మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తాను రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేయాల్సిందిగా షెడ్యూలు ప్రకటించి పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చేసరికి కూటమి ప్రభుత్వం భయపడుతున్నదనే భ్రమలో ఏమైనా బతుకుతున్నారేమో. ఒకసారి ఆయన నిద్ర నుంచి మేలుకుని తన సొంత పార్టీ ఎలా కూలిపోతున్నదో జాగ్రత్తగా చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఉద్యమాలకోసం జగన్ ఇస్తున్న పిలుపుకు జడుసుకుని ఆ పార్టీ సీనియర్ నాయకులు ఇద్దరు ఒకే రోజు రాజీనామాలు చేయడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా నడుస్తోంది. వైసీపీకి చెందిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఇద్దరూ కూడా గురువారం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసేశారు.
రాజీనామాలు సరే.. ఈ సందర్భంగా పెట్టిన ప్రెస్ మీట్ లో అవంతి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలను కీలకంగా గమనించాలి. భవిష్యత్తులో తాను ఏ రాజకీయ పార్టీలో చేరబోయేది ఆయన ప్రకటించలేదు గానీ.. నిజం చెప్పాలంటే.. జగన్ దుర్బుద్ధులను ఆయన తీవ్రంగా ఎండగట్టారు. జగన్మోహన్ రెడ్డికి తన తండ్రి అనుసరించిన పాలసీ తెలుసో లేదో.. అవంతి గుర్తు చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గెలిచిన తర్వాత.. హామీల అమలు గురించి ఎవరైనా ప్రశ్నిస్తే ప్రజలు మమ్మల్ని అయిదేళ్లపాటు అధికారంలో ఉండమని అవకాశం ఇచ్చారు. ఆలోగా హామీలు నిలబెట్టుకోవాలి.. తొందరేం లేదు- అని చెప్పేవారని అవంతి గుర్తు చేస్తున్నారు. అలాంటి నేపథ్యంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఇప్పటికే తమ హామీలు నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతుండగా.. ఆరునెలల గడువు కూడా గడవక ముందే.. అయిదో నెలనుంచే హామీలు నెరవేర్చలేదు కాబట్టి.. వారి మీద పోరాటాలు చేయాలని పిలుపు ఇవ్వడం సరికాదు అని అవంతి హెచ్చరించారు. జగన్ తాడేపల్లి ప్యాలెస్ లో కూచుని ఆదేశాలు చేస్తూ ఉంటే పాటించడానికి కార్యకర్తలు సిద్ధంగా లేరంటూ ఆయన తిప్పికొట్టారు. ఎన్నికల్లో ఓడిపోయి కార్యకర్తలు చాలా కష్టాల్లో ఉన్నారని అంటున్నారు. అయిదేళ్లు అధికారంలో ఉండి జగన్ నాయకులకు, కార్యకర్తలకు ప్రజల్లో విలువలేకుండా చేశారని ఆరోపిస్తున్నారు. ఇన్ని పనులు చేసిన ఎందుకు ఓడిపోయారో జగన్ చెక్ చేసుకోవాలని అంటున్నారు.
జగన్ జరుగుతున్న నష్టాన్ని గుర్తించే స్థితిలో ఉన్నారని అనుకోవడం కూడా భ్రమ. ఒకే రోజున ఇద్దరు సీనియర్ నాయకులు ఇప్పటికే గుడ్ బై కొట్టారు. ఆల్రెడీ ఇదివరలో పార్టీని వీడిపోయిన వారు అనేకమంది ఉన్నారు. జగన్ అనుకుంటున్న ఉద్యమాలు మొదలయ్యేలోగా.. పార్టీ నుంచి ఇంకా ఎందరు వెళ్లిపోతారో ఆయన చూసుకుంటే బాగుంటుందని జనం నవ్వుకుంటున్నారు.
జగన్ జర చూస్కో : వికెట్లు టపటపా రాల్తున్నాయ్!
Wednesday, January 15, 2025