంటూ.. ‘క్షమించేశాం’ అని సెలవిచ్చారు. అయితే.. వినాయకుడికి దణ్నం పెట్టుకుని.. లెంపలు వేసుకుని, అయిదు గానీ తొమ్మిదిగానీ గుంజీలు తీయాలని పురోహితులు చెప్పారు. జగన్ ఆ పని మాత్రం చేయలేదు. ఆయన పక్కనే పూజలో కూర్చొన్న మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ తాను గుంజీలు తీయడానికి ప్రయత్నించారు గానీ.. జగన్ పట్టించుకోకుండా ఉండడం చూసి తాను కూడా మిన్నకుండిపోయారు.
ఈ వైనం మొత్తం సాక్షిటీవీ లో చూసిన వారు మాత్రం.. నా తప్పులన్నీ క్షమించు.. అని నోటితో చెప్పేసి, కనీసం లెంపలేసుకోకుండా, గుంజీలు తీయకుండా అహంకారం ప్రదర్శిస్తే దేవుడు క్షమిస్తాడా? అని నవ్వుకోవడం విశేషం. తాను పలికిన మంత్రాల భావం తెలిసి ఉంటే.. జగన్ ఆ మాటలు అనేవాడే కాదని కూడా జనం అనుకుంటున్నారు.
అపరాధాలను క్షమించాలని వేడుకున్న జగన్!
Thursday, December 4, 2025
