చంద్రబాబును మాత్రం.. ‘ఆయన తొందరగా చనిపోవాలి..’ అనే రేంజిలో దుమ్మెత్తిపోయాలి. ఎన్నికల్లో అక్రమాలు జరగడం వల్ల, ఈవీఎంలు మాయ చేయడం వల్ల మాత్రమే ఆయన గెలిచి అధికారంలోకి వచ్చాడని బురద చల్లాలి. కానీ.. ప్రధాని నరేంద్రమోడీని మాత్రం పల్లెత్తు మాట అనడానికి ధైర్యం లేదు. ఒకవైపు ఓటు చోరీ అనే ట్యాగ్ లైన్ తో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ పెద్ద పోరాటమే నడిపిస్తుండగా.. ఏపీలో పెరిగిన ఓట్ల గురించి మాట్లాడకుండా.. ఏపీలో చంద్రబాబు విజయం గురించి మాట్లాడకుండా రాహుల్ తప్పు చేశాడని అనడం ద్వారా.. జగన్మోహన్ రెడ్డి తనను తానే ఇరుకున పెట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. ఏపీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణికం టాగూర్ తో పాటు, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దౌర్బల్యాన్ని ఎత్తిచూపుతున్నారు. ఆయనకు దమ్ముంటే విజయవాడలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించే ర్యాలీలో తాను కూడా పాల్గొనాలని వారు సవాళ్లు విసురుతున్నారు.
బీహార్ లో ఓటర్ల జాబితా సవరణల గురించి ఒకవైపు రాహుల్ గాంధీ నిశిత విమర్శలతో రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే. ఈసీని, భారతీయ జనతా పార్టీని, ప్రధాని నరేంద్రమోడీని ఒకే గాటన కట్టేసి రాహుల్ గాంధీ తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. బిజెపి నాయకులు ఆయనకు కౌంటర్లు ఇస్తున్నారు. ఈసీ రాతపూర్వక ఫిర్యాదు ఇవ్వాలని అంటుండగా.. ఆ పని మాత్రం చేయకుండా.. తన ప్రెస్ మీట్ ను బట్టే.. చర్యలు తీసుకోవాలన్నట్టుగా రాహుల్ రెచ్చిపోతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. రాహుల్ లేవనెత్తిన ఓట్ల మతలబు అంశంలో, ఆయనకు మద్దతుగా దేశవ్యాప్తంగా ప్రజాందోళనలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీల మద్దతుతో ప్లాన్ చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి.. కడపజిల్లాలో జరిగిన జడ్పీటీసీ ఉపఎన్నికల గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఏదో ఓడిపోతున్న సీటు గనుక.. తమ అడ్డా అని చెప్పుకునే డొల్లతనం బయటపడిపోతుంది గనుక.. ఆయన ఆవేదనతో బురద చల్లడంలో అర్థముంది. ఆయన ఏ నిందలు వేయదలచుకున్నా సరే.. కడప ఎన్నికల వరకు పరిమితమై ఉంటే ఆయనకు చాలా మర్యాదగా ఉండేది. కానీ.. రాహుల్ ను విమర్శిస్తే తాను జాతీయ స్థాయి నాయకుడు అయిపోతానని భ్రమించారో ఏమోగానీ.. అనవసరంగా ఆ టాపిక్ ఎత్తుకున్నారు.
ఓట్ల చోరీ గురించి మాట్లాడుతున్న రాహుల్ గాంధీ.. ఏపీలో ఓటింగ్ తర్వాత పెరిగిన ఓట్ల గురించి ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ఒక వక్రవాదన తెరపైకి తెచ్చారు. రాహుల్ గాంధీ, చంద్రబాబు కుమ్మక్కు అయి రాజకీయాలు నడుపుతున్నారని.. చంద్రబాబు తరఫు రాహుల్ గాంధీ వద్దకు దూతలాగా రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని అర్థం వచ్చేలా అర్థంపర్థంలేని విమర్శలు చేశారు. దీంతో సహజంగానే కాంగ్రెస్ శ్రేణులకు మంట పుట్టింది.
జగన్ కు దమ్ముంటే.. ఈవీఎంలలో అక్రమాలు జరిగాయని భావిస్తే.. మోడీ మీద విమర్శలు చేయాలి గానీ.. ఆయన ముందు సాగిలపడుతూ రాహుల్ ను ఆడిపోసుకుంటే ఏం వస్తుందని అంటున్నారు. జగన్ కు దమ్ముంటే కాంగ్రెస్ ర్యాలీలోకి రావాలని కూడా అంటున్నారు. మోడీ కి నచ్చని ఏ పని చేయడానికైనా జగన్మోహన్ రెడ్డికి దమ్ములేదనే బలహీనత తెలిసిన వారు గనుకనే.. వారు అలాంటి సవాళ్లు విసురుతున్నట్టుగా అందరూ అనుకుంటున్నారు.
