జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో చాలా చాలా తప్పుడు పనులు జరిగాయి. ఆయా తప్పుడు పనులకు పాల్పడిన వారు.. ఇప్పుడు మూల్యం చెల్లించుకోవడం అనేది జరుగుతూ వస్తోంది. కానీ.. ప్రజలు అత్యంత దారుణంగా తిరస్కరించిన తర్వాత ఏడాది గడిచినా కూడా జగన్ కు సత్యం బోధపడడం లేదు. ప్రజలు ఎందుకు తిరస్కరించారో ఆయనకు అర్థం కావడం లేదు. ఇప్పటికీ అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నారు. ఆయన జమానా కాలంలో.. ఆయన అండ చూసుకుని, లేదా ఆయనతో కలిసి కుమ్మక్కు అయి, ఆయన తాలూకు దందా నడిపించడానికి అనేకమంది రకరకాల తప్పుడు పనులు చేశారు. వారంతా ఇప్పుడు అరెస్టు అవుతున్నారు. అయితే.. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం మీద నిందలు వేస్తున్న జగన్మోహన్ రెడ్డి.. చిత్రవిచిత్రంగా మాట్లాడుతున్నారు. ఒక వ్యక్తిని అరెస్టు చేయడం అంటే.. వారి వ్యక్తిగత పరువు, ప్రతిష్ఠకు భంగం కదా.. కూటమి ప్రభుత్వం అలాంటి తప్పులు చేస్తున్నది అని జగన్మోహన్ రెడ్డి ప్రవచనాలు చెబుతున్నారు.
కానీ.. విషయం ఏంటంటే, పరువు పోవడం అనేది అరెస్టు అయినప్పుడు, జైలుకు వెళ్లినప్పుడు జరగదు. వారు ఆ తప్పు చేసినప్పుడే పరువు పోతుంది. ఫరెగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి యొక్క పరువు ఏమైనా ఉండి ఉంటే గనుక.. అది ఆయన కొత్త లిక్కర్ పాలసీ తీసుకువచ్చినప్పుడే పోయింది. దుకాణాలను ప్రభుత్వం పరిధిలోకి తెస్తున్నాను అని ప్రకటించి.. మద్యం ధరలను అమాంతం పెంచేసి.. అత్యంత నాసిరకం, కల్తీ, చవకబారు మద్యం మాత్రమే అందుబాటులో పెట్టినప్పుడే ఆయన దీని వెనుక ఏదో కుట్ర చేస్తున్నారని ప్రజలు గుర్తించారు. ఆయన పరువు ప్రతిష్ఠలు ఏమైనా ఉండి ఉంటే ప్రజలు లిక్కర్ వ్యాపారంలో జరుగుతున్న ద్రోహాన్ని గుర్తించినప్పుడే అవి మంటగలిసిపోయాయి. ప్రజలు ఆ ద్రోహాల్ని గుర్తించారు గనుకనే.. అంత దారుణంగా ఆయనను ఓడించారు. అత్యంత ఘోరంగా 11 సీట్లు మాత్రం కట్టబెట్టారు. కానీ.. తన పరువు ఎప్పుడు పోయిందో ఆయన గుర్తించలేదు.
అరెస్టు అయినప్పుడు, జైల్లో పెట్టినప్పుడు పరువు పోతుంది కదా అని మాట్లాడుతున్నారు. ప్రస్తుతానికి జగన్ ఇంకా లిక్కర్ కేసులో ఇంకా అరెస్టు కాకుండా బాహ్యప్రపంచంలో తిరుగుతూ ఉండవచ్చు గాక! ఆయన ఇప్పటిదాకా ఈ లిక్కర్ కేసులో జైలుకు వెళ్లలేదు గాబట్టి.. ఆయనకు పరువు వున్నదని ఆయన అనుకుంటే భ్రమల్లో బతుకుతున్నట్టే లెక్క.. అని ప్రజలు అనుకుంటున్నారు. జగన్ ఇలాంటి భ్రమల్లో బతుకుతూ, వాస్తవాల్ని గుర్తించకుండా, ప్రజల్లోని ఏహ్యభావాన్ని గుర్తించకుండా ఏదేదో ఊహించుకుంటూ, లాజిక్ లేకుండా పరువు గురించి మాట్లాడుతూ ఉంటే.. నష్టం జరిగేది ఆయనకే అని ప్రజలు భావిస్తున్నారు.
పరువు ప్రతిష్ఠలు పోయేది అప్పుడు కాదు జగన్!
Friday, December 5, 2025
