ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తన భజన కోసం సొంత కరపత్రికను, టీవీ ఛానెల్ ను కలిగి ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఆయన ఏం చేస్తే అది అద్భుతం అనడానికి, ఆయనకు నిత్యస్తోత్రాలతో తరించడానికి ఆయన సొంత మీడియా ప్రయత్నించడంలో తప్పులేదు. కానీ సొంత డబ్బా కొట్టుకోవడంలో కూడా ఒక హద్దు ఉండాలి. లేకపోతే ప్రజలకు వెగటు పుడుతుంది. ఇప్పుడు అదే జరుగుతోంది. హర్యానా ఎన్నికల ఫలితాల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేశారు. బిజెపి గెలిచిన ఫలితాల గురించి ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఈ ట్వీట్ ను పురస్కరించుకుని జగన్మోహన్ రెడ్డి ఈ దేశానికి మార్గదర్శకుడు అని, దేశంలోని భాజపాయేతర పార్టీలు అన్నీ కూడా ఆయన వెంట నడవాల్సిందే అని ఆయన భజన మీడియా ప్రస్తుతిస్తుండడం మరీ ఏవగింపు కలిగిస్తోంది.
జగన్మోహన్ రెడ్డి హర్యానా ఎన్నికల ఫలితాలను కూడా ఏపీ ఎన్నికల ఫలితాలతో పోల్చారు. రెండు చోట్ల అనూహ్యమైన ఫలితాలు వచ్చాయనేది ఆయన బాధ. ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారని, ప్రజాభిప్రాయం మొత్తం ఒక రకంగా ఉంటే.. ఫలితం మరో రకంగా వచ్చిందని ఆయన సెలవిస్తున్నారు. అయిదేళ్ల పాటు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే.. కించిత్తు అభివృద్ధి లేకుండా రాష్ట్రాన్ని పడకేయించిన జగన్మోహన్ రె డ్డి, దేశం మొత్తాన్ని తిరోగమన పథంలో తీసుకువెళ్లడానికి కొత్త ఆలోచనలు చేస్తున్నారు. ఈవీఎంలలో అక్రమాల ద్వారా బిజెపి గెలుస్తున్నదని.. దేశంలో తిరిగి పేపర్ బ్యాలెట్ తో ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉన్నదని ఆయన అంటున్నారు.
ఆయన ఇలా ట్వీట్ చేశారో లేదో.. ఆయన భజన మీడియా తందానపాడడం ప్రారంభించింది. దేశంలో ఇలాంటి అద్భుతమైన ఆలోచన మరొక నాయకుడు చేయనేలేదని.. దేశమంతా బిజెపి విజయాల మీద ప్రజల్లో సందేహాలు తలెత్తుతున్నాయని, ఎన్డీయేతర పార్టీలన్నీ కూడా ఇప్పుడు జగన్ వెంట నడవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు అంటున్నారు. దేశాన్ని పేపర్ బ్యాలెట్ ఎన్నికల వైపు తీసుకువెళ్లే దిశగా జగన్మోహన్ రెడ్డి మార్గదర్శకుడి పాత్ర పోషిస్తున్నారని కీర్తిస్తున్నారు.
అయితే ప్రజలు మాత్రం.. ఏపీలో ఇంకో ఏడాదిలోగా జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల బ్యాలెట్ పద్ధతిలోనే జరుగుతాయి. ఆ సమరాన్ని ఎదుర్కోవడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధమేనా అని ప్రశ్నిస్తున్నారు.