ఓట్టు దండుకోవడానికి ఎక్కడికక్కడ కొత్త అబద్ధాలను తయారు చేయడం, ప్రజలను మాయ చేయడానికి కేవలం మాటలతోనే గారడీ చేయడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి బాగానే సాధన చేస్తున్నారు. విశాఖపట్నంను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేస్తున్నానే మాయమాటలతో అయిదేళ్లు వెళ్లదీశారు. విశాఖకు రాజధాని ఇదిగో వచ్చేస్తోంది, అదిగో వచ్చేస్తోంది.. వచ్చే నెల నుంచి నేను కాపురం కూడా ఇక్కడకే మార్చేస్తున్నా వంటి మాయమాటలతో మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. తాజాగా అలాంటిదే మరో అబద్ధాన్ని కూడా విశాఖ, ఉత్తరాంధ్ర ప్రజల మీదికి సంధిస్తున్నారు. తాను గెలిస్తే విశాఖలోనే పదవీ స్వీకార ప్రమాణం చేస్తున్నానని అంటున్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. విశాఖకు రాజధానిని తరలించడానికి ఉన్న న్యాయపరమైన చిక్కుల గురించి దాచిపెట్టి అక్కడి ప్రజలను దారుణంగా వంచిస్తున్నారు. అమరావతి ఒక్కటే రాజధాని అని, విశాఖకు ఏ ఒక్కప్రభుత్వ కార్యాలయాన్నికూడా తరలించడానికి వీల్లేదని ఏపీ హైకోర్టు చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చింది. జగన్ ప్రభుత్వం దాని మీద సుప్రీం లో అప్పీలు చేసింది. అక్కడ తీర్పు ఇంకా తేలలేదు. హైకోర్టు తీర్పునే సుప్రీంకోర్టు కూడా ధ్రువీకరిస్తే ఇక జగన్ చేయగలిగింది ఏమీ లేదు. కానీ సుప్రీం తేల్చేదాకా తాను ఏమీ చేయలేను అనే సంగతిని దాచిపెడుతూ.. విశాఖకు రాజధాని తెచ్చేస్తున్నా లాంటి అబద్ధపు మాటలు చెబుతూ ఉన్నారు. ఈసారి గెలిచిన తర్వాత విశాఖ నుంచే పరిపాలన ఉంటుందని కూడా గతంలో జగన్ చెప్పారు. అదొక్కటే కాదు.. తాజాగా తన పదవీ స్వీకార ప్రమాణం కూడా విశాఖలోనే చేస్తానంటున్నారు.
పదవీ స్వీకార ప్రమాణం అనేది అసలు పెద్ద విషయం కానే కాదు. ఆయన తలచుకుంటే ఇడుపులపాయలో కూడా ప్రమాణం చేయవచ్చు.. కానీ.. అంతమాత్రాన ఇడుపులపాయ రాజధాని అయిపోదు. సుప్రీంకోర్టులో కేసు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే తప్ప విశాఖ రాజధాని కావడం జరగదు.
కానీ.. క్షేత్రస్థాయిలోని వాస్తవం ఏంటంటే… ‘విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధాని’ అనే మాటను జగన్ ఏదో ప్రజలకు తాయిలం పెడుతున్నట్టుగా అనుకుంటున్నారు గానీ.. ఆ మాట వింటేనే… విశాఖ, ఉత్తరాంధ్ర వాసులు భయపడిపోతున్నారు. జగన్ అలాంటి మూడు రాజధానుల ప్రకటన చేసిన తర్వాత.. విశాఖ వ్యాప్తంగా భూకబ్జాలు, భూదోపిడీలు, దందాలు ఏస్థాయిలో పెరిగిపోయాయో వారు స్వయంగా చూస్తున్నారు. రాజధాని అనేది వస్తే.. ఇలాంటి హింస దందాలను శాశ్వతంగా భరిస్తూ ఉండాలేమో అని భయపడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో మళ్లీ రాజధాని, ప్రమాణ స్వీకారం అనే అబద్ధాలు జగన్ చెప్పినా..ఆయన పార్టీ చేటు తప్ప మేలు జరగదని ప్రజలు అనుకుంటున్నారు.
ఉత్తరాంధ్రపై ఇంకో అబద్ధం వదలిన జగన్!
Saturday, December 21, 2024